– 7 వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. – పూర్తిస్థాయి మౌలిక వసతులతో నిర్మాణం – 2వేల ఎకరాల్లో ఉద్యోగులకు కాలనీలు – అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
పనిచేసే చోటే నివాసం కల్పించే స్మార్ట్‌సిటీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఏడు వేల ఎకరాల్లో తెలంగాణ ఫార్మా సిటీని నిర్మించాలని తలపెట్టింది. ఇందులో 2 వేల ఎకరాలను ఉద్యోగుల నివాసానికి కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అధికారులకు సూచించడం విశేషం. మంచినీరు, రవాణా, రైల్వే ట్రాక్‌లను ఏర్పాటుచేయడంతోపాటు ఫార్మాసిటీలో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక కాలనీలు నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.
ఫార్మాసిటీ ప్రాజెక్టు రూపకల్పనపై బల్క్‌డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో బుధవారం సీఎం కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫార్మారంగం భవిష్యత్తు, ప్రపంచస్థాయిలో ఈ రంగం స్థితిగతులను సమావేశంలో చర్చించారు. గ్లోబల్ మార్కెట్‌లో చైనాతోపాటు భారత్ ఫార్మారంగంలో గణనీయ పురోగతి సాధించిందని, ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక్కడి నుంచే 30 శాతం మందులు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఫార్మా పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని వెల్లడించారు.
ఫార్మాసిటీ ఏర్పాటుకు రైల్వే లైన్, నేషనల్ హైవే, నీటి పారుదల ప్రాజెక్టుల అందుబాటు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫార్మాసిటీకి అనుబంధంగా 5 లక్షల కుటుంబాలు నివసించే విధంగా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. కాలుష్యరహిత పారిశ్రామిక విధానానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టు ఉంటుందని, ప్రస్తుతం హైదరాబాద్ జీడిమెట్ల, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమలు కూడా ఈ సిటీకే తరలాలని సీఎం సూచించారు. ఫార్మాసిటీకి అవసరమైన భూమి, నీరు, మౌలికసదుపాయాలతో పాటు 500 మెగావాట్ల నిరంతరాయ విద్యుత్తును అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఫార్మారంగానికి సంబంధించిన పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉన్నదో పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లను ఆహ్వానించి తెలంగాణ ఫార్మాసిటీ డిజైన్‌ను రూపొందించాలని నిర్ణయించారు. సమీక్షా సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయంత్ ఠాగూర్, ఆర్‌కే అగర్వాల్ పాల్గొన్నారు.