-ఆ పార్టీ నాయకులకు కంటిపరీక్షలు చేయాలి -రైతుబంధుపై బీజేపీ నేతల సోయిలేని మాటలు -చెక్కుల పంపిణీతో ప్రతిపక్షాలకు దడ -హైదరాబాద్‌తోపాటు హన్మాజీపేటలో సినారె కళామందిరం -రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుబంధు సభలో మంత్రి శ్రీ కేటీఆర్

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కంటి పరీక్షలు నిర్వహించి, వారిని జనజీవన స్రవంతిలో కలుపుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని మంచి పనులుచేసినా.. పచ్చ కామెర్లవ్యాధి వచ్చిన వాళ్లకు అంతా పచ్చగా ఉన్నట్టు కాంగ్రెసోళ్ల తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసే కంటి వెలుగు కార్యక్రమంలో ముందుగా మీ ఊళ్లోని కాంగ్రెస్ నాయకులకు పరీక్షలు చేయించి, వారిని బాగుచేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 70 ఏండ్లుగా రైతుల బాధలు పట్టించుకోని వారంతా సంక్రాంతి గంగిరెద్దుల వేషం వేసి ఊళ్లో తిరుగుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నేతలను ఘాటుగా విమర్శించారు.
బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, వేములవాడ మండలం హన్మాజీపేట, ఎల్లారెడ్డిపేటల్లో నిర్వహించిన రైతుబంధు సభలకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పంటసాయం చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెపల్లెలో పండుగ వాతావరణంలో జరుగుతున్న రైతుబంధు కార్యక్రమం ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్నదని అన్నారు. అందుకే ప్రతిపక్ష నేతలు పసలేని ఆరోపణలు చేస్తూ దిగజారిపోతున్నారని విమర్శించారు. రైతుబంధుపై బీజేపీ నాయకులు సోయి లేకుండా, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరెన్ని పిచ్చి ప్రేలాపనలు చేసినా రైతులు సగర్వంగా తలెత్తుకునేలా చూస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎస్సారెస్పీ కాల్వ పనులు గత 50 ఏండ్లుగా సాగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగడం చూసి ప్రపంచమే అబ్బురపడుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
సాంస్కృతిక వైభవాలకు పెట్టింది పేరు.. సాంస్కృతిక కళావైభవాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా పెట్టింది పేరని, కళాకారులు మిద్దె రాములు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారారాయణరెడ్డి వంటివారు జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కేటీఆర్ కొనియాడారు. వీరిద్దరి జన్మస్థలమైన హన్మాజీపేట విశ్వఖ్యాతిని పొందిందన్నారు. సినారె స్వగ్రామంలో రూ.30 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సినారె ఎగ్జిబిషన్ భవనానికి మంత్రి భూమిపూజ చేశారు. హన్మాజీపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గ్రామంలో, హైదరాబాద్‌లో సినారె కళామందిరాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో రూ.20 కోట్లతో సిరిసిల్ల నూతన వ్యవసాయ మార్కెట్‌కు శంకుస్థాపనచేశారు. వచ్చే యాసంగికి జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టంచేశారు.
ఇల్లంతకుంట మండలంలో రూ.కోటితో సెంట్రల్ లైటింగ్, 30 పడకల దవాఖాన ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రూ.160 కోట్లతో జిల్లా కేంద్రంలో 300 పడకల దవాఖాన మంజూరుచేస్తున్నట్టు ప్రకటించారు. రూ.20 కోట్లతో చేపట్టిన అధునాతన వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత మంత్రి కేటీఆర్‌కు పలుప్రాంతాల్లో పెద్దఎత్తున బోనా లు, బతుకమ్మలు, బైక్‌ర్యాలీలతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.