రాష్ట్ర పునర్నిన్మాణంలో భాగంగా విద్యావ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపకల్పన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛభారత్‌లో భాగంగా పార పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోలా అభిరాం గార్డెన్స్‌లో విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా పోటీని తట్టుకునేలా రాష్ట్ర విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు.

-విద్య, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత -ఉపాధి, అవకాశాల కల్పనే లక్ష్యం: విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి అభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి త్వరలో రాష్ట్ర బృందం వెళ్తుందని చెప్పారు. ఉపాధి అవకాశాలు మెరుగు పర్చడంతోపాటు మిగతారంగాల అభివృద్ధికి దోహదపడే విధానాలను విద్యావ్యవస్థలో చేర్చుతామన్నారు. త్వరలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యావిధానం అమలుల్లోకి వస్తుందన్నారు. విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఆంగ్ల విద్యపై మోజుతో పిల్లల్ని ప్రైవేటు విద్యాసంస్థలకు పంపడం సరికాదని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్లంలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులున్నారని చెప్పారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు క్రియాశీలంగా పనిచేశారని, అదే స్ఫూర్తితో రాష్ట్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీవో ముత్యంరెడ్డి, గడ ఓఎస్డీ హన్మంతరావు, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, రఘుపతిరావు, రోటరీ క్లబ్ నాయకులు సామల వేణు, విష్ణుజగతి తదితరులు పాల్గొన్నారు.