-ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ, కాంగ్రెస్ యాత్రలు -కరెంటు కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ పాలకులే కారణం -మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేకే విమర్శ -టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ నేత రాగం నాగేందర్‌యాదవ్ దంపతుల చేరిక

అన్ని పార్టీల దారులు టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, నేతలంతా సీఎం వైపు చూస్తున్నారని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు. డీసీసీ కార్యదర్శి రాగం నాగేందర్ యాదవ్, ఆయన భార్య, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ సుజాతాయాదవ్ సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరతామంటే మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు చేరారని హరీష్‌రావు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించుకునేందుకు టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు వస్తున్నారని హరీశ్, కేశవరావు చెప్పారు. మీపై భరోసాలేక మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే రైతులకేం భరోసానిస్తారని ప్రశ్నించారు.
ఇటువంటి వారిని ప్రజలు నిలదీస్తారని చెప్పారు. రాష్ట్రంలో కరంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కారణం కాదా? అని హరీశ్, కేశవరావు నిలదీశారు. గత ప్రభుత్వాలు తెలంగాణలో బొగ్గు నిల్వలు, గోదావరి నది ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించలేదని వారు గుర్తు చేశారు. స్థానిక ప్రాజెక్టులకు అవసరమైన గ్యాస్ కూడా సాధించలేక పోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీయే కారణమని హరీశ్‌రావు, కేశవరావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన మూడున్నర నెలల్లోనే రైతులకు అండగా నిలిచారని చెప్పారు. బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో 6000 మెగావాట్లు, ఎన్టీపీసీ, సౌర విద్యుత్ ద్వారా 4000 మెగావాట్ల చొప్పన, ఇంకా మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెండు వేల మెగావాట్లతో కలిపి మొత్తం 16 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.
తద్వారా వచ్చే మూడేండ్లలో విద్యుత్ రంగంలో మిగులు సాధించడమే తమ ధ్యేయమన్నారు. రైతులకు గత ప్రభుత్వాలు ఇవ్వని ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.480 కోట్లు విడుదల చేసిన ఘనత తమదేనని వారు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకే పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించిందని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్న వారు భూములు కబ్జా చేశారని హరీశ్, కేశవరావు ఆరోపించారు. భాగ్యనగరంలోని 80 లక్షల మంది జనాభా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో ముందుకెళుతున్నారన్నారు. ప్రతి అంశంపై చర్చిస్తూ రాష్ట్ర రాజధానిని విశ్వనగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురేస్తాం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గులాబీ జెండా ఎగురేస్తామని మంత్రి హరీశ్, కేశవరావు చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు ఆరిపోయే దీపాలన్నారు. టీఆర్‌ఎస్ గురించి మాట్లాడితే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కార్యకర్తలు గట్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలా చారి, ఎమ్మెల్సీ రాములునాయక్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.