పట్టుదలకు మరోపేరు కేసీఆర్.నిబద్ధతకు నిలువుటద్దం ఆయన. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల గుండెల్లో బంధువుగా ముద్రవేసుకొని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న నేత కేసీఆర్. ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందు తుందో నిదర్శనంగా ఉన్నది ఎనిమిదేండ్ల తెలంగాణ.
అభివృద్ధికి నడక నేర్పించడమే కాదు, అద్భుత పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కేసీఆర్. ఆయన ఏం చేసినా సాహసోపేతమే. కనీ వినీ ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారు, చేస్తున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాలకుడు కేసీఆర్.
స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసినా, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చినా, డబ్బుఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్యను తీర్చినా, పాలమూరు వలసలు వాపసయ్యేలా చేసినా.. అది కేసీఆర్ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ప్రభుత్వ అధినేతగా వర్తమాన కర్తవ్యాలను ఆదర్శవంతమైన రీతిలో కొనసాగిస్తున్నారు. సంక్షేమ శ్రేయోరాజ్య లక్ష్యాలను అనతి కాలంలోనే సాధించిన తీరుకు దేశమే నివ్వెరబోతున్నది.
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి మన కండ్లముందే కనిపిస్తున్నది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సీమాంధ్ర పరాయి పాలనలో అల్లకల్లోలంగా ఉన్న రాష్ర్టాన్ని ప్రగతి మోడల్‌గా తీర్చిదిద్దారు. ప్రపంచం అచ్చెరువొందే రీతిలో తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగింది. భారీ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువుల పునరుద్ధరణతో ఏడాది పొడుగునా నిండుకుండల్లా జల కళల కాంతులీనుతున్నాయి. వరుసగా కరువు వచ్చినా సాగు, తాగు నీటి సమస్య లేకుండా చేయడంతో పాటు, భూగర్భ జలాలు సైతం పెరిగేలా చేసిన అపర భగీరథుడు కేసీఆర్. ఈ భారీ ప్రాజెక్టులు, చెరువులు ఒక్క వ్యవసాయ రంగంలోనే కాదు, మత్స్య, మాంస ఉత్పత్తితో పాటు, రవాణా, పర్యాటకం వంటి అనేక రంగాల అభివృద్ధికి దారి తీసింది.
పుట్టినప్పటి నుంచి జీవితాంతం మనిషి అవసరాలకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఆ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజన జరగడంతో పాలన ప్రజల వద్దకు వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల వివాదాలు తగ్గిపోయి, భూములకు భద్రత లభిస్తున్నది. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
గత వర్తమానాలను బేరీజు వేస్తే తెలంగాణ సాధించిన ప్రగతి గతంతో పోల్చిన ప్పుడు ఎన్ని రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నదో గణాంకాలతో నిరూపించవచ్చు. రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ సామాజిక, ఆర్థిక స్థితిగతులను కేసీఆర్ మార్చి వేశారు. పచ్చని, ప్రశాంత తెలంగాణను సృష్టించారు. సంక్షే మ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలతో లక్షల కోట్ల రూపాయలు పల్లెల్లోకి ప్రవహింప చేశారు. అత్యుత్తమ వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ విధానాలతో తెలంగాణ దేశానికే తలమానికంగా మారింది.
సకలజనుల వికాసం, సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత సహజీవ న వాతావరణం, రాజకీయ సుస్థిరత, వేగవంతమైన అభివృద్ధి, వినూత్న ఆలోచనలు, శ్రమ ఫలితమే తెలంగాణ ఈ విజయాలు.
రాష్ర్టాన్ని పాలించే నేతగా, తెలంగాణ బతుకుచిత్రాన్ని అధ్యయనం చేసి, సంపూర్ణంగా అవగాహన చేసుకొని, ఒక్కో రంగానికి ఒక్కో పథకాన్ని అమలుచేస్తూ ఫలితాలను ఆవిష్కరిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలోని ఆయా వర్గాలకు అందని పథకం లేదు.
గత ప్రభుత్వాలు ఎన్నడూ కడుపు నిండా తిండి పెట్టలేదు, చేతి నిండా ఉపాధి కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రోజులు మారాయి. అప్పుడు కష్టపడిన వాళ్లు నేడు రెండుచేతులా సంపాదిస్తూ ఎవరిపై ఆధారపడకుండా బతుకుతున్నారు. శిథిలాల్లోంచి చిగురించిన చిరు మొలకలా ఆరంభమైన టీఆర్‌ఎస్ నేడు మహావృక్షమై తెలంగాణ అంతటా విస్తరించింది. దీన్ని వందేళ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.
భగీరథ తపస్సును తలపించే కార్యాన్ని తలపెట్టి బీడు వారిన నేలపై గోదారమ్మను తెలంగాణ అంతట పరవళ్లు తొక్కించిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారు. నాడు కడుపు చేత పట్టి వలస బాటపట్టిన రైతే రాజుగా మారి నేడు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ, బీద ప్రజల బాధలు తీరలేదు. వారి పరిస్థితులూ మారలేదు. తెలంగాణ ఏర్పడగానే పాలనాపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా తొలిరోజు నుంచే పేద ప్రజల సంక్షేమానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వ్యూహరచన చేశారు కేసీఆర్. ఇవాళ రాష్ట్రం అవతరించి ఎనిమిదేండ్లు అయిన సందర్భంగా ప్రజలందరూ తమ బతుకులు మార్చిన కేసీఆర్ జయహో అంటూ జేజేలు
పలుకుతున్నారు.
(వ్యాసకర్త: పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రి)