-పీవీ అంశంపై జానా -మంత్రుల మాటామాటా -పీవీ జయంతిని సెంటిమెంటుకు వాడుకున్నారు: జానా -మీరెన్నడైనా జయంతి, వర్థంతి చేశారా?: హరీశ్ -కనీసం శవాన్ని పూర్తిగా కాల్చలేదు: కేటీఆర్ -పదవి పోయాక పట్టించుకోలేదు: జగదీశ్‌రెడ్డి -నూటికి నూరు శాతం చూస్తారు.. తెలంగాణ సాధనే ఒక అద్భుతం -వచ్చే బడ్జెట్ నాటికి మీరే ప్రశంసిస్తారు -బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నేత జానారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మూసలో కొట్టుకుపోయే వారికి ఏమీ కనిపించదనీ, తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరు శాతం అద్భుతాలు చూస్తారనీ కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బదులిచ్చారు. ఆశల పల్లకీలో కూర్చుని బడ్జెట్ తయారు చేశారని, దీనిమీద చర్చ జరపడం కూడా అద్భుతమేనని జానారెడ్డి అన్నారు. సీఎం ప్రతిసారీ అద్భుతాలు చేస్తామంటారు..
ఈ బడ్జెట్ కూడా అద్భుతంలాగే ఉందని అన్నారు. ఈ సందర్భంగా కల్పించుకున్న కేసీఆర్ మూసగా ఆలోచించేవారికి ఏమీ కనిపించదని అన్నారు. అవును అద్భుతమే… తెలంగాణ ఉద్యమం నుంచి అన్నీ అద్భుతమే. అద్భుతాలు జరుగుతాయనే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. వారి ఆశలు నూరుశాతం నిజమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయి. మేం చేసి చూపిస్తాం. వచ్చే బడ్జెట్ సందర్భంగా మీరే ప్రశంసిస్తారు అని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల అనంతరం రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షనేత కుందూరు జానారెడ్డి సుమారు గంటా యాభై నిమిషాల పాటు ప్రసంగించారు. గత కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని పదేపదే ప్రస్తావిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన వివిధ అంశాలను ఆయన సునిశితంగా విమర్శించారు.
లోటు భర్తీ చేయగలరా?.. రాష్ట్ర బడ్జెట్‌లో 4.79 శాతం లోటు చూపించి ఎలా భర్తీ చేస్తారో మాత్రం చెప్పలేదని జానారెడ్డి అన్నారు. పథకాలకు కేటాయించిన నిధులు మార్చిలోపు ఎలా ఖర్చు చేస్తారో కూడా తెలియదని, ఈ ఐదు నెలల్లో ఇంత బడ్జెట్‌ను ఖర్చు పెడితే విచిత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజలను గందరగోళ పరచవద్దు. ప్రభుత్వం వాస్తవాలు వివరించాలి. బడ్జెట్‌లో పొందుపరిచిన వాటిలో వాస్తవాలు లేవు. లెక్కలు సరిగ్గా లేవు. ఆశల పల్లకీలో కూర్చొని ఆధారాలు లేని బడ్జెట్‌ను పెట్టారు అన్నారు. బడ్జెట్‌లో ఆదాయాలపై కూడా స్పష్టత లేదని, 10 నెలల కాలానికి పెట్టిన బడ్జెట్‌లో రూ.17వేల కోట్ల ఆర్థిక లోటును చూపారని, దాదాపు రూ.23వేల కోట్లు వచ్చే అంశంపై ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీడీపీ రేటు బాగా పెరిగిందని చెప్పారు. 1994-2004 మధ్య 5.72% జీడీపీ ఉంటే 2004-14లో 8.23 శాతానికి పెరిగిందన్నారు. వృద్ధి రేటు దేశ సగటుకు, గుజరాత్ సగటుకన్నా ఎక్కువ అన్నారు. 1994లో తలసరి ఆదాయం రూ.15505 ఉంటే 93వేలకు పెరిగిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఏర్పడిన సమయంలో ఏపీ రూ.176కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభమైతే, తెలంగాణకు రూ.2545కోట్ల మిగులు బడ్జెట్‌ను వచ్చిందన్నారు.
4.79శాతం లోటు ఉంటే అప్పులెలా వస్తాయి? మూడుశాతం ఆర్థికలోటు ఉంటేనే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం లోన్లు వస్తాయని, బడ్జెట్‌లో 4.79 శాతం లోటు ఉంటే అప్పులు ఎలా వస్తాయని జానా ప్రశ్నించారు. చట్టం ఏమైనా సవరించారా..? 4.79శాతం ఆర్థిక లోటు ఉంటే ఆర్‌బీఐ సహకరిస్తుందా? అని అడిగారు. రూ.18వేల కోట్ల లోన్లు తెసామంటున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం మనకు రూ.11వేల కోట్లు మాత్రమే వస్తుంది. మిగిలిన రూ.6300 కోట్లు ఎలా తెస్తారు. అని సందేహం వ్యక్తం చేశారు.
ఆదాయాన్ని బట్టి లోన్ తీసుకోవచ్చు: సీఎం ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కల్పించుకుని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని మార్చడం సాధ్యం కాదని, అది కేంద్రమే చేయాలని గుర్తు చేశారు. ఎస్‌వోటీఆర్, ఎస్‌వోఆర్‌లో వచ్చే ఆదాయాన్ని బట్టి 90శాతం లోను తీసుకోవచ్చు. దీనికి ఎఫ్‌ఆర్‌బీఎం వర్తించదు. ప్రభుత్వ సంస్థలు తీసుకునే లోన్లకు ఎఫ్‌ఆర్‌బీఎం వర్తించదు. కానీ ప్రభుత్వ అనుమతి కావాలి. ఆర్థిక లోటును 3శాతం నుండి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీని ఇటీవల ఢిల్లీకి పోయినప్పుడే కోరాం. ప్రతిపాదనలు పంపమన్నారు. ఇంకా 35వేల కోట్ల లోను తీసుకోవచ్చు. అని బదులిచ్చారు.
భూములెప్పటికి అమ్ముతారు?: జానా భూములు అమ్మి రూ.6500 కోట్లు వస్తాయని చెప్పడంపై జానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ ప్రభుత్వం, ఆ తరువాత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో భూములమ్మితే రూ.10వేల కోట్లు కూడా రాలేదు.. ఇపుడు వస్తాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రకటనలివ్వలేదు. టెండర్లు పిలవలేదు.. ఎప్పుడు టెండర్లు ఫైనల్ కావాలి. ఎప్పుడు కొనాలి. డబ్బులు ఎప్పుడు అందాలి. ఈలోపు మార్చి అయిపోదా? అని ప్రశ్నించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21వేల కోట్లు సాధ్యం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2012-13లో 7వేల కోట్లు, 2013-14లో 8991కోట్లు వచ్చాయని గుర్తు చేశారు.
ఒక్క తెలంగాణకు రూ. 21వేల కోట్లు ఎలా ఆశిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం కింద కూడా రూ.11వేల కోట్లు రావన్నారు. ఇలా మొత్తంగా ప్లాన్ బడ్జెట్లో రూ.23వేల కోట్లు సమకూరే అవకాశం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం రూ.1.10లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిందని తెలంగాణ కూడా రూ.లక్షకోట్ల బడ్జెట్ పెట్టిందా..? అని ప్రశ్నించారు. 2011జనాభా లెక్కల ప్రకారం మైనార్టీలు రాష్ట్రంలో 12.5శాతం ఉండగా ముస్లింలు 11శాతం ఉన్నారని బడ్జెట్‌లో ఎందుకు చెప్పారని అడిగారు. అయితే మైనార్టీలు.. ముస్లింలు పదాల మధ్య తేడాను సభ్యులు వివరించడంతో జానా సవరించుకున్నారు. ముస్లింల రిజర్వేషన్లపై ఏం చేస్తున్నారని అడిగారు.
రుణమాఫీ చేసినందుకు అభినందనలు.. రుణమాఫీ పథకానికి రూ.4250 కోట్లు ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని జానా అభినందించారు. అయితే అందులో గందరగోళం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండులక్షల లోను తీసుకుంటే 7శాతం, లక్ష తీసుకుంటే 4శాతం వడ్డీ కింద రుణాలు ఇచ్చిందని, ఆ తరువాత జీరో వడ్డీకే రుణాలు ఇప్పించామని తెలిపారు. రుణమాఫీ అనగానే ఏడాది నుండి వడ్డీలు కట్టడం లేదని చెప్పారు. మా డ్రైవర్ కూడా లోన్ తీసుకున్నారు. ఆయన భార్య లోను రద్దు అయితే డ్రైవర్‌ది కాలేదు. రద్దు అయితదనుకున్న సార్ అంటున్నాడు. ఇప్పుడు వడ్డీతో సహ కడుతున్నాడు అని చెప్పారు. బ్యాంకులు రైతులకు అప్పులిచ్చే విధంగా చెప్పాలని సూచించారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ ఇచ్చిన జీవోను అమలు చేస్తే రూ.1.5 లక్షలు పరిహారంకింద ఇవ్వొచ్చునని చెప్పారు. ఇప్పుడు నివేదిక అనకుండా వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. ఇలాంటివి అడిగితే మమ్మల్ని ద్రోహులు అని అంటున్నారు. మమ్మల్ని ద్రోహులు అన్నా పర్వాలేదు. కానీ మీరు ప్రజలకు మాత్రం ద్రోహం చెయ్యొద్దు అని అన్నారు
నిబద్ధతతో ఉన్నాం: ఈటెల ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలుగచేసుకుని తాము రైతుల పట్ల నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. మమ్మల్ని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తారని అనడం సమంజసమా..? అని ప్రశ్నించారు. రైతులను కష్టాల నుండి విముక్తి చేయడానికే రాష్ట్రం సాధించామని అన్నారు. 57సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూశామని, అందరిచేత భేష్ అనిపించుకునేలా పనిచేస్తామని అన్నారు.
ప్రాస కోసం వాడాను: జానా ద్రోహం అనేది యతిప్రాస కోసం వాడాను తప్ప మరో ఉద్దేశం లేదని జానారెడ్డి వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని పనులు చేస్తే తాముకూడా అభినందిస్తామని అన్నారు.
నియోజకవర్గానికి 30ఇండ్లేనా? భూమిలేని దళితులకు భూమి కొనిచ్చేందుకు రూ.1000 కోట్లు పెట్టారని, అయితే తెలంగాణలో భూమిలేని ఎస్సీ కుటుంబాలు 10 లక్షల వరకు ఉంటాయని జానా చెప్పారు. ఎకరా 4లక్షలు అనుకుంటే వెయ్యికోట్లతో 8333 కుటుంబాలకే భూమి వస్తుందన్నారు. ఇలా వెయ్యికోట్లు ఇచ్చుకుంటూ పోతే 120సంవత్సరాలు పడుతుందని అన్నారు. దళితుల కోసం మొత్తం రూ.50 వేల కోట్లు అన్నారని దీనితో నాలుగు లక్షల కుటుంబాలకే వస్తుందని చెప్పారు. అదీ నాలుగు పర్యాయాలు అధికారంలోకి రావలిసి ఉంటుందని అన్నారు. రూ.119 కోట్లు టూబీహెచ్‌కే కు చూపించారు. దీంతో మూడువేల ఇండ్లే కట్టొచ్చు. అంటే నియోజకవర్గానికి 30 ఇండ్లే వస్తామని అని వ్యంగ్యంగా అన్నారు.
మీ వ్యంగ్యాలు మీకే వర్తిస్తాయి: ఈటెల ఈటెల స్పందిస్తూ మాపై సంధించే వ్యంగ్యాస్ర్తాలు మాకు వర్తించవని, మీకే వర్తిస్తాయని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పథకంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అందమైన ఇండ్లు..అద్దంలాంటి రోడ్లు అన్నారు. ఇంకా చాలా అన్నారు.. కానీ నేటికి మురికివాడలే మిగిలాయని అన్నారు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ గాంధీ, అంబేద్కర్ పేరు చెప్పుకుంటుందని, దేశాన్ని పాలించిన ప్రతిసారి రాజ్యాంగంపై ప్రమాణం చేశారని మరి దేశం ఎందుకిలా ఉందని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇండ్లను మీ స్కీములోకి మార్చండి: జానా జానారెడ్డి స్పందిస్తూ ఇందిరమ్మ కింద ఇంకా 4.69 లక్షల ఇండ్లు పూర్తి కాలేదు. మా హయాంలో 37లక్షల ఇళ్లు కట్టాం. అవికూడా కట్టకపోతే మీకు ఇంకా ఇబ్బంది అయ్యేది. పెండింగ్‌లో ఉన్న ఇండ్లను టూబీహెచ్‌కే స్కీం కిందకు మార్చండి. ఇందిరమ్మ స్కీం సమయంలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. దీనిపై కూడా దృష్టి పెట్టండి. మా సమయంలోనే రెండు లక్షల ఇళ్లలో అవకతవకలు జరిగినట్లు తేలితే అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
మట్టి తీయకుండా బిల్లులు లేపారు: పోచారం దీనిపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో 150 ఇళ్లకు కనీసం మట్టి తియ్యకుండా బిల్లులు లేపారని చెప్పారు. విచారణ జరిపితే డీఈ, ఏఈలు సస్పెండ్ అయ్యారని, డబ్బులు తీసుకున్న వ్యక్తి మాత్రం తనకేమీ తెలియదని దర్జాగా తిరుగుతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చింది కేవలం ప్రొత్సాహకమే కానీ తమ ప్రభుత్వం ఇంటినే నిర్మించి ఇస్తుందని తెలిపారు.
కేంద్ర సంస్థలు తెచ్చింది మేమే: జానా అనంతరం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రసంగించిన జానారెడ్డి కాంగ్రెస్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీఎల్, ఐడీపీఎల్, సీసీఎంబీ, ఎన్‌ఎండీసీలాంటి అనేకం వచ్చాయని చెప్పారు. అవుటర్ రింగురోడ్డు కోసం రూ.6496కోట్లు ఖర్చుపెట్టామని తెలిపారు. కృష్ణా మొదటి దశ తాగునీటి కోసం శంకుస్థాపనకు వెళ్తే అక్కడ ఫైరింగ్ జరిగి ఇద్దరు మరణించారని, ఆ తరువాత చంద్రబాబు రెండో విడతను తెచ్చారని, మూడో విడత వస్తుందని తెలిపారు. మెట్రోకు 14వేలు ఖర్చు అయితే ఇందులో ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం రూ.1458కోట్లు ఇచ్చిందని, ఐటీఐఆర్‌ను సాధించిన ఘనత కూడా తమదేనని అన్నారు.
బడ్జెట్‌లో 90కోట్లే చూపారని అన్నారు. బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవార్డును కేటీఆర్ ఢిల్లీలో అందుకున్నారని, దీనికి కారణం కూడా తామేనన్నారు. నేడు మూడున్నర లక్షల ఉద్యోగులు ఐటీ రంగంలో ఉన్నారని, దీనికి ఆనాడున్న పీవీ నర్సింహరావు ప్రధానిగా చేసిన కృషి కారణమని అన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పీవీ నరసింహరావు పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరును మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టడంతో జానా ఆత్మరక్షణలో పడిపోయారు. మంత్రి హరీశ్‌రావు : పీవీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ వారు కనీసం ఆయన వర్థంతి, జయంతి కూడా జరపడం లేదు. ప్రధానిగా ఉన్నపుడు వాడుకున్నారు తప్ప తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.
జానారెడ్డి : పీవీని ప్రధాన మంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ. మీరు జయంతి అని సెంటిమెంటుకు వాడుకున్నారు. కేటీఆర్: తెలంగాణ బిడ్డ గొప్ప పదవికి ఎదిగారు.. కాబట్టి జయంతి జరిపి గౌరవించుకున్నాం. సెంటిమెంటు కోసం కాదు. మా పార్టీ కాకపోయినా ఆయన మీద గౌరవంతో చేశాం. భారత రత్నకు ఆయన పేరును పంపించాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆయన పేరును కూడా ఉచ్ఛరించేందుకు భయపడ్డారు. ఆయన మరణం తర్వాత 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏనాడూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేయలేదు. కనీసం భారతరత్నకు పేరును కూడా పంపలేదు. ఆయన చనిపోతే మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి కూడా తీసుకెళ్లలేదు. ఇతర ప్రధాన మంత్రులలాగా ఢిల్లీలో ఘాట్ కూడా నిర్మించలేదు. శవం పూర్తిగా కాలకుండానే అస్తికలు పంపారు. కానీ మా ప్రభుత్వం భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా పాఠ్యాంశాల్లో చేరుస్తున్నాం.
జానారెడ్డి: ఎవరు ఏం చేశారన్నది వాదప్రతివాదాలు వద్దు. ఇంట్లో కూర్చున్న పీవీని ప్రధానిని చేసింది కాంగ్రెస్ పార్టీనే. అది గుర్తించాలి. జగదీష్‌రెడ్డి: ప్రధానిగా చేసిన వ్యక్తిని జైలుకు పంపింది కూడా కాంగ్రెస్ పార్టీనే. పదవి పోయాక పట్టించుకోలేదు. కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు ఆయన పేరు ఎత్తడం ఎందుకు. ఇప్పట్లో ఓట్లు కూడా ఏం లేవు. పాఠ్యాంశాల్లో చేరుస్తుంది కీర్తికోసం కాదు.. విద్యార్థులు చదువుకోవాలనే చేరుస్తున్నాం. జానారెడ్డి : జైలుకు పంపామనేది ఉపసంహరించుకోవాలి. మంత్రి హరీశ్‌రావు : మేము విత్‌డ్రా చేసుకుంటాం, అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలను విత్‌డ్రా చేసుకుంటారా..? జానారెడ్డి: మీరందరూ మాట్లాడి నా ఫ్లో పోగొడితిరి. (సభలో నవ్వులు విరిశాయి) రింగురోడ్డులో ఏం జరిగిందో తెలియదా?: కేటీఆర్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జానారెడ్డి ప్రతిపక్షనేతగా సుదీర్ఘంగా, సునిశిత విమర్శలు చేస్తున్నారు. మంచిదేనని అన్నారు. అయితే 50సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడానికి కారణం వారేననడం సరికాదని అన్నారు. రక్షణరంగ సంస్థలకు శత్రుదుర్భేధ్యమైన నగరంగా హైదరాబాద్‌ను గుర్తించి నిపుణుల సూచనల మేరకే ఇచ్చారని అన్నారు. అంబేద్కర్‌లాంటి మహానీయులు హైదరాబాద్ గురించి ఏమన్నారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి అంశంలో రంధ్రాన్వేషణ సరైంది కాదని అన్నారు. రింగురోడ్డు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని నాడు వైఎస్ తమ నేత ఈటెల రాజేందర్‌ను పిలిపించి బెదిరించిన విషయం కూడా మీకు తెలుసునని అన్నారు.
నూతన పారిశ్రామిక విధానం వెల్లడించాలి.. ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని వెంటనే వెల్లడించాలని జానారెడ్డి కోరారు. చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు, కరెంటు కోతలనుండి తప్పించేందుకు డీజిల్ ట్యాంక్‌లపై వ్యాట్‌ను మినహాయించాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అజంజాహీ మిల్, ప్రాగాటూల్స్, హెచ్‌సీఎల్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ కంపెనీలను పునరుద్ధరిస్తామన్నా బడ్జెట్‌లో వీటి ప్రస్తావన లేదన్నారు. లక్ష ఉద్యోగాల ప్రస్తావన కూడా లేదన్నారు. చేవెళ్ల-ప్రాణహిత, కాంతనపల్లి ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేందుకు అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లాలని అన్నారు.
విద్యుత్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే 8 వేల మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ముఖ్యమంత్రి అన్నట్లుగా మూడేండ్లలో 21వేల మెగావాట్లు అంటే విచిత్రమేనని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపనకు ప్రయత్నించాలన్నారు. గిరిజన, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లపై కమిటీ వేశారని, నివేదిక ఎప్పుడొస్తుందో చెప్పాలని అన్నారు. హామీలు నిలుపుకుని, అభినందనలతో ప్రభుత్వాన్ని సాగించాలని అన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు సహకారం కావాలన్నా అందిస్తామని చెప్పి ప్రసంగాన్ని ముగించారు.