Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు

– వికలాంగుల గుర్తింపునకు నియోజకవర్గాల్లో సదరం క్యాంపులు – కలెక్టర్లకు డాటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్ ఎడిట్ ఆప్షన్ సదుపాయం – జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్

KTR-Video-Conference-With-District-Collectors01

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఆసరా పథకంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల ధ్రువీకరణ జరుగుతున్న తీరుపై సోమవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వానికి పింఛన్లు తగ్గించాలనే ఆలోచన లేదని, పింఛన్ల జారీలో ఎలాంటి సీలింగ్ లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం సుమారు 24లక్షల 50వేల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. ఇంకా కొన్నిచోట్ల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పింఛన్ల కేటాయింపులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలలోని స్ఫూర్తిని అర్థం చేసుకుని పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

జీవోలో పేర్కొన్న ప్రైవేటు ఉద్యోగులు, ఫోర్‌వీలర్ వాహనాలు, స్వయం ఉపాధి లాంటి అర్హతలపై అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకోవాలని, అర్హులైనవారికి అన్యాయం జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ డాటాలో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించిన మంత్రి కేటీఆర్.. తిరస్కరణకు గురైన దరఖాస్తులపై కారణం తెలుపుతూ దరఖాస్తుదారుడికి లేఖ రాసే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు, పీడీలకు డాటా ఎంట్రీ సాఫ్ట్‌వేర్ ఎడిట్ ఆప్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. అర్హులకు పింఛన్లు ఇవ్వాలనే నిబద్ధతతో ఉన్న ప్రభుత్వం.. అనర్హులకు ఇచ్చే అధికారుల పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మండలాలవారీగా సంపూర్ణ ధ్రువీకరణ పూర్తిచేసి, సాచ్యురేషన్ పద్ధతిలో పింఛన్లు ఇవ్వాలని, వికలాంగుల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో అంగవైకల్య ధ్రువీకరణ శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకోసం అవసరమైతే ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వైద్యాధికారులను ఉపయోగించుకోవాలన్నారు. నిరాదరణకు గురైన మహిళల జాబితాను సిద్ధం చేయాలని, దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్లకు మంత్రి తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీపై అనుమానాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను అడిగి నివత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జే రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల: మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నూతనంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు ఇప్పటికే పొందినట్లు, కళాశాల నిర్మాణం కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని ఉన్న సర్థాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పది ఎకరాల్లో ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. విద్యార్థులకు అందుబాటులో ఉంటూ, రవాణా సౌకర్యం గల స్థలాన్ని గుర్తించాలని మంత్రి చేసిన సూచన మేరకు సిరిసిల్ల రెవెన్యూ అధికారులు సర్థాపూర్‌ను ఎంపిక చేశారు. కళాశాల నిర్మాణానికి మొదటి ఏడాది రూ.2.4కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి చెప్పారు. నిర్మాణానికి ఈ వారంలో శంఖుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.