-ముఖ్యమంత్రి ఈ బొమ్మకు ప్రాణం పోసిండు -ఊళ్లకు ఊళ్లే తీర్మానం -నేను ఈ మట్టి బిడ్డను.. ఇవ్వాళైనా రేపైనా ఇక్కడే ఉంటా.. -టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్

నేనొక సామాన్య కార్యకర్తను. అతిసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాణ్ని.. అటువంటి నాకోసం ఎంతో మంది గొప్పనాయకులు, మంత్రులు, వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు.. ప్రజల ఆద రాభిమానాలు వారు చూపిస్తున్న ప్రేమ అసామాన్యమైనది అంటూ ఉప్పొంగిపోతున్నారు టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమనేత, నేటి సీఎం కేసీఆర్ నాకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే అవకాశాన్ని కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయంగా మట్టిగా ఉన్న నాకు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ప్రాణం పోశారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణమే కాదు ప్రజల రుణం తీర్చుకోలేను. ప్రతీ ఒక్కరూ నేనే అభ్యర్థిని అన్నంతగా పనిచేస్తున్నారు. అపూర్వంగా ఆదరిస్తున్నారు. ఊళ్లకు ఊళ్లే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అందరి సహకారం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే నన్ను పార్లమెంట్‌కు పంపించబోతున్నాయి. ఈసందర్భంగా ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.
నమస్తే తెలంగాణ : టికెట్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? దయాకర్ : నిజంగా నేను కలలో కూడా ఎంపీ టికెట్ వస్తుందని ఆశించలేదు. నేనే కాదు ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న ఏ సామాన్య కార్యకర్త కూడా ఊహించి ఉండరు. అటువంటి గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు కల్పించారు. ఎన్ని జన్మలు ఎత్తినా టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ ఆ తల్లి రుణాన్ని తీర్చుకునేందుకు ఎంపీ టికెట్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం.
నమస్తేతెలంగాణ : ప్రజల ఆదరణ ఎట్లా ఉంది..? దయాకర్ : నాకు టికెట్ ఇచ్చిన మరుక్షణం నుంచే టీఆర్‌ఎస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ అపూర్వ స్పందన వచ్చింది. ఒక సామాన్య కార్యకర్తకు ఆ అవకాశాన్ని కల్పించడమనేది ఒక అంశం అయితే ఇతర రాజకీయ పార్టీలకు ఇదొక పాఠంగా నేను ఉపయోగపడడం ఒక అదృష్టం. ప్రజల ఆదరణ చెప్పాలంటే కండ్లకు నీల్లొస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 15గ్రామాలు నాకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేయడమే కాకుండా ఆర్థికంగా సహకరిస్తున్నారు. నేను వెళ్లినచోట ప్రతి గడప నన్ను ఒక కన్నబిడ్డలా చూసుకుంటోంది. మంగళహారతులు ఇచ్చి దీవిస్తోంది. తిలకం దిద్దుతోంది.
నమస్తేతెలంగాణ : మీ ప్రచార సరళి వివరిస్తారా? దయాకర్ : ఎన్నికల ప్రచారం వ్యూహాలు రచించడమే కాదు అమలు చేయడంలో టీఆర్‌ఎస్ పార్టీ తర్వాతే ఏ పార్టీ అయినా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి చందూలాల్ ఒక రకమైన ప్రచార సరళిని అనుసరిస్తే, ఎదుటివాళ్ల ఎత్తుగడల్ని తిప్పికొట్టగల ఉద్దండులు ప్రతి నియోజకవర్గానికొక మంత్రిగా నన్ను వారి తమ్ముడిలా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఈ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంతో మంది నన్ను గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల అబద్ధాల ప్రచారాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్నారు.
నమస్తేతెలంగాణ : ప్రభుత్వ వ్యతిరేకత మాకు అనుకూలిస్తుందని మీ ప్రత్యర్థులు అంటున్నారు కదా? మీరేమంటారు? దయాకర్ : ఇదొక అబద్ధపు, అసత్య ప్రచారం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నిక ఫలితాల గీటురాయి కానున్నాయని ముందే ప్రకటించాం. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడమే పనిగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు వాళ్ల వాదనను పట్టించుకునే పరిస్థితిలో లేరు.
నమస్తేతెలంగాణ : చివరగా మీరు ప్రజలకు ఏం చెపుతారు..? దయాకర్ : నేను ఈ మట్టి బిడ్డను. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. మీతోనే ఉంటాను. పేదరికం నుంచి వచ్చిన నాకు కష్టమంటే ఏంటో తెలుసు. మీ కష్టాల వారధిగా బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కూలీగా పనిచేస్తా. పార్లమెంట్‌లో ఒక కళాకారుడిగా తెలంగాణ కష్టాల కాన్వాస్‌ను వేసి సమస్యల్ని ఏకరువు పెడతా.