Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అమరులారా వందనం

-తెలంగాణ అమర వీరులకు సర్కారు ఘన నివాళి -మృతవీరుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం -త్వరలో ఉద్యమ కేసుల ఎత్తివేత -తొలి విడతగా 462 కుటుంబాలకు సాయం =తదుపరి విడతల్లో ఇతర కుటుంబాలకు.. -ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం -అధికారులకు హోంమంత్రి నాయిని ఆదేశం -వృద్ధ కళాకారులకు నవంబర్ నుంచి రూ.1500 పెన్షన్

KCR01 తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. ఇంటి మూల స్తంభాలు తెలంగాణ ఉద్యమంలో అమరజ్యోతులై వెలిగి.. కాలిపోతే.. దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి కుటుంబాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. వారికి పూర్తి అండదండలిచ్చేందుకు సంకల్పించింది. మునుపెన్నడూ.. ఏ ఉద్యమంలో లేని విధంగా అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంసాధించి తీరాలనే ఉద్యమస్ఫూర్తితో స్వరాష్ట్ర సమరంలో కేసులకు వెరువక.. లాఠీలకు తల పోటీలిచ్చి.. ఉద్యమబావుటా ఎగరేసిన ఉద్యమకారుల పోరాట స్ఫూర్తిని కూడా ప్రభుత్వం గౌరవించింది.

వారిపై ఉన్న కేసులను అతిత్వరలో ఎత్తివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అమరుల కుటుంబాల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో 462 మంది అమరవీరుల పేర్లను ఖరారు చేసింది. వీరి కుటుంబాలకు తలా పదిలక్షల రూపాయలను అందజేయనున్నారు. జిల్లా అధికారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి విడతల్లో మిగిలిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని నిశ్చయించింది. ఈ మేరకు ఫైలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సంతకం చేశారు. తొలి విడత ఆర్థిక సహాయం కోసం రూ.48 కోట్లను విడుదల చేశారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల నుంచి పూర్తిస్థాయి వివరాలు అందిన తర్వాత మిగిలిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మొత్తాన్ని జిల్లాల వారీగా అతి త్వరలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం గౌరవపూర్వకంగా అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంకోసం ప్రాణాలర్పించినవారి కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రకటించారు. ఆ క్రమంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు, వారి కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇండ్లులేని వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

తొలి దశలో ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం కరీంనగర్‌లో 164, వరంగల్‌లో 93, మెదక్‌లో 52, నల్లగొండలో 48, నిజామాబాద్‌లో 31, ఆదిలాబాద్‌లో 26, రంగారెడ్డిలో 18, మహబూబ్‌నగర్‌లో 17, హైదరాబాద్‌లో 11, ఖమ్మంలో ఇద్దరు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినట్లు గుర్తించారు. మరిన్ని కుటుంబాల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత! ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ తొందర్లోనే ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసుల ఎత్తివేత అంశంపై సోమవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో డీజీపీ అనురాగ్ శర్మ, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సత్యనారాయణ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డితో పాటు లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యమ కాలంలో నమోదైన కేసులు, వాటిని ఎలా ఎత్తివేయాలి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరిపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ కేసులు ఎత్తివేస్తామని మరోసారి మాటిచ్చారు. అందులో భాగంగానే హోంమంత్రి నాయిని దీనిపై సమీక్ష నిర్వహించారు.

నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యమైందన్న నాయిని.. త్వరలో రాబోతున్న పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కేసులన్నింటిని వీలైనంత త్వరగా ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు. ప్రతీ కేసును పరిశీలించి, ఎత్తివేతలో పాటించాల్సిన న్యాయపరమైన అంశాలను లా సెక్రటరీ సంతోష్‌రెడ్డితో చర్చించాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ అనురాగ్‌శర్మ సూచించారు. ఒకే జీవోలో మొత్తం కేసులను ఎత్తివేయడం కష్టసాధ్యమవుతుందని, సెక్షన్ల ప్రకారం కేసుల ఎత్తివేత మంచిదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి పదిహేను రోజులైనా పడుతుందని అంచనా.

ఎత్తివేయాల్సిన కేసులు 2103.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ప్రతి ఆందోళనలోనూ సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేసి వేల కేసులను నమోదు చేశారు. ఇందులో ఎన్నో అక్రమ కేసులు కూడా ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఆందోళనలు, డిమాండ్ల మేరకు గత ప్రభుత్వం 787 కేసులను మాత్రమే ఎత్తివేసింది. ఇంకా 2103 కేసులను పెండింగ్‌లోనే పెట్టింది. ఈ కేసుల లెక్కలను డీజీపీ అనురాగ్ శర్మ జిల్లాల వారీగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. రాజకీయ నాయకులతోపాటు విద్యార్థులు, పలువురు ప్రజాసంఘాల నేతలపై కేసులున్నాయి. వీటిలో అత్యధికంగా కరీంనగర్‌లోనే 503 కేసులు నమోదయ్యాయి.

వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500కు పెంపు తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ.1500కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనేక మంది వృద్ధ కళాకారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు వారికి నెలకు అందజేస్తున్న రూ. 500 పెన్షన్‌ను రూ.1500కు పెంచుతూ యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చరల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్య జీవో నంబర్ 4ను జారీ చేశారు. ఈ పెన్షన్ పెంపు ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వృద్ధ కళాకారుల వివరాలతో కూడిన జాబితాను జిల్లా కలెక్టర్లు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం డైరెక్టర్‌కు పంపించాలని, ఆ జాబితాను పరిశీలించిన అనంతరం అర్హత ఆధారంగా పెన్షన్లు మంజూరవుతాయని ఉత్తర్వుల్లో తెలిపారు.

అమరుల కుటుంబాలకు అన్న కేసీఆర్: అమరుల కుటుంబాలకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నలా అండగా నిలుస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆధారం తెగిపోయిందని ఆందోళన చెందుతున్న మాకు నేనున్నానంటూ కేసీఆర్ నాటినుంచి నేటివరకు అండగా నిలుస్తున్నారు. అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చెల్లించే ఫైల్‌పై సంతకం చేసిన ముఖ్యమంత్రికి మేమంతా రుణపడి ఉంటాం. కేసీఆర్ ఆదుకుంటున్న తీరును ఎంతచెప్పినా తక్కువే. అమరులైన మీ వాళ్లను తెచ్చి ఇవ్వలేను కానీ.. మీ కష్టాల్లో కన్న బిడ్డనవుతానన్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. -పద్మావతి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి

కేసీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు అసమానం. వారి కుటుంబాలను ఆదుకుంటామని టీఆర్‌ఎస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆదుకోవటం అభినందనీయం. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. గర్భశోకాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులకు కొడుకులుగా తెలంగాణ బిడ్డలంతా నిలబడాలి. కేసీఆర్ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. -దేవీప్రసాద్, టీఎన్‌జీవో అధ్యక్షుడు

ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కేసీఆర్ అండగా ఉంటారు కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేముందు అమరులకు పోలీసులతో అధికారికంగా గౌరవ వందనం చేయించారు. వారి త్యాగాలను గుర్తించి నివాళి అర్పించారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. అసెంబ్లీలో అమరులకు నివాళి, తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా, తెలంగాణ కోసం రాజీనామాలు చేయని ప్రతిపక్షాలు.. సీఎం అన్నీ చేస్తుంటే అనవసర రాద్దాంతం చేస్తున్నారు. అమరుల కుటుంబాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సీఎం అండగా ఉంటారు. -వీ శ్రీనివాస్‌గౌడ్, టీజీవో గౌరవాధ్యక్షుడు

సీఎం నిర్ణయాలు చరిత్రాత్మకం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు చరిత్రాత్మకమైనవి. దసరా పండుగ సందర్భంగా నిర్ణయాల అమలు హర్షణీయం. అమరుల కుటుంబాలకు రూ.10లక్షలు ఇస్తూ అండగా నిలబడుతున్నారు. ఉద్యోగుల విభజన జరగకపోయినా, తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకున్నా, అన్ని హామీలనూ అమలు చేస్తున్నారు. హామీల అమలుకు కొంత సమయం తీసుకోవటం సహజం. దసరా తర్వాత మిగతా హామీలు అమలు చేస్తారు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. -విఠల్, తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు

తడబడ్డ తల్లిపేగుల కుటుంబాలకు అండగా నిలిచారు తడబడ్డ తల్లిపేగుల కుటుంబాలకు కేసీఆర్ అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించడం హర్షణీయం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం నడుం కట్టిన కేసీఆర్.. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకు రావటం ఆయన చిత్తశుద్దికి నిదర్శనం. -జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు

తెలంగాణ అమరుల కుటుంబాలకు పది లక్ష రూపాయల ఆర్ధికసహాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనద. స్వరాష్ట్రం కోసం వారు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి, వారి కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత. – కే రఘు, తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త

ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేసుకున్న అమరుల కుటుంబాలకు సహయాన్ని అందించడం సంతోషకరం. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల కుటుంబాలకు ఆదుకుంటున్నారు. ఆర్థిక చేయూత ద్వారా అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. -శ్రీరంగారావు, న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్

గర్వించదగ్గ నిర్ణయం అమరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ సమాజం గర్వించదగ్గ విష యం. ఇప్పటిదాకా అమరులను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంది, ఇక పై ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. -ఎన్ జానయ్య, తెలంగాణ ఎలక్ట్రిసిటీ జేఏసీ కన్వీనర్

కేసీఆర్‌ది గొప్ప హృదయం దశాబ్దకాలం పాటు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించడంతో పాటు ప్రభుత్వపరంగా అమరుల కుటుంబాలను ఆదుకోవడం కేసీఆర్ లాంటి నేతలకే చెల్లుతుంది. -ఎ సుధాకర్‌రావు, టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు

హామీని నిలబెట్టుకున్నారు అమరుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టున్నారు. ఆర్ధిక సహాయంతోపాటు ఉద్యోగాలు, గృహవసతి, భూమి తదితర సౌకర్యాలను కల్పిస్తుందని ఆశిస్తున్నాం. -బద్రీనాథ్‌గౌడ్, హైకోర్టు ఉద్యోగుల కార్యదర్శి

కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఇవ్వడం హర్షణీయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనం. -పీ వెంకటరెడ్డి, టీటీజేఏసీచైర్మన్

తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుంది తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలను యావత్ తెలంగాణ ప్రజానీకం కలకాలం గుర్తుంచుకుంటుంది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం ప్రథమ కర్తవ్యమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ , తన ఎన్నికల హామీ మేరకు ఆర్థిక సహాయం అందించడం హర్షణీయం. -పీ గోవర్ధన్‌రెడ్డి, న్యాయవాది, రంగారెడ్డి జిల్లా కోర్టులు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.