Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మహాద్భుత విజయం..

ఇదో కొత్త చరిత్ర! మాటలకందని మహా విజయం! అభివర్ణనలకు పదాలందని అద్భుత సందర్భం! ఏ షాన్ హమారా.. ఏ షహర్ హమారా..! ఏ హైదరాబాద్ ఖుద్ తెలంగాణ!! ఇది.. 20 నెలల క్రితం సిద్ధించిన తెలంగాణ రాష్ట్రానికి వందశాతం పరిపూర్ణతను ప్రసాదిస్తూ.. నగర ఓటరు ఇచ్చిన తిరుగులేని తీర్పు!! ఈ రాష్ట్రాన్నేకాదు.. రాష్ట్రానికి గుండెకాయ అయిన రాజధాని నగరాన్నీ పాలించే బాధ్యత.. ఆలన చూసే హక్కు.. అభివృద్ధి చేసే శక్తి ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉందని ఓటు గుద్ది మరీ చెప్పిన వేళ! కులం.. మతం.. అన్నింటికి మించి ప్రాంతం.. పక్కకుపోయాయి..! అపోహలు.. కొట్టుకుపోయాయి.. అపవాదులు.. చెల్లాచెదురయ్యాయి!

-రికార్డు స్థాయిలో 99 సీట్లు కైవసం -సొంతంగానే మేయర్ పీఠంపై గులాబీ జెండా -విశ్వనగరం వైపు కేసీఆర్ నేతృత్వానికి బాసట -ఓట్ల సునామీలో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు

హైదరాబాద్‌లో గత రికార్డులను సునాయాసంగా అధిగమించిన టీఆర్‌ఎస్.. రాబోయే కాలంలో మరెవ్వరూ ఛేదించలేని.. కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేని కొత్త రికార్డును సృష్టించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అందకుండా సెంచరీ దరికి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకుగాను.. ఏకంగా 99 డివిజన్లలో విజయపతాకాన్ని రెపరెపలాడించింది! ఒకప్పటి వందల సుందర నందన వనాల పట్నం.. ఇప్పుడు గులాబీ నగరంగా పేరు మార్చుకుంది! టీఆర్‌ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తిగా రుజువు చేసుకుంది!! నమస్తే తెలంగాణ, హైదరాబాద్, సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కొత్త చరిత్ర లిఖించింది. హైదరాబాద్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా దాదాపుగా మూడింట రెండొంతుల కార్పొరేటర్ స్థానాలను గెలుచుకొని నగరంపై పూర్తి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి, భవిష్యత్ ప్రణాళికకు పట్నం 99 స్థానాలు కట్నంగా ఇచ్చింది. రకరకాల తప్పుడు ప్రచారాలకు దిగిన కాంగ్రెస్‌కు ఎన్నడూ ఎరుగని పరాజయమే దిక్కయింది. ఆ పార్టీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రాంతీయ భావనలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్న టీడీపీకీ ఒక్కటే సీటు దక్కింది. హైదరాబాద్‌లో ఇక మీ పార్టీ అవసరం లేదంటూ నగర ప్రజలు ఎలుగెత్తి చాటారు. ఆ పార్టీతో జతకట్టిన బీజేపీకి దారుణ పరాభవం తప్పలేదు. ఆ పార్టీ నాలుగు స్థానాల్లో గెలువగలిగింది. టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా ప్రకటించిన మజ్లిస్ మాత్రం తనకు పట్టున్న ప్రాంతాల్లో బలాన్ని చాటుకుని ఒక స్థానం పెంచుకుని 44 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ చరిత్రాత్మక సమరంలో రెండొంతుల సీట్లలో టీఆర్‌ఎస్‌తో గట్టిగా పోటీపడిన ప్రత్యర్థులే లేకుండా పోవడం విశేషం.

మొన్నటికి మొన్న వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు లభించినటువంటి అపూర్వమైన మద్దతు ప్రకటించడం ద్వారా హైదరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బ్రహ్మరథం పట్టారు. అన్నీ తానై మంత్రి కేటీ రామారావు చేసిన ప్రచారానికి ప్రతిఫలం ఇచ్చారు. ప్రతిపక్షాలు సాగించిన రకరకాల తప్పుడు ప్రచారాలను, రెచ్చగొట్టాలని చూసిన ప్రాంతీయ భావనలనూ నిర్దంద్వంగా తిరస్కరించి.. పక్కా హైదరాబాదీలుగా తాము కేసీఆర్ వెంటే ఉన్నామని నినదించారు.

మాదాపూర్‌నుంచి గెలుపు ప్రస్థానం మొదలు మంగళవారం జీహెచ్‌ఎంసీలో పరిధిలో పోలింగ్ జరిగిన 149 డివిజన్లతోపాటు రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ ఓట్ల లెక్కింపు శుక్రవారం చేపట్టి.. ఫలితాలను విడుదల చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఒక్కొక్కటిగా ఫలితాలు వస్తుంటే గులాబీ శిబిరంలో అంతకంతకూ ఆనందోత్సాహాలు అంబరాన్నంటగా.. విపక్ష శిబిరం నిరుత్సాహం.. నిస్తేజంలో కూరుకుపోయింది. ఐటీ వెలుగుల మాదాపూర్ డివిజన్ గెలుపుతో టీఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదలైంది. ఫలితాల వెల్లడి పూర్తయ్యేసరికి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. నగరం నలుదిశలా కారు జెట్‌స్పీడుతో దూసుకుపోయింది. అన్ని డివిజన్లలోనూ తన తిరుగులేని ఆధిపత్యాన్ని నెలకొల్పింది. గులాబీ సునామీకి జాతీయ పార్టీలు సైతం కంగుతిన్నాయి. టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు చూస్తే.. పోలయిన ఓట్లయిన్నీ టీఆర్‌ఎస్‌కే వచ్చాయా.. అన్నట్లుగా పరిస్థితి తయారైంది.

విశ్వనగరం కేసీఆర్‌తోనే సాకారం.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే అది ఒక్క ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మాత్రమే సాధ్యమని నగరం అపార విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కేసీఆర్ పాలనలో తమ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని సీమాంధ్రులు సైతం ముక్తకంఠంతో చాటి చెప్పడం విశేషం. నగరంలో స్థిరపడిన పలు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కేసీఆర్‌కే మద్దతు పలికారు. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఎన్నికల ఫలితాలు పల్లెలు, పట్నాల తేడాలకు అతీతంగా టీఆర్‌ఎస్ ఓ ప్రబల రాజకీయశక్తి అని నిరూపించాయి.

అంచనాకు అందని ఫలితాలు నిజానికి ఈ స్థాయిలో టీఆర్‌ఎస్ ఘన విజయాన్ని ఏ పార్టీ గానీ, ఏ సర్వే సంస్థ గానీ ఊహించలేదు, అంచనా వేయలేదు. గల్లీగల్లీ తిరిగి, నగర ప్రచారంలో కొద్దిరోజులుగా మమేకమై ప్రచారసారథిగా వ్యవహరించిన కేటీఆర్ నాయకత్వానికి సైతం ఈ ఫలితాలు ఆమోదం తెలిపాయి. ఆయనకు ఓ అపురూప విజయం దక్కింది. నగరం అభివృద్ధి దిశలో ఏడాదిన్నర కాలంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకున్న పలునిర్ణయాలు, భవిష్యత్తులో సాధించబోయే అభివృద్ధిపై ఇచ్చిన హామీలు, వాటి ఆచరణీయత నగర ప్రజల ఆదరణకు పునాదులేశాయి. రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, వారి భద్రతకు మేం భరోసా ఇస్తున్నామనే ముఖ్యనేతల ప్రకటనలు కూడా టీఆర్‌ఎస్ విజయానికి కారణమయ్యాయి.

టీఆర్‌ఎస్ పకడ్బందీ ప్రచార వ్యూహం, శాస్త్రీయంగా అభ్యర్థుల ఎంపిక కూడా మంచి ఫలితాలనిచ్చింది. అంతేకాదు, ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని, మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కూడా ప్రజలు విశ్వసించారు. విద్యావేత్తలు, వృత్తినిపుణులు, మేధావులు అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగడం విశేషం. అనేక ప్రాంతాల్లోకి వెళ్లిన కేటీఆర్.. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు, కొత్త పరిశ్రమల రాకడపై చేసిన ప్రసంగాలను వారు పరిగణనలోకి తీసుకొన్నారని అర్థమవుతున్నది. శాంతిభద్రతల విషయంలో టీఆర్‌ఎస్ కట్టుబడి ఉంటుందని ఇచ్చిన హామీ కూడా ఫలించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.