Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా

-అధికార కాంక్షే తప్ప.. ప్రజల ఆకాంక్షలు పట్టని షా
-ఫసల్‌ బీమా నుంచి గుజరాత్‌ తప్పుకున్నదెందుకు?
-రైతు విరోధి పార్టీ బీజేపీ – రైతు ద్రోహులు ఆ పార్టీ నేతలు
-తెలంగాణను ఎన్నటికీ చెప్పుచేతల్లో పెట్టుకోలేరు
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్‌తనం ఓడిపోవడం ఖాయమ ని తేల్చిచెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదుషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. అబద్ధాలకు పెద్ద కొడుకు అమిత్‌షా అని.. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలేవీ అమిత్‌షాకు పట్టనే లేదని విమర్శించారు. అమిత్‌షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

గాడిద గాత్రానికి ఒంటె ఓహో అంటే.. ఒంటె అందానికి గాడిద ఆహా అన్నట్టు మోదీ ప్రభుత్వ పనితీరు గురించి షా చెప్పుకొచ్చారని ఎద్దేవాచేశారు. ఆదివారం మునుగోడులో అమిత్‌షా చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్‌ సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పందించారు. నల్ల చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ పార్టీ నేతలు, రైతు పక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం తాజాగా విద్యుత్తు చట్టంతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలపై కేసీఆర్‌ చేసిన ఆరోపణలకు మునుగోడు వేదికగా అమిత్‌ షా జవాబు చెప్తారని రైతాంగం ఆశించిందని, కానీ, ఆ విషయాన్ని అమిత్‌షా దాటవేశారని పేర్కొన్నారు.

అమితమైన అవగాహన రాహిత్యం
దేశ వ్యవసాయరంగానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అని అమిత్‌ షా మాట్లాడటం అవగాహన రాహిత్యానికి, కండ్లుండి చూడలేని కబోదితనానికి నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశ రైతులకు ఏం చేయాలన్న విషయాలపై ఏ మాత్రం తెలియని మోదీ ప్రభుత్వానికి దారి చూపించింది కేసీఆరే అన్న సంగతిని షా మరిచారని చెప్పారు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్‌గా అమలుచేస్తున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.

ఒకనాడు కరువుసీమగా ఉన్న ప్రాంతాలన్నీ కేసీఆర్‌ సీఎం అయ్యాక పచ్చని పంటలతో సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని రోజుకో కేంద్ర ప్రభుత్వ సంస్థే ప్రశంసిస్తున్న సంగతి షాకు తెలియకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు రైతులను వేధించి వారి ప్రాణాలను బలిగొన్న ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన అమిత్‌ షా, తెలంగాణ రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. దేశ రైతాంగం చేసిన వీరోచిత పోరాటంతోనే మోదీ టీం అధికార మదం దిగి, అన్నదాతలకు బహిరంగ క్షమాపణ చెప్పిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారని తెలిపారు. లఖింపూర్‌లో రైతుల నెత్తురు కండ్లజూసిన ఖూనీకోరు సరారులో మంత్రికి రైతు గురించి మాట్లాడే అర్హత ఎకడిదని ప్రశ్నించారు.

ఫసల్‌బీమా నుంచి గుజరాత్‌ ఎందుకు తప్పుకున్నది?
ఫసల్‌ బీమా యోజనలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించిన అమిత్‌ షా.. ఆ పథకం నుంచి గుజరాత్‌ ఎందుకు వైదొలిగిందో మునుగోడులో చెప్తే బాగుండేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడమే జీవిత లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ తీసుకొచ్చిన ఫసల్‌ బీమాతో ఇన్సూరెన్స్‌ కంపెనీలకే ప్రయోజనం తప్ప రైతులకు కాదన్నారు. గత ఐదేండ్లలో రూ. 40వేల కోట్ల లాభాన్ని ఈ పథకం ద్వారా అయా కంపెనీలు ఆర్జించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ కారణంగానే ఆ పథకం నుంచి గుజరాత్‌ వైదొలిగిందన్నారు. గుజరాత్‌కు పనికిరాని పథకం తెలంగాణకు ఎలా పనికొస్తుందో అమిత్‌ షా చెప్తే తెలంగాణ ప్రజలు వినే తరించే వారని ఎద్దేవా చేశారు. బీహార్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి ఏడు రాష్ట్రాలతో పాటు సొంత పార్టీ నేతలే పనికిరాదని ఛీ కొట్టిన ఫసల్‌ బీమా పథకాన్ని తెలంగాణలో ప్రచారం చేయడం అమిత్‌ షా దరిద్రపు రాజకీయాలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీజేపీ నేతలే రైతు ద్రోహులు..
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న అమిత్‌ షా… ఇప్పుడు అధికారంలో ఉన్నది తమ పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనం లేదనే ఒకే ఒక కారణంతో కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా గోస పెట్టుకుంటున్న బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరని చెప్పారు. ‘తెలంగాణ కర్షకుడి మీద కక్షగట్టింది నిజం కాదా? మోటర్లకు మీట ర్లు పెట్టి .. ఉచిత కరెంట్‌ను కబళించే కుట్రలు చేస్తున్నది మీరు కాదా? కృష్ణా జలాల్లో వాటా లు తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది మీరు కాదా? నీళ్లిచ్చే ప్రాజెక్టులను నిలిపివేయడానికి బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నది మీరు కాదా?’ అని నిప్పులు చెరిగారు. దేశంలోని ప్రతి రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న మోదీ ప్రభుత్వం, నేతన్నలకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. జీఎస్టీతో నేతన్న నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపైన అమిత్‌ షా నుంచి ఏదైనా మంచి మాట చెప్తారని అశించారని కానీ అమిత్‌షా ప్రసంగం నిరుత్సాహపరిచిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

షా విమర్శలు జోక్‌ ఆఫ్‌ ది సెంచరీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అని అమిత్‌షా విమర్శించడం జోక్‌ ఆఫ్‌ ది సెంచరీ (శతాబ్దపు జోక్‌) అని మరో ట్వీట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఆ పథకాన్నే పీఎం కిసాన్‌ యోజన పేరుతో కొనసాగిస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం జరిగింది. సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతుల ఆగ్రహానికి గురైన ప్రధాని మోదీ చివరకు క్షమాపణలు చెప్పింది నిజం కాదా? ఫసల్‌ బీమా యోజన పథకంలో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కూడా చేరలేదు. ప్రధాని సొంత రాష్ర్టానికే మంచి చేయని ఆ పథకం.. తెలంగాణకు ఎలా మేలు చేస్తుంది? ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్‌షా వదిలిపెట్టాలి’. బీజేపీ నాయకుడి కుమారుడు కారుతో రైతులను తొక్కించిన వీడియోను పోస్ట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌.. ఇది రైతు ఫ్రెండ్లీ మోదీ ప్రభుత్వం.. ఇలాంటి జంగిల్‌రాజ్‌నే తెలంగాణలోనూ తీసుకొని రావాలకొంటున్నారా అమిత్‌షా జీ.. అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.

ఎన్నిచేసినా ‘చెప్పు’ చేతల్లో పెట్టుకోలేవ్‌
వేల కోట్ల కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొన్న బీజేపీ, మునుగోడుకు ప్రత్యేకంగా కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారని, గోల్‌మాల్‌ గుజరాత్‌కు తప్ప గోల్డ్‌ మోడల్‌ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంసారం లేదని అమిత్‌షా నిరూపించారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్‌ షా తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇకడి ప్రజలు నమ్మరని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అండగా ఉండే టీఆర్‌ఎస్‌కే మద్దతుగా ఉంటారనే విషయం మునుగోడు ఎన్నికతో బీజేపీ నేతలకు అర్థం అవుతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్‌ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. ‘ఆత్మాభిమానం లేని కొందరు తొత్తులు మీ చెప్పులు మొయ్యవచ్చు గానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మీరు చేస్తున్న కుట్రలకు ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.