Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అన్నదాతలు కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి

-కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంద్‌
-ఆ పార్టీని నమ్మితే ధరణి బంగాళాఖాతంలోకి..
-మన రైతన్నలు అరేబియా సముద్రంలోకే: కేసీఆర్‌
-బాబ్రీ మసీదు ఘటనకు బాధ్యులెవరు?
-కర్ఫ్యూలు.. బాంబు పేలుళ్లు..విభజన రాజకీయాలకు కేరాఫ్‌ కాంగ్రెస్సే
-నాటినుంచీ తెలంగాణకు శత్రువు ‘హస్త’మే
-విద్యార్థుల ప్రాణాలుపోతేగాని రాష్ట్రమియ్యలే
-కాంగ్రెస్‌ ముంచితే.. బీజేపీ పగబట్టింది
-నిధుల్లో కోతపెడుతూ బీజేపీ తీరని ద్రోహం
-తెలంగాణకు ఆ రెండు పార్టీలు పనికిరావు
-రైతు బతకాలంటే మళ్లీ బీఆరెస్సే రావాలి
-జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా?
-బోధన్‌, నిజామాబాద్‌, ఎల్లారెడ్డి, మెదక్‌ సభల్లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌

నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు దుర్మార్గమైన కాంగ్రెస్సే శత్రువు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. 1969 తొలిదశ ఉద్యమంలో 400 మందిని కాల్చేశారు. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చారు. 2004లో గెలిస్తే 2005లో 2006లోనైనా తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. మోసం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలంతా పులుల్లా కొట్లాడటంతో విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇక నుంచి రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టవుతుంది.
-సీఎం కేసీఆర్‌

‘నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇకమీద రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణకు పనికిరావని అన్నారు. బుధవారం బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ఎన్నడూ లాభం చేయలేదు. తెలంగాణను కాంగ్రెస్‌ ముంచితే, బీజేపీ మన నిధులకు కోత పెడుతున్నది. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటంలేదు. అనేక ఇబ్బందులు పెడుతున్నది. చేసిందేమీ లేదు’ అని ధ్వజమెత్తారు. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల మంచికోసం పుట్టిందే బీఆర్‌ఎస్‌ పార్టీని అని, ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని కోరారు.

బాబ్రీ మసీదు ఘటనకు బాధ్యులెవరు?
దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏలుబడిలో ఎక్కడచూసినా కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు, ప్రజలను విభజించే రాజకీయాలేనని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. బాబ్రీ మసీదు ఘటనకు ఎవరు బాధ్యులు? అని నిలదీశారు. సెక్యులర్‌ అయితే జీవితాంతం సెక్యులర్‌గా ఉండాలని, చేతల్లోనూ అది చూపాలని అన్నారు. ‘నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు దుర్మార్గమైన కాంగ్రెస్సే శత్రువు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. తెలంగాణ ఇస్తామంటే 2004లో పొత్తు పెట్టుకున్నాం. అయినా 15 ఏండ్లు ఏడిపించారు. మోసం చేసే ప్రయత్నం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరోసారి ద్రోహం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలంతా పులుల్లా కొట్లాడటంతో విధిలేని పరిస్థితుల్లో తెలంగాణను ఇచ్చారు. 15 ఏండ్లు ఏడిపించి, వందల మందిని పొట్టనపెట్టుకొన్నది కాంగ్రెస్‌ పార్టీ’ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ, ధర్మం ఉన్నాయిని.. భగవంతుడి దయ వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు.

నేను 24 ఏండ్ల నుంచి కొట్లాడుతున్నా. జిందగీ అంతా కేసీఆరే కొట్లాడాల్నా? ఇక నుంచి రైతులు కొట్లాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించాలి. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులు అరేబియా సముద్రానికే..
కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదముంటుందని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. 50 ఏండ్లు మనల్ని ఏడిపించిన కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్టేనని అన్నారు. వ్యవసాయ స్థిరీకరణ కోసం నీటి తీరువా రద్దు చేశామని, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రైతు చనిపోతే వారంలోపే రూ. 5లక్షలు వచ్చేలా బీమా సదుపాయం కల్పించామని చెప్పారు. గ్రామాల్లోనే 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నామని గుర్తు చేశారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎకడా లేవని పేర్కొన్నారు.

‘50 ఏండ్ల కాంగ్రెస్‌ రాజ్యంలో రైతుబంధు ఇచ్చారా? రైతులు అంజుమాన్‌ అప్పులు కట్టకపోతే ఇండ్ల తలుపులు ఊడ పీకపోయారు. కానీ రైతుబంధు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు 3 గంటలకు కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అంటుండు. ఎట్ల చాల్తది సన్నాసీ.. అంటే 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుందాం అంటడు. 30 లక్షల మోటర్ల కోసం రూ.30 వేల కోట్లు కావాలి. ఇంత అనాలోచితంగా మాట్లాడుతున్నరు. వాళ్లొస్తే ఇచ్చేది మూడు గంటల కరెంటేనని గట్టిగా చెప్తున్నారు. అందుకే రైతులే ఆలోచించాలి’ అని కేసీఆర్‌ కోరారు. మహారాష్ట్రలోని బిలోలి, ధర్మాబాద్‌ నాయకులు వచ్చి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పెట్టాలని, లేదంటే తెలంగాణలో కలపాలని అడిగారని తెలిపారు. తెలంగాణ మెరుగ్గా ఉన్నదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

పద్మకు పోటీగా కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ
మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘పద్మాదేవేందర్‌రెడ్డి పవర్‌ ఏంటో చూశారు. రామాయంపేటలో ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ ఏర్పాటు కావడానికి ఆమే కారణం. గణపురం ఆనకట్టతో 40 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ఎప్పటికీ మీ మధ్య ఉండి, మీకోసం పనిచేసే పద్మా దేవేందర్‌రెడ్డి గెలిస్తే రింగురోడ్డు, ఇంజినీరింగ్‌ కాలేజీ సహా ఇతర పనులన్నీ ఆటోమెటిక్‌గా నడుచుకుంటూ వస్తాయి. పద్మా దేవేందర్‌రెడ్డికి, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఏమన్నా పోలిక ఉన్నదా? ఎవరో దిష్టిబొమ్మని నిలబెడితే మనం ఓడిపోవాల్నా? 100 శాతం పద్మా దేవేందర్‌రెడ్డిని గెలిపించండి. నియోజకవర్గంలోని కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్‌గాంధీ అంటున్నారు. ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం, లంచాల రాజ్యం వస్తది.

తెలంగాణ గుల్‌దస్తా..
హిందు, ముస్లింలు సోదరుల్లాగా కలిసి జీవనం సాగిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప సంస్కృతి తెలంగాణది అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలతోపాటు, మసీదులను కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్నదని తెలిపారు. తెలంగాణ గుల్‌దస్తా అని, అభివృద్ధిలోనూ అందరినీ కలుపుకుపోతున్నామని, అందరినీ సమదృష్టితో చూస్తున్నామని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకొన్నదని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేండ్లలో ముస్లింల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో రూ.12 వేలకోట్లు వెచ్చించింది.

మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశాం. కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను మించి మైనార్టీ విద్యార్థులు నేడు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తాం. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో ఒక్క కర్ఫ్యూ లేదు. మత కల్లోలాలు, బాంబుపేలుళ్లు లేవు. ఇదొక రికార్డు. రాబోయే రోజుల్లో ఐటీ సెంటర్లను ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌ బతికున్నంతవరకూ తెలంగాణ లౌకిక రాష్ట్రంగానే ఉంటుం ది. హిందు, ముస్లింలు ప్రేమపూర్వకంగా జీవనం సాగించాలనేది మా విధానం’ అని వివరించారు.

సాగునీళ్ల కోసమే కామారెడ్డికి వచ్చా
‘సాగునీళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి వెనుబడి ఉన్నాయి. అందుకే నేను కామారెడ్డికి వచ్చా. కామారెడ్డి, ఎల్లారెడ్డి నాకు రెండూ ఒక్కటే. రెండింటికీ కలిపి నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టు లెక్క. కామారెడ్డికి, ఎల్లారెడ్డికి ఏం చేస్తనో మాటల్లో చెప్పను. చేతల్లో చేసి చూపిస్తా. మీరందరూ సంతోషపడేలా, ఆశ్యర్చపడేలా తయారుచేస్తా. ఈ జంట నియోజకవర్గాలను వజ్రపుతునకల్లా తయారు చేస్తా. రోడ్లు, నీళ్లు, సాగునీళ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంతా మారిపోతది. అన్నింట మా కామారెడ్డి, ఎల్లారెడ్డి గొప్పగా, నవంబర్‌ వన్‌గా తయారైందని చెప్పుకొనేలా అభివృద్ధి చేస్తా. నేనే ఎమ్మెల్యే అనుకొని, నన్ను చూసి సురేందర్‌కు ఓటు వేయండి’ అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రెండేండ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డిలోని ప్రతి ఎకరానికి నీళ్లు పారించే బాధ్యత తనదేనని తెలిపారు.

బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?
బీజేపీ మతపిచ్చితో మంటలు పెట్టే పార్టీ అని, ప్రజలను విభజించేందుకు కుట్రలు చేస్తుందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం 150 మెడికల్‌ కాలేజీలు పెట్టిందని, కానీ 100 లేఖలు రాసినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని తెలిపారు. చట్ట ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాలను మంజూరు చేయాల్సి ఉన్నా తెలంగాణకు ఇవ్వడం లేదని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టనందుకు ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టిందని ఆరోపించారు. అలాంటి బీజేపీకి ఓటెందుకెయ్యాలని నిలదీశారు.

కాయితి లంబాడీల పోరాటం నాది..
‘ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాయితి లంబాడీ సోదరులు ఉన్నారు. వారిలో 3 వేల కుటుంబాలకు 6,500 ఎకరాలకు పోడు పట్టాలిచ్చాం. వాళ్ల భూములను సర్టిఫై చేశాం కూడా. వెంటనే వారికి రైతుబంధు, రైతుబీమా పెట్టాం. త్రీఫేజ్‌ కరెంటు కూడా ఇస్తున్నాం. వారు బీసీల్లో ఉండటం వల్ల పోరాటం చేస్తున్నారు. వారి కోసం నేను కూడా కొట్లాడుతా. ఆ బాధ్యత నాది. కాబట్టి.. కాయితి లంబాడీ బిడ్డలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరున్నా’ అంటూ సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. రాజకీయమంటే సినిమా మ్యాట్నీ షో కాదని, ఎవరో చెప్పారని ఓటువేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తదని హెచ్చరించారు. గణేశ్‌గుప్తా స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదని, వ్యాపారాలను వదిలిపెట్టి, సేవ చేయడానికే వచ్చారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల నేడు నిజామాబాద్‌ పట్టణం అభివృద్ధిని సాధిస్తున్నదని తెలిపారు. నిస్వార్థంగా పనిచేసే గణేశ్‌గుప్తాను మరోసారి గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

సురేందర్‌కు వినయం, విధేయత ఎక్కువ
ఎల్లారెడ్డి అభ్యర్థి జాజాల సురేందర్‌ తనకు తమ్ముడు లాంటివాడని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘నాకు చాలా దగ్గరి వ్యక్తి. మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేశాడు. కుల మతాలకు అతీతంగా అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. వినయం, విధేయత కలిగిన వ్యక్తి, చాలా మంచివాడు. మీ బిడ్డ కాబట్టి అతన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి. మీరు ఓటు సురేందర్‌కు వేస్తలేరు.. కేసీఆర్‌కు వేస్తున్నారని అనుకోండి. ఐదేండ్లలో అద్భుతమైన అభివృద్ధి చేసి పెడతా’ అని హామీ ఇచ్చారు.

ప్రగతిపథంలో నిజామాబాద్‌
తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో నిజామాబాద్‌కు అనేక సార్లు వచ్చానని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చాకే సింగూరు నీళ్లను హైదరాబాద్‌కు బంద్‌ చేసి పొలాలకు ఇస్తున్నామని, కాంగ్రెస్‌ ఎండబెట్టిన నిజాంసాగర్‌ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకువచ్చామన్నారు. ‘సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్‌ను ఎండబెట్టి హైదరాబాద్‌కు గంపగుత్తగా మంచినీళ్లిచ్చారు. రైతులు అంతా ప్రత్యక్షంగా ఆ బాధలు అనుభవించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిజాంసాగర్‌కు పూర్వ వైభవం వచ్చింది.

కాళేశ్వరంతో లింక్‌ చేయడం వల్ల నిజాంసాగర్‌ 365 రోజులు నిండే ఉంటున్నది. పాత నిజామాబాద్‌ జిల్లా ఎలా కళకళలాడిందో మళ్లా అట్లనే ఉంటున్నది. 58 ఏండ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ సాధించిన విజయమిది. సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్‌ పట్టణం ఎలా ఉన్నదో.. ఈ రోజు ఎలా ఉన్నదో ఆలోచించండి. మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల కలిసి నిజామాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా ఐటీ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఇందూరు షాన్‌కు తగినరీతిలో ఇందూరు కళాభారతిని నిర్మిస్తున్నాం’ అని వివరించారు.

షకీల్‌ వచ్చిన తర్వాతే బోధన్‌ అభివృద్ధి
మాజీ మంత్రి, బోధన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బోధన్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి ఇరిగేషన్‌ మినిస్టర్‌గా ఉండె. నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌లో ఇరిగేషన్‌ కాల్వలు పోయాయంటే ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉండి ఆయన పట్టించుకోలేదు. గజం కాల్వ మంచిగచేయలేదు. ఒక పైసా తేలేదు. షకీల్‌ ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి రూ.72 కోట్లు మంజూరు చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ బాగుచేయించాడు.కోస్గి వాగు మీద ఆరేడు చెక్‌డ్యాంలు కట్టాం. భూగర్భ జలాలు పెరిగాయి. ఇంతకంటే గొప్పగా చెరువులన్నీ బాగుచేసి, నదులు, వాగుల మీద చెక్‌డ్యాంలు కట్టి బాగుచేసుకున్నాం’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.