-తెలంగాణను పునర్నిర్మించుకుందాం -అధికారులను ఉత్తేజపర్చిన సీఎం -సూచనలు, సలహాల ఆలకింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో సమర్థవంతంగా ముందుకు వెళ్లాలంటే అధికారుల సహాయ, సహకారాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. అధికారులు, మంత్రులు కలిసి పనిచేస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని నొక్కి చెప్పారు. ఇంటింటి సమగ్ర సర్వేపై అధికారులతో ఒక రోజు సమీక్షలో పాల్గొన్న సీఎం.. అధికారుల నుంచి సూచనలు, సలహాలను సావధానంగా ఆలకించారు.
కొందరు ఇచ్చిన సూచనల అమలుకు అంగీకారం తెలిపారు. హౌస్ హోల్డ్ సర్వే పూర్తి చేసిన ఇంటికి జనాభా లెక్కల తరహాలో ఒక లేబుల్ అంటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సూచించారు. దీనికి వెంటనే సీఎం అంగీకరించారు. దీని వల్ల ఒక ఇంటికి రెండు, మూడుసార్లు ఎన్యూమరేటర్లు వెళ్లకుండా ఉంటారని అన్నారు. సర్వే ఫారాలను డివిజన్ స్థాయిలోనే ముద్రించి, ఆర్డీవో స్థాయి అధికారితో పంపిణీ చేయించాలన్నారు. సర్వే పాల్గొనే ఉద్యోగులకు డివిజన్ స్థాయిలో డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మండలానికి అరుగురు రిసోర్స్ పర్సన్స్ చొప్పున తెలంగాణ రాష్ట్రం మొత్తానికి 2,640 మంది అవసరమవుతారని అంచానా వేశారు.
ఇంటింటి సమగ్ర సర్వేలో ఉద్యోగులు తప్పని సరిగా పాల్గొనేలా ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని కొందరు అధికారులు కోరారు. అందుకు సీఎం అంగీకరించారు. తెలంగాణ కోసం ఒక రోజు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొంటామని వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీవో అరుణకుమారి అన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు హౌస్ హోల్డ్ సర్వే ప్రామాణికం కావాలని సీఎం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు మాత్రమే అందాలన్నారు. సర్వే ద్వారా సేకరించిన డాటాను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాల్లో పనిచేసే ఆపరేటర్లను ఒకే చోటికి చేర్చి పనిచేయించాలని సూచించారు.