-హోంశాఖ లేఖపై 18న పూర్తిస్థాయి చర్చ.. హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ -రాష్ర్టాల అధికారాల్లో జోక్యం ఉండదు -అభ్యంతరకర అంశాలుంటే తొలిగిద్దాం -టీఆర్‌ఎస్ ఎంపీలకు రాజ్‌నాథ్ హామీ -లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన

గవర్నర్‌కు అధికారాలపై టీఆర్‌ఎస్ ప్రారంభించిన పోరాటంతో కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ పంపిన ఉత్తర్వులకు సోమవారం తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ ఉత్తర్వుల అమలును ఈ నెల 18 వరకూ నిలిపివేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. హోంశాఖ ఉత్తర్వులు కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమేనని, వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్నదానికి విరుద్ధంగా అందులో ఏవైనా ఉంటే వాటిని తొలిగిద్దామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఈ నెల 18వ తేదీన టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమై ఆ ఉత్తర్వులలోని అంశాలపై కూలంకశంగా చర్చించేందుకు ఆయన సమ్మతించారు. అంతకుముందు గవర్నర్‌కు అధికారాలు కల్పించే ఉత్తర్వులను నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో పెద్దఎత్తున ఆందోళన జరపడంతో సభ వాయిదా పడింది.
జీరోఅవర్‌లో ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ జితేందర్‌రెడ్డి తెలంగాణ విషయంలో కేంద్రం వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఉదాహరణలతో వివరించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేంద్రం చర్యను సమర్థిస్తూ ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేకపోవడంతో టీఆర్‌ఎస్ ఆందోళనకు దిగడంతో సభ తిరిగి వాయిదా పడింది. అనంతరం హోంమంత్రి టీఆర్‌ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై వారి వాదనలు విని ఉత్తర్వుల తాత్కాలిక నిలిపివేతకు హామీ ఇచ్చారు. పూర్తిస్థాయి చర్చకు 18వ తేదీని నిర్ణయించారు.