-మూడేండ్లలోపు పిల్లలను బడిలో చేర్చుకుంటాం -వచ్చే ఏడాది నుంచి చర్యలు: డిప్యూటీ సీఎం కడియం
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉంటున్నది. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు బడికి ఎగనామం పెట్టి విద్యార్థులకు అన్యాయం చేయవద్దు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేండ్లలోపు పిల్లలను బడిలో చేర్పించుకునేలా చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం.
ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన 58వ ఐటీడీఏ పాలక మండలి సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తున్నదన్నారు. ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలో 256 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని, 7500 మంది సిబ్బందిని నియమిస్తామన్నారు. ఏజెన్సీలో వైద్యులు లేకుంటే డిప్యూటేషన్‌పై పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏటూరునాగారంలో రెఫరల్ హాస్పిటల్ ఏర్పాటుకు వైద్యులు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని ప్రకటించారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ తండా నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం లో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ఎంపీలు సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ వాకాటి కరుణ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

