Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అభివృద్ధి, సంక్షేమంలో మనమే మేటి

-బతుకు పండించే బంగారు తెలంగాణ .. త్రికరణశుద్ధితో లక్ష్యసాధనకు కృషి -పేదలకు భరోసాయే నిజమైన అభివృద్ధి -30వేల కోట్లతో 35 పథకాలు అమలు చేస్తున్నాం -37వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం -2018నాటికి అన్ని గ్రామాలకు భగీరథ నీరు -వారంలో మరో 20 గురుకులాలు -స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ -23న మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకుంటాం -దసరానాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి -అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం -గోల్కొండ కోటలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం

CM-KCR-addressing-in-Independence-day-celebrations-at-Golconda-fort

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బతుకులు పండించే బంగారు తెలంగాణగా మలుచుకోవడమే లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వం త్రికరణశుద్ధితో కృషి జరుపుతున్నదని ఆయన అన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయని, అయినా ప్రజాబలమే అండదండగా భావించి స్థిర చిత్తంతో ముందుకు వెళుతున్నామని సీఎం చెప్పారు. రెండేండ్ల స్వల్పకాలంలోనే బాలారిష్టాలు అధిగమించి అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశం దృష్టిని ఆకర్షించామని పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని, జల వివాదాలను పరిష్కరించి చారిత్రక ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు పెట్టించామని, మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపిస్తున్నామని తెలిపారు.

మిషన్ కాకతీయతో 20వేల చెరువులకు జలకళ తీసుకువచ్చామని, 2018 మార్చినాటికి మిషన్ భగీరథకింద ప్రతిఇంటికీ మంచినీరు అందించబోతున్నామని వివరించారు. లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ఇప్పటికే 37 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టామని చెప్పారు. ఇరుగు పొరుగుతో సుహృద్భావంతో వ్యవహరిస్తున్నామని, సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నామని అన్నారు. పేదల బతుకులకు భరోసా, భద్రత ఇవ్వటమే నిజమైన అభివృద్ధిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి, ఆ లక్ష్యసాధనకు రూ.30 వేల కోట్లతో 35 పథకాలను అమలు చేస్తూ సంక్షేమంలో దేశంలోనే మేటి రాష్ట్రంగా నిలిచామని అన్నారు. 70వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం చారిత్రక గోల్కొండ కోట నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. అంతకుముందు జాతీయ జెండా ఎగరేసి భద్రతాదళాల గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రదినోత్సవంతో పాటు కృష్ణా పుష్కర మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఇరుగు-పొరుగుతో సుహృద్భావం..:

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిననాడే ఇరుగుపొరుగు రాష్ర్టాలతో స్వేహపూర్వక వైఖరిని అవలంబిస్తామని చెప్పినవిధంగానే నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో సయోధ్య సాధించాం. ఛత్తీస్‌గఢ్ నుంచి మరో 4నెలల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ రానుంది. గోదావరి ప్రాజెక్టులపై చొరవ తీసుకుని మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ నెల 22న చారిత్రాత్మక ఒప్పందం కుదురబోతున్నది. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునేందుకు ప్రభుత్వం వేసిన గొప్ప ముందడుగు. కర్ణాటకతో చర్చల ఫలితంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేయడానికి ఆ రాష్ట్రం ముందుకొచ్చింది. గత ఎండాకాలంలో మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటికోసం ఎన్నడూ లేని విధంగా ఒక టీఎంసీ నీటిని విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్ని రంగాలు పురోగమించాలి. ఇందుకు ఇరుగుపొరుగు రాష్ర్టాలతోపాటు కేంద్రంతోనూ సుహృద్భావంతో వ్యవహరిస్తాం. అదే సమయంలో రాజీలేని విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తాం.

సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో సంబంధాలు..:

కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తుంది. కేంద్రంతో సఖ్యంగా వ్యవహరిస్తుంది. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో పర్యటించారు. మిషన్ భగీరథ మొదటి దశను గజ్వేల్‌లో ప్రారంభించటంతోపాటు తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నిబద్ధతను ఆయన ప్రశంసించడం మనలో స్ఫూర్తిని నింపింది. 17ఏండ్ల క్రితం మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్‌ను తిరిగి తెరిపించాలని రాష్ట్రం చేసిన యత్నాలు ఫలించి ప్రధాని దానికి శంకుస్థాపన చేశారు. వాస్తవానికి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంటున్న దశలో మన ప్రయత్నం ఏటికి ఎదురీదడమే.

అయినా పట్టు విడవకుండా ప్రయత్నించి సాధించాం. ఇది ప్రభుత్వం సాధించిన విజయంగా నిండు హర్షంతో ప్రకటిస్తున్నాను. హైదరాబాద్-కరీంనగర్ మధ్య రైలు కావాలని నాలుగు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ప్రభుత్వ కృషి ఫలించి మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రామగుండంలో 4వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌లో మొ దటి దశ నిర్మాణ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. సింగరేణి నిర్మించిన 1200మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రధాని చేతులమీదుగా జాతికి అంకితం చేశాం. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2592 కి.మీ. జాతీయ రహదారి ఉండేది. కొత్తగా 1951కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేయించుకోగలిగాం. గతంలో తెలంగాణ జాతీయ రహదారుల సగటు 2.25% ఉంటే ఇప్పుడు 4%కి చేరుకొని జాతీయ సగటు 3శాతాన్ని అధిగమించాం.

రూ.30వేల కోట్ల సంక్షేమ పథకాలు: నిజమైన అభివద్ధి అంటే పేదలకు భరోసా, వారి బతుకులకు భద్రత ఇవ్వడం. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం 30వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35పథకాలు అమలుచేస్తూ సంక్షేమరంగంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. మరిన్ని కొత్త పథకాలను తీసుకువస్తున్నది. కల్యాణలక్ష్మిని ఈ ఆర్థిక సంవత్సరంనుంచి బీసీలు, ఈబీసీలకూ అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకోసం 250 గురుకుల విద్యాలయాలను మంజూరు చేశాం. ఇప్పటికే 230 ప్రారంభం కాగా, వారంలో మరో 20 గురుకులాలు ప్రారంభమవుతాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య సంకల్పానికి బలహీన వర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నాను.

త్వరలోనే ఎస్టీలు, మైనార్టీలకు జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక ఆర్థిక స్థోమత పెంచే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామనే శుభవార్తను మీతో పంచుకుంటున్నాను. చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇటీవలే నివేదికలిచ్చాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. పేద బ్రాహ్మణుల కోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల విగ్రహాన్ని సమున్నతంగా ప్రతిష్ఠించుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపేలా లుంబినీ పార్క్‌లో తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతున్నాం.

వడివడిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు: కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ర్టానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, శ్రీసీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం పూనుకొన్నది. నత్తనడక నడుస్తున్న పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులిచ్చి వెంటపడి మరీ పనులు చేయించాం. ప్రభుత్వ కృషివల్ల ఈ ఖరీఫ్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. వచ్చే ఖరీఫ్‌కి 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. అదిలాబాద్ జిల్లాలోని కొమురం భీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నిల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్‌నుంచి 50వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. వచ్చే ఏడాదికి జిల్లాలోని అన్ని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తై లక్ష ఎకరాలకు నీరందుతుంది. ఖమ్మం జిల్లా పాలేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్‌నుంచే నీరందుతున్నది. ఎస్‌ఆర్‌ఎస్పీకాలువలను 200కోట్లు వెచ్చించి బాగు చేయించాం. మిషన్ కాకతీయ మెదటి దశలో 8వేల చెరువులు బాగుపడ్డాయి. రెండోదశలో 9వేల చెరువుల పనులు చేపట్టాం. ఇటీవల కురిసిన వర్షాలతో 20వేల చెరువులు నిండడం శుభసూచకం.

రైతుకు భరోసా..: ఎరువులు, విత్తనాలకోసం రైతులు రోడ్డెక్కే దుస్థితి నివారించాం. మొట్టమొదటిసారి వేసవిలోనే విత్తనాలు గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు దొరకలేదని బాధపడే పరిస్థితి లేకుండా చేశాం. ఈసారి మంచి వర్షాలు కూడా కురువడం, రైతులు సరైన సమయానికి విత్తనాలు వేసుకోగలగడం సంతోషకరం. రైతులకు సహక రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1311మంది వ్యవసాయ విస్తరణాధికారులను, 120మంది వ్యవసాయాధికారులను, 75మంది హార్టికల్చర్ అధికారులను నియమిస్తున్నాం. తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించుకోగలిగాం. కోతల్లేని విద్యుత్ సరఫరా చేసుకోగలిగాం. 21లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాంలు నిర్మిస్తామని గత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించాను. ఆ మేరకు రెండేండ్లలో 17.07లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 330 గోదాంల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. వీటిలో 100 అందుబాటులోకొచ్చాయి. మిషన్ భగీరథ పైపుల ద్వారా ప్రతిఇంటికీ మంచినీళ్లతోపాటు, ఇంటర్నెట్ అందించబోతున్నాం.

ఆరోగ్య రక్షణకు భారీగా నిధులు: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వ దవాఖానల నిర్వహణలో సంస్కరణలు చేపట్టాం. హాస్పిటల్ బెడ్లపై రోజుకో రంగు బెడ్ షీట్లు వేయాలని నిర్ణయించాం. 42 ఏరియా హాస్పిటళ్లలో 30 దవాఖానల్లో కొత్తగా పరుపులు, బెడ్‌షీట్లు, స్లైన్ స్టాండ్లు ఏర్పాటు చేశాం. మిగతా 12 హాస్పిటల్స్‌కు 20 రోజుల్లో సామాగ్రి అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలిసిస్, 40 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మందుల కొనుగోలుతో పాటు దవాఖాన నిర్వహణ బాధ్యతను సూపరింటెండెంట్లకే అప్పగించాం. ప్రభుత్వ దవాఖానల్లో మరణించిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ఇంటికి పంపించాలనే నిర్ణయం జరిగింది.

టీఎస్‌ఐపాస్‌తో 1.75లక్షల మందికి ఉద్యోగాలు: టీఎస్‌ఐపాస్ సత్ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే 2303 పరిశ్రమలకు నిర్ణీత సమయంలో అనుమతులిచ్చాం. రాష్ర్టానికి 46వేల కోట్ల పెట్టుబడులు రావటంతో పాటు దాదాపు లక్షా 75వేల మందికి ఉద్యోగావకాశాలు లభించడం సంతోషకరం. ఐటీరంగంలో తెలంగాణ 13.26% వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం రూ.75వేల కోట్లకుపైగా సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేయగలిగాం. టీహబ్ ప్రపంచ ఐటీ దిగ్గజాల ప్రశంసలందుకున్నది. హైదరాబాద్‌ను ప్రముఖ ఐటీ కేంద్రంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. అందుకే 2018లో జరిగే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 37వేల నియామకాలు చేపట్టింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నడుస్తున్నది.

సతతం … హరితం: రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి రెండు మూడేండ్లకోసారి కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి నేటితరంతోపాటు భవిష్యత్తు తరాలను కూడా బయట పడేసేందుకు గ్రీన్‌కవర్‌ను పెంచేందుకు ప్రభుత్వం హరితహారంకార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఏడాది 46కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం జరిగింది. పచ్చదనం పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద మానవ ప్రయత్నాలు మూడు. మొదటిది ఆస్ట్రేలియాలో, రెండోది చైనాలోని గోబి ఎడారిలో జరిగింది. మూడోది తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. హరితహారాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినవారికి హరితమిత్ర పేరుతో ఈ స్వాతంత్య్ర దినోత్సవంనుంచే అవార్డులు ఇస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో లక్ష్యాన్నిమించి మొక్కలు నాటించిన కలెక్టర్ యోగితారాణాకు ఈ ఏడాది అవార్డు అందజేస్తున్నాం.

ఆరాచక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం దృఢచిత్తంతో ఉంది. ఆరాచక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితాలు కళ్లముందే ఉన్నాయి. నిన్న ప్రకటించిన జాతీయ పోలీస్ అవార్డుల్లో అత్యధికం మన తెలంగాణ పోలీసులకే వచ్చాయి. సమైక్య రాష్ట్ర చరిత్రలో ఎవరికీ రాని జాతీయ అత్యున్నత పోలీస్ పురస్కారమైన శౌర్యచక్ర అవార్డు మొట్టమొదటి సారిగా తెలంగాణ బిడ్డ, నల్లగొండ జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కుక్కుడపు శ్రీనివాసులుకు వచ్చింది. రెండు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులతో పాటు 38 జాతీయ పోలీస్ మెడల్స్ సాధించి దేశంలో తెలంగాణ పోలీసులు ఆగ్రస్థానంలో నిలిచారు. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టడానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న సాహసానికి, చొరవకు యావత్ జాతి గర్విస్తున్నదని ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలకు ప్రీతిపాత్రమైన దసరా పండుగ కానుకగా కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని సంతోషంగా ప్రకటిస్తున్నా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.