మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అబుదాబికి చెందిన లులు సంస్థ ఏడాదిలోనే సుమారు రూ.2500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. మధ్య ఆసియాలో అత్యధిక రిటైల్ సెంటర్లు కలిగిన లులు.. వందకుపైగా హైపర్‌మార్కెట్లతో ఏటా 500 కోట్ల డాలర్ల టర్నోవర్ కలిగి ఉన్నది. రాష్ట్ర పారిశ్రామిక విధానంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో అధికారుల బృందం చేపట్టిన దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం.. లులు సంస్థ చైర్మన్ యూసుఫ్‌అలీతో చర్చలు జరిపారు.

-ఏడాదిలో రాష్ర్టానికి తరలిరానున్న రూ.2500 కోట్లు -అంతర్జాతీయస్థాయి కంపెనీలు ఆసక్తి -పండ్లు, కూరగాయలు, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు -హైదరాబాద్‌లో ఆధునిక షాపింగ్‌మాల్ -దుబయోటెక్ కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్ బృందం ఈ సందర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్-ఐ పాస్ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్) విధానాన్ని సమగ్రంగా వివరించారు. ఈ నేపథ్యంలో లులు కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. రాష్ట్రంలో లులు సంస్థ మూడు ప్రాజెక్టులను చేపట్టనున్నది. అందులో భాగంగా ఏడాదిలోపే రూ.2500 కోట్లకుపైగా పెట్టుబడి పెడతామని ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్‌అలీ ప్రకటించారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్, హైదరాబాద్‌లో ఆధునిక షాపింగ్ మాల్‌ను ఏర్పాటుచేయనున్నారు.
ఈ మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. వచ్చేనెల 15లోపు లులు సంస్థ బృందం రాష్ర్టానికి రానున్నది. ఈ క్రమంలోనే వారు నెలకొల్పనున్న మూడు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.
ఫార్మా రంగంలోనూ పెట్టుబడులు దుబాయ్ పర్యటనలోభాగంగా సోమవారం దుబయోటెక్ కాంప్లెక్స్‌ను కూడా మంత్రి కేటీఆర్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్ సందర్శించారు. అక్కడ నెలకొల్పిన అనేక బయోటెక్నాలజీ లేబొరేటరీలను పరిశీలించారు. ఆ తర్వాత బయోటెక్ కాంప్లెక్స్ డైరెక్టర్ మర్వాన్ అబ్దుల్‌అజీజ్‌తో మాట్లాడారు. అక్కడి విధానాల గురించి తెలుసుకున్నారు.
ముచ్చెర్లలో నెలకొల్పేందుకు ప్రతిపాదించిన ఫార్మాసిటీని కూడా అదేస్థాయిలో నిర్మించే అంశాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో అబ్దుల్‌అజీజ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయోఏషియా సదస్సుకు హాజరవుతానని హామీఇచ్చారు. చర్చల్లో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టనున్న ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఐటీ కంపెనీల దగ్గరే నివాసాల కోసం స్మార్ట్‌సిటీలను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని సమగ్రంగా వివరించారు. చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ కొత్త పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.