Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అపోహలు పటాపంచలు చేశాం

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన అన్ని రకాల దుష్ప్రచారాలు, అనుమానాలను పటాపంచలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణ వస్తే ఇక్కడినుంచి ఐటీ పరిశ్రమ తరలిపోతుందని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని ఎన్నో రకాల భయసందేహాలను సృష్టించారని ఆయన గుర్తు చేశారు. అయితే గత ఏడాది కాలంలో ఏ ఒక్క ఐటీ కంపెనీ తరలిపోకపోగా గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు నగరానికి తరలివచ్చాయని గుర్తు చేశారు. అలాగే నగరంలో ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదని చెప్పారు. -సమస్యల మూలాల్లోంచి పరిష్కరిస్తున్న కేసీఆర్ -హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలుపుతున్నాం -నాడు వ్యతిరేకించిన వారూ ప్రశంసిస్తున్నారు -కోతల్లేని కరెంటు మా సామర్థ్యానికి నిదర్శనం -హైదరాబాద్ అంటే 40 శాతం జనాభా -చంద్రబాబువన్నీ ఒట్టి గప్పాలు -తెలంగాణ ఎప్పుడూ మిగులురాష్ట్రమే -ఏపీలో తంతారనే ఇక్కడ మహానాడు -టీఆర్‌ఎస్‌లో నెంబర్ టూ ఎవరూ లేరు -మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్

KTR press meet in press club

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆర్ రవికాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత తమ ప్రభుత్వ విధానాలను వివరించి అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. బిడ్డకు తొలి ఐదేండ్లు ఎలా కీలకమో…తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తుకు ఈ ఐదేండ్లు అంతే కీలకం.

సంక్షేమం అభివృద్ధి అంశాలను తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని కేటీఆర్ చెప్పారు. సంక్షేమ పాలనలో భాగంగా అర్హులందరికీ పింఛన్లు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, వంటి పథకాల గురించి దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాలు చర్చించుకుంటున్నాయని, సంక్షేమ రంగానికి మేం 9వేల కోట్లుగా ఉన్న బడ్జెట్‌ను 27,000 కోట్లు చేశామంటేనే మా చిత్తశుద్ధిని తెలుసుకోవచ్చునని చెప్పారు.

అధికార మార్పిడి కాదు… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనేది ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారం చేపట్టిన రీతిలో జరిగే మామూలు వ్యవహారం కాదని కేటీఆర్ చెప్పారు. ఒక అసాధారణ పరిస్థితిలో రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం మీద ప్రజల్లో కోటి ఆశలున్నాయని వాటన్నింటినీ ఒకటొకటిగా నెరవేర్చే గురుతర భాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని తెలిపారు.

ఏ సమస్యనైనా పైపై మెరుగులతో కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా తమ ప్రభుత్వం మీద అనేక దుష్ప్రచారాలు సాగిస్తున్నారని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే కరెంటు సంక్షోభం వస్తుందని భయపెట్టారని పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన హయాంలోనే ఇందిరాపార్కుముందు విద్యుత్ కోతలకు నిరసనగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారని తెలిపారు.

తెలంగాణకు వారసత్వంగా వచ్చిన కరెంటు సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి ఏడాదిలోపే ఆ సమస్యను ప్రశంసనీయంగా పరిష్కరించారన్నారు. ఇంట్లో, ఆఫీసులో డాష్ బోర్డులు పెట్టుకొని మరీ విద్యుత్ పరిస్థితిని సీఎం సమీక్షించారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఈసారి అత్యంతభారీ స్థాయిలో ఎండలున్నా కోతలు లేకుండా కరెంటు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇటీవల ఫ్యాఫ్సీలో జరిగిన సమావేశంలో మీ సర్కారు పనితీరుతో మా బిజినెస్ దెబ్బతిన్నదని జనరేటర్లు, ఇన్వర్టర్ల పారిశ్రామికవేత్తలు చమత్కరించారని తెలిపారు. మ్యానిఫెస్టోలో లేకపోయినా ఇంటింటికీ నల్లా కార్యక్రమం తీసుకున్నామని, మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 45,600 చెరువులను పునరుద్దరించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

లక్ష్యం సాధించిన అమెరికా పర్యటన రెండు వారాల పాటు సాగిన తన అమెరికా పర్యటన లక్ష్యాలు సాధించిందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల అధినేతలు మూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని తెలిపారు. గూగుల్, అమెజాన్‌లు తమ అతిపెద్ద ఆఫీసుల విస్తరణకు తెలంగాణను ఎంచుకున్నాయని, డీఈషా, బ్లాక్‌స్టోన్ 1300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యరని పేర్కొన్నారు.

ఇవాళ అమెరికాలోని అనేక ప్రముఖ కంపెనీల ప్రముఖులు హైదరాబాద్‌తో ఏదో రకంగా సంబంధం ఉన్నవారే కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల కు హైదరాబాద్‌తో అనుబంధం ఉండగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారని తెలిపారు. 24,000 కోట్ల విలువగల కేబుల్ నెట్‌వర్క్స్ అధినేత సయ్యద్ అలీ, అరుబా సంస్థల అధినేత కీర్తిమెల్కొటో హైదరాబాద్ వాసులేనన్నారు.

ఐప్లెడ్ మెటీరియల్స్ సీటీవో ఓం నలమాసు కరీంనగర్ వాసి అని వారందరితో ఈ పర్యటనలో సమావేశమయ్యామని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో హైదరాబాద్‌ను పారిశ్రామికంగా దేశంలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మంత్రి చెప్పారు. దేశంలోనే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు తర్వాతి స్థానంలో మనమే ఉన్నామని, రానున్న ఐదేండ్లలో ఐటీ ఎగుమతులు 57,000 కోట్లనుంచి 1,14,000కు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

ఐటీ నిపుణుల సేవలు ఉద్యోగాలకే కాకుండా ఆవిష్కరణకు ఉపయోగించుకోవాలనేది తమ లక్ష్యమని అంటూ ఫేస్‌బుక్, వాట్సప్ స్థాయి ఆవిష్కరణలను సాధించే సత్తా మన తెలంగాణ బిడ్డలకు ఉందని చెప్పారు. దీన్ని ప్రోత్సహించే దిశగా టీ హబ్ కార్యక్రమం తీసుకున్నామని వచ్చే నెలలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎప్పుడు సమయం ఇస్తే అపుడు ఆవిష్కరిస్తామని తెలిపారు.

హైదరాబాద్ అంటే ఐదుజిల్లాల అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి అంటే మళ్లీ కేంద్రీకరణా అన్న పాత్రికేయుల ప్రశ్నకు జవాబిస్తూ ఇవాళ హైదరాబాద్ అంటే ఎంసీహెచ్ పరిధికి పరిమితం కాదని, హెచ్‌ఎండీఏ పరిధిలో చుట్టూ ఐదు జిల్లాలు చేరాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 30 శాతం భూభాగం, 40 శాతం జనాభా ఈ పరిధిలోనే నివసిస్తున్నారు. కాగా రాష్ట్రం అమలు చేయనున్న పారిశ్రామిక విధానంలో ఉన్న ప్రాధాన్యత రంగాల్లో కేవలం మూడు మాత్రమే హైదరాబాద్ పరిధిలోకి వస్తాయని మిగిలినవన్నీ ఆయా జిల్లాల్లోనే ఏర్పాటవుతాయని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన టీఎస్‌ఐపాస్‌ను వచ్చేనెల ఆవిష్కరించనున్నామని తెలిపారు. ఇందులో రెండు విశిష్ట లక్షణాలున్నాయని తెలిపారు.

మొదటిది 16 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తాం. ఒకవేళ 16 రోజుల్లో ఇవ్వకుంటే… ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. రెండోది సర్కారు బాధ్యతగా వ్యవహరించలేదని పారిశ్రామికవేత్తలు కోర్టుకు కూడా వెళ్లే అవకాశాన్ని మేం పొందుపర్చనున్నాం. ఈ విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని కేపీఎంజీ సంస్థల చైర్మన్ జాన్‌వేహ్ మేయర్ అభినందించారు అని చెప్పారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు వస్తున్నాయని, కామారెడ్డిలో రాజీవ్ రెడ్డి , వరంగల్‌లో డల్లాస్‌కు చెందిన వరంగల్ వాసి బీపీవోలు ప్రారంభించనున్నారని తెలిపారు.

మైక్రోమాక్స్, సెల్‌కాన్, ఇంటెక్స్ వంటి సెల్‌ఫోన్ల తయారీ కంపెనీలతో పాటు…ఎంఆర్‌ఎఫ్ , మహీంద్రా ఆండ్ మహీంద్రా వంటి కంపెనీలను హైదరాబాద్ పొరుగుజిల్లాల్లో ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ)లను ఆదుకుంటామని గచ్చిబౌలిలో ఎంఎస్‌ఎంఈ టవర్‌ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వానికి తెలుసునని అంటూ తొమ్మిది నిమిషాల్లో చేయాల్సిన ఐఏఎస్‌ల విభజన తొమ్మిది నెలలు పట్టిందని, ఉద్యోగుల విభజన ఇంకా సాగుతోందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు రాబోయే రెండేళ్లలో లక్ష పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు.

బెంగళూరును చూసి నేర్చుకో బాబు… హైదరాబాద్ అభివృద్ధిపై, తెలంగాణ మిగులు ఆదాయంపై చంద్రబాబు ప్రచారాలను కేటీఆర్ కొట్టి వేశారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన బీపీఆర్ విఠల్ 1956లో జరిపిన కేస్‌స్టడీ మేరకు హైదరాబాద్‌కు అప్పటికే రూ.6కోట్ల మిగులు ధనం ఉంది. 1968లో ఆయనే మళ్లీ చేసిన కేస్‌స్టడీలో కూడా తెలంగాణ సర్‌ప్లస్ స్టేట్. 2001లో అదే విఠల్‌గారు మరో స్టడీ చేసినా సర్‌ప్లస్ స్టేట్ అని తేలింది. అంటే..చంద్రబాబు పుట్టకముందు…రాజకీయాల్లోకి రాకముందు..అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ఎప్పుడూ తెలంగాణ సర్‌ప్లస్ స్టేట్‌గానే ఉంది అని వివరించారు.

బాబు ప్రచారం చూస్తే ఏం అనాలో అర్థం కావడం లేదని దేశంలో బెంగళూరు ఐటీ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నా ఏనాడూ అది తమ ఘనతగా ఎస్‌ఎం కృష్ణ, పాటిల్ చెప్పుకోలేదని చెప్పారు. తనవల్లే గూగుల్ హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పకుంటున్న చంద్రబాబు మరి దాన్ని ఏపీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఏపీలో మహానాడు పెడితే రుణమాఫీ, డ్వాక్రారుణాల విషయంలో తిరగబడి కొడతారనే భయంతో తెలంగాణలో పెట్టుకున్నారని అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు సిద్ధమా? పాఠ్యపుస్తకాల్లో సోనియాగాంధీ ప్రస్తావన విషయమై మాట్లాడుతూ 1956,1968లో 300 మందిపై కాల్పులు, 1975లో టీపీఎస్ వారిని అక్రమంగా కాంగ్రెస్‌లో చేర్పించుకోవడం వంటివి రాయడానికి అంగీకరిస్తే సోనియా పేరు ఇవ్వవచ్చని అన్నారు. సచివాలయం, ఓయూ భూముల విషయం, హుస్సేన్‌సాగర్ పూడికతీత విషయాల్లో విమర్శలను తోసిపుచ్చారు. ప్రపంచంలో ఇలాంటివి ఎవరూ చేయడం లేదా అని ప్రశ్నించారు. గుజరాత్‌లోని పరిపాలన కోసం కొత్త నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని ఆయన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ పాలిత, అనుకూల రాష్ట్రాలకే ప్రధాని అన్నట్లుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

వ్యతిరేకించిన వారే అభినందిస్తున్నరు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారు కూడా ఇవాళ తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారు సంజయ్‌బారు ఇవాళ హిందూ దినపత్రికలో రాసిన వ్యాసంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిని ప్రశంసించారని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన మేధావి వర్గం కూడా తమ పనితీరును అభినందించడం గర్వకారణమని అన్నారు.

లోతుగా విశ్లేషించాలి.. తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం ఎంతో చేస్తున్నదని కేటీఆర్ చెప్పారు. విత్తనాలు, ఎరువులలో సబ్సిడీలు ఇస్తున్నది. జీరో వడ్డీమీద రుణాలు అందిస్తున్నది. సాగును నీరు, విద్యుత్తు పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నది. ఆఖరుకు పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ఇస్తున్నది. అయినా ఇంకా ఆత్మహత్యలు సాగడంపై అందరమూ ఆలోచించాలి. వాస్తవానికి రైతు ఆత్మహత్యలు ఈ ప్రభుత్వ విధానాల వల్ల జరిగినవి కావు. ఏండ్లకేండ్లు నిరంతరంగా సాగుతున్న పరిస్థితుల వల్లే ఈ దుస్థితి. మా ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయంలో స్పష్టత ఉంది కాబట్టే వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. విత్తనోత్పత్తి క్షేత్రాలు రావాలంటున్నది, క్రాప్ కాలనీలు ఏర్పాటు, పాలీ హౌస్ డ్రిప్ ఇరిగేషన్ విధానాలు ఈ కోవలోవే. అని తెలిపారు.

పార్టీలో నెంబర్లు లేవు.. పార్టీలో నెంబర్ టూ అంటూ ఎవరూ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ మహావృక్షం. నంబర్‌టూ అంటూ ఎవరూ లేరు. ఇది మరిస్తే నాతో సహా ఎవరికీ మంచిది కాదు. దేశంలో సీఎంలుగా 80-85 ఏండ్ల వయసు వారున్నారు. మా ముఖ్యమంత్రికి 61 ఏండ్లు. ఈ లెక్కన ఆయన రాజకీయల్లో యువకుడు. మరో 20-30 ఏండ్లు ముఖ్యమంత్రిగా, మా పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను, హరీశ్‌రావు, కవిత ప్రజల చేత ఎన్నికయిన వాళ్లం. ప్రజలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. మా లక్ష్యం తెలంగాణ సాధన. అది సాధించాం. ఈ పదవులు మాకు బోనస్. నాకు భవిష్యత్తులో పెద్ద పదవులపై ఆశ లేదు అని తెలిపారు.

జూన్ మొదటివారంలో తైవాన్, హాంగ్‌కాంగ్ పర్యటన రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలోమంత్రి కే తారకరామారావు జూన్ 3 నుంచి 6 తేదీ వరకు తైవాన్, హాంగ్‌కాంగ్‌లలో పర్యటించనున్నారు. టీఎస్‌ఐపాస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విశిష్ట పారిశ్రామిక విధానం, రాష్ట్రంలోని ప్రత్యేక అంశాలు పర్యటన సందర్భంగా మంత్రి ఆయా కంపెనీల అధినేతలకు చాటిచెప్పనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.