-ఉద్యోగావకాశాల్లో యువతకు వయోపరిమితి మినహాయింపు: సీఎం కేసీఆర్ -నాలుగైదు నెలల్లో లక్ష ఉద్యోగాల భర్తీ -ఉద్యోగ కల్పనపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది -మానవీయకోణంలో ఆలోచిస్తున్నాం.. -నూటికి నూరుశాతం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం -అసెంబ్లీలో ముఖ్యమంత్రి పకటన

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలన్నింటినీ భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశా నిస్పృహలకు లోనుకావద్దని, వచ్చే నాలుగైదు నెలల్లోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నూటికి నూరుశాతం కట్టుబడి ఉందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) పాటించి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత విషయంలో ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచిస్తున్నదని సోమవారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని.. కొత్త రాష్ట్రం తన గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించుకునే క్రమంలో ఉందని తెలిపారు. పోలీసు శాఖలో 3,700 కానిస్టేబుళ్లు, హోంగార్డుల పోస్టుల భర్తీకి నియామకానికి అనుమతించామన్నారు. రాష్ట్రంలో25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. అందులో 21వేల మంది వరకు మనకు (తెలంగాణ) వస్తారని అధికారులు చెప్తున్నారు. వారిలో 19వేల మందిపై స్పష్టత వచ్చింది అని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, ఈ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందన్నారు.
ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలకు ప్రాధాన్యం పెరిగిందని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామక్రమంలో భాగంగా ఒక్క హైదరాబాద్‌లోనే రెండు లక్షల మందికిపైగా యువత ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీలు ఏ విషయాన్ని తేల్చకపోవడం వల్ల ఉద్యోగ భర్తీపై సందిగ్ధ స్థితి నెలకొందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలపై స్పష్టత వస్తే కొన్ని శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను కుదించాల్సి ఉంటుంది. కారణం ఏమో కానీ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ తేల్చడంలేదు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ క్యాడర్ విభజనపై ప్రత్యుష్‌సిన్హా కమిటీ తేల్చడం లేదు. విద్యుత్, ఆర్టీసీ, సింగరేణి వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలపై షీలా బిడే కమిటీ నిర్ధారించాల్సి ఉన్నది. ఈ విషయాలపై ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాశాం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును వ్యక్తిగతంగా కలిసి కూడా వివరించాం. అయినా పరిస్థితిలో మార్పులేదు అని సీఎం వివరించారు.
ఉద్యోగాల భర్తీ అంశంపై 1985 డీఎస్సీ అంటూ కొందరు.. 1998 డీఎస్సీ అంటూ మరొకొందరు నావద్దకు వస్తున్నారు. వీరందరికీ అన్యాయం జరగడానికి కారకులెవ్వరు..? ఆనాడు ఈ ఫైళ్లంటినీ పెండింగ్‌లో పెట్టిన పుణ్యాత్ములే మళ్లీ వారితో ఉద్యమాలు చేయిస్తున్నారు. ఇన్నేండ్ల చెత్తా చెదారం చిటికెలో కడిగేయడం సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగావకాశాలపై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రానున్న రోజుల్లో విస్తారమైన అవకాశాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ తేల్చేస్తే పరిస్థితులను బట్టి వయోపరిమితి మినహాయించి అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1.07లక్షల ఖాళీ ఉద్యోగాలతోపాటు తెలంగాణ జెన్‌కో 6,000మెగావాట్లు, ఎన్టీపీసీ 4,000మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.
వీటిల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఒక్క తెలంగాణ జెన్‌కోలోనే దాదాపు 12వేలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని సీఎం వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నియామకాలు చేపడుతామని, క్యాడర్లవారీగా ఎన్ని పోస్టులు వస్తాయనే అంశంపై స్పష్టత వస్తే నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రకరకాల పథకాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా తమకూ ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతున్నారు. వారంతా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారే. అవుట్ సోర్సింగ్ తెచ్చిన పుణ్యాత్ములే వారిని రెచ్చగొడుతున్నారు. విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కొత్తగా ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తున్నదని, ఒకట్రెండు రోజుల్లో సభలో ప్రవేశపెట్టి దానిపై కూలంకషంగా చర్చ చేపడుతామన్నారు. కొత్త పారిశ్రామిక విధానం కింద 2.35లక్షల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వద్ద సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా ఫార్మాసిటీకి శ్రీకారం చుడతామని, పౌల్ట్రీ రంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
జిమ్మెదార్‌తో పనిచేస్తున్నాం: ఈటల నిధులు, నీళ్లు, నియామకాలు మా ట్యాగ్‌లైన్.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జిమ్మెదార్‌తో పనిచేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 344 నియమం కింద ఇచ్చిన నోటీసుపై సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ కమలనాథన్ కమిటీ ఇంత వరకు ఉద్యోగుల విభజన పూర్తిచేయలేదు.
కేంద్రం నియమించిన ప్రత్యుషసిన్హా కమిటీ క్యాడర్ డివిజన్ ఇంత వరకు తేల్చలేదు. దీని వెనకాల ఎక్కడో కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది అని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నా ప్రభుత్వం ఉన్నంతలో అందుబాటులో ఉన్న అధికారులతో పాలనను సాగిస్తున్నదని తెలిపారు. పది జిల్లాల్లో 5,23,675 పోస్టుల మంజూరు ఉండగా, 4,15,931 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇంకా 1,07,744 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తమవద్ద సమాచారం ఉందన్నారు.
ఇవికాకుండా కాంట్రాక్టు కార్మికులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్‌ఎంఆర్‌లతో 89 ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలు ఉన్న మాట వాస్తవమన్నారు. క్యాడర్ కేటాయింపులపై తమ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నది. కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చాక వచ్చే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు అడ్డుకట్ట వేస్తున్నది ఎవ్వరో తెలుసుకోండని ఈటల విపక్షాలకు సూచించారు.
ఎన్డీఏ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలు, హెచ్‌ఎంటీ, రిపబ్లిక్‌ఫోర్జ్, ఐడీపీఎల్ వంటి కంపెనీలను మూసివేసిందెవరు..? ఆనాడే వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తే వాటిని అమ్ముకున్నది ఎవరో విపక్షాలే ఆలోచించాలి. అధికారంలోకి వస్తే నిజాం షుగర్‌ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఆ తర్వాత పట్టించుకోలేదు అని పేర్కొన్నారు. ఇలా అన్నిచోట్ల తెలంగాణ ఉద్యోగావకాశాలను కాలరాసిన మీరు (కాంగ్రెస్).. మళ్లీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులను రెచ్చగొడుతుండ్రు అని మంత్రి ఈటల ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను విస్తరింపజేస్తామని, యువతలో వృత్తినైపుణ్యతను తీసుకువస్తామని తెలిపారు.