-మాసాయిపేట రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహకారం -విద్యార్థులందరినీ కోరుకున్న పాఠశాలలో చదివిస్తాం -ఖమ్మంలో ఎమ్మెల్యేపై దాడి ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి హరీశ్‌రావు

మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈ దుర్ఘటనలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. క్షతగాత్ర చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైందన్నారు.
మృతుల కుటుంబాలకు గతంలోనే రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని, గాయపడిన కుటుంబాలకు ప్రస్తుతం రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేస్తున్నామన్నారు. 18 మందికి రూ.లక్ష చెక్కులను పంపణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని, చిన్నారులు కోరుకున్న పాఠశాలల్లో లేదా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి మంచి చదువులు చదివిస్తామన్నారు. ఆరోగ్యపరంగా భవిష్యత్‌లో ఉపయోగపడేలా హెల్త్‌కార్డులు అందించే విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించిందని గుర్తుచేశారు. బాలాజీ దవాఖానలో తాను స్వయంగా ప్రథమచికిత్స జరిపించి, వెంటనే సికింద్రాబాద్‌లోని యశోదాకు తరలించామన్నారు. సకాలంలో తరలించడం వల్లే ప్రాణాలు రక్షించుకోగలిగామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: ప్రజాసమస్యలపై స్పందించిన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీ టీడీపీ నాయకులు దాడిచేయ డం దారుణమని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించలేదని, దీంతో తెలంగాణ ప్రజలపై ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో స్పష్టమైందన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేపై దాడికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. అన్నివిధాలుగా ఆదుకుంటాం