-12 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రారంభం -ప్రజలకు పూర్తి ఉచితంగా విలువైన వైద్యసేవలు -త్వరలో మరిన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభం -ఎన్ని నిధులైనా సరే.. పేదల వైద్యానికి వెనుకాడం -ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడి

రాష్ట్రంలో 12 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్ సెంటర్లు) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఒక్కో సెంటర్‌లో విలువైన 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు వీటికి అనుబంధంగా ఉండే సుమారు 100 రకాల పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్, రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్, కీళ్ల వాతం తదితర పరీక్షలూ చేస్తారు. ఇందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం రోజుకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో అందజేస్తుందని వైద్యాధికారులు తెలిపారు. నమూనాలు సేకరించే సమయంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానాన్ని అనుసరిస్తారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవడం సాధ్యం కానున్నది. ఈ డయాగ్నసిక్ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు అందుబాటులోకి రావడం వల్ల వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లలేని వారి నుంచి పీహెచ్‌సీలోనే నమూనాలను సేకరించి ఆయా కేంద్రాలకు పంపిస్తారు. ఫలితాలు రాగానే పీహెచ్‌సీల్లోనే చికిత్స అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ల ద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడనున్నదని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఎన్ని నిధులైనా ఖర్చుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలను బాధితులకు ఉచితంగా అందజేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్‌లు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. బుధవారం సంగారెడ్డిలో జిల్లా కేంద్ర దవాఖాన ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ (టీ-హబ్), రూ.1.60 కోట్లతో ఏర్పాటుచేసిన ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను మంత్రి హరీశ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్‌లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో త్వరలో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక పలు డయాగ్నస్టిక్ పరీక్షల కోసం రోగులపై రూ.10 వేలకుపైగా ఆర్థికభారం పడుతున్నదని చెప్పారు. అప్పుడు నిర్వహించే డీ డైమర్, ఫెర్రిటన్, సీఆర్‌పీ (సీ రియాక్టివ్ ప్రొటీన్ టెస్టు), ఎల్‌డీహెచ్ (ల్యాక్‌టేట్ డీహైడ్రోజనీస్ టెస్టుల)ను టీహబ్‌లో ఉచితంగా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. రూ.2.50 కోట్లతో కొత్త సీటీస్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2020-21లో ఆంధప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాలను మించి తెలంగాణలో 3 కోట్ల టన్నుల బియ్యం సేకరించినట్టు వెల్లడించారు. డయాగ్నస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సర్కారు దవాఖానలపై నమ్మకం -మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కేంద్రంలో గంటకు 1,200 పరీక్షలు అవుతాయని, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు.

సీఎం నిర్ణయం నిరుపేదలకు వరం -మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని బుధవారం ఎంపీ రాములు, జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉచితంగా 57 పరీక్షలు చేస్తారని, ఇది పేదలకు వరమని చెప్పారు. వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. దవాఖానలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ వార్డును ఎంపీ రాములు, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి ప్రారంభించారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఎంపీ పరీక్షలు చేయించుకున్నారు. దవాఖాన ఆవరణలో రోగుల కోసం ఏర్పాటుచేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ పాల్గొని రోగులకు వారి బంధువులకు అన్నదానంచేశారు.

ప్రజారోగ్యంలో మనమే టాప్ -విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖానలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో కుదేలైన ప్రభుత్వ దవాఖానలను నేడు కార్పొరేట్‌కు దీటుగా తీర్చిది ద్దారని తెలిపారు. పేదలకు గుదిబండగా మారిన గుండెనొప్పి, క్యాన్సర్ లాంటి వైద్యాన్ని ఉచితంగాఅందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఉచితంగా రోగ నిర్ధారణ టెస్టులు -రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఉచితంగా నిర్వహించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగ నిర్ధారణ కోసం నమూనాలను ఇంటి వద్దే సేకరించనున్నట్టు చెప్పారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, మెచ్చా నాగేశ్వర్‌రావు, హరిప్రియానాయక్, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం -మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్, నిర్మల్ జిల్లా కేంద్రంలోని దవాఖానలో డయాగ్నస్టిక్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రాల్లో కరోనా పరీక్షలతోపాటు రక్త, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్ తదితర 57 రకాల పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో జిల్లాలోని వివిధ పీహెచ్‌సీ నుంచి రక్తనమూనాలను సేకరించే ఐదు వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్, కొరిపెల్లి విజయలక్ష్మి, ఎమ్మెల్యే జోగు రామన్న, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారుఖీ పాల్గొన్నారు.

ఒకేదగ్గర అన్ని పరీక్షలు -జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి నిరుపేదలకు ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలను ఒకేదగ్గర జరిపించేలా సీఎం కేసీఆర్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్మించిన డయాగ్నస్టిక్ సెంటర్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి ఆమె ప్రారంభించారు.

మౌలిక వసతులతో బలోపేతం -మంత్రి సత్యవతి రాథోడ్ మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు బలోపేతం అవుతున్నాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ సెంటర్‌ను బుధవారం ఎంపీకవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ కంటే అదనంగా 10 వేల కోట్లను ఆరోగ్యరంగానికి ఖర్చు పెట్ట డం ద్వారా వైద్యరంగం దశ మారనున్నదని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే ఆలోచనతో రాజన్న సిరిసిల్లతోపాటు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు.

కార్పొరేటుకు దీటుగా వైద్యం -మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇప్పటివరకు కార్పొరేట్, పెద్ద దవాఖానలకే పరిమిమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై వికారాబాద్‌లోని దవాఖానలో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. వికారాబాద్ సివిల్ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చికిత్స కంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలోనే పేదలకు మేలు కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లోనే డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేశారని చెప్పారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.