-లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించండి -తెల్లకాగితంపై దరఖాస్తు ఇవ్వడంలో అవగాహన పెంచాలి: మంత్రి ఈటెల -కార్డులు, పెన్షన్లపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -గడువు తేదీ పెంచే యోచనలో ప్రభుత్వం -15న నిర్ణయిస్తామన్న సీఎస్ రాజీవ్‌శర్మ
ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మంజూరు చేయాలనుకుంటున్న ఆహార భద్రత కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తుల స్వీకరణపై ఆయన సోమవారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోపాటు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రజలు దరఖాస్తులను తెల్లకాగితంపైనే ఇవ్వాలన్నదానిపై అవగాహన పెంపొందించాలన్నారు. కొత్తగా ఇచ్చే పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల వల్ల అసలైన లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరుగదని ప్రజలకు వివరించాలని మంత్రి కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లాలోని వివరాలను మంత్రికి వివరించారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 850 చౌకధరల దుకాణాలు ఉన్నాయని, వీటిద్వారా 52 వేల దరఖాస్తులు ఆహారభద్రత కార్డులకోసం అందాయని తెలిపారు. 16 మండలాల నుంచి పెన్షన్లు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులకోసం 160 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిద్వారా ఇప్పటి వరకు 14,254 దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటిని పరిశీలించడానికి సుమారు 45 రోజుల సమయం పడుతుందని ఈటెలకు చెప్పారు. ఆహారభద్రత కార్డుల కోసం 3.35 లక్షల దరఖాస్తులు, పెన్షన్లకోసం 2.18 లక్షల దరఖాస్తులు అందినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ఆహార భద్రత కార్డుల కోసం 2,93,778 దరఖాస్తులు, పెన్షన్లకోసం 1,35,474 దరఖాస్తులు అందినట్లు ఆ జిల్లా కలెక్టర్ కిషన్ వివరించారు. తమ జిల్లాలో మొత్తం 4.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నల్లగొండ కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల కలెక్టర్ల నుంచి మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి అందిన దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా పరిశీలించాలని, పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలు తెల్ల కాగితాలపై ఇచ్చే దరఖాస్తులలో వారి పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇంటి నంబర్, గ్రామం, పట్టణం, జిల్లా పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి సంబంధించిన ఫోన్ నంబర్లను కూడా దరఖాస్తులో నమోదు చేయించాలని, అధికారులకు సందేహాలు ఉంటే వారు ఇచ్చే ఫోన్ నంబర్‌లో సంప్రదించి, వాటిని నివృత్తి చేసుకునేలా ఉండాలని ఆర్థిక మంత్రి అధికారులకు సూచించారు.
వేల సంఖ్యలో ప్రజల నుంచి దరఖాస్తులు వస్తున్నందున ఈ నెల 15లోపు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాదని కొందరు జిల్లా కలెక్టర్లు తెలుపడంతో, గడువు తేదీని కొన్ని రోజులు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై 15వ తేదీన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వీ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి మీనా, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరుల పాల్గొన్నారు.