-వచ్చే బడ్జెట్‌లో రూ.40 వేల కోట్లు మిగులు -మంత్రినైనా సామాన్యుడిగానే ఉంటా -ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్

మన రాష్ట్రంలో ప్రజలు 75 శాతం పన్నులు చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 50 శాతం మాత్రమే పన్నులు కడుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని చూసుకుంటే వచ్చే బడ్జెట్‌లో దాదాపు రూ.40వేల కోట్ల మిగులు ఏర్పడుతుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కోసం మూడు నెలల్లో ప్రణాళికలు ఖరారు చేసి ప్రకటిస్తామని తెలిపారు. తాను గతంలో నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ కొందరు అసమర్థ అధికారులు, కాంట్రాక్టర్ల మూలంగా ప్రగతి ఫలాలు చూపించలేకపోయామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వల్ల తాను చేసిన ప్రగతి ప్రజలకు కనిపించలేదని, నేడు చేసే ప్రతి పని ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపించేలా ఉంటుందని వెల్లడించారు.
తనకు ఎలాంటి సోకులు లేవని, అభివృద్ధి సోకు ఒకటే ఉందని చమత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారులు అక్రమాలకు తావులేకుండా కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించి సీబీసీఐడీ తయారు చేసిన నివేదికలు తన వద్ద ఉన్నాయని, వాటిని సమయానుగుణంగా బయటపెడుతానని ప్రకటించారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న రోజుల్లో జిల్లాలో తాగునీటి ఎద్దడికి ప్రధానితో మాట్లాడి కేంద్రం నుంచి రూ.340 కోట్లు సాధిస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. దీంతో తాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయన్నారు. ఫ్లోరైడ్ రహిత మంచినీరు మానేరు జలాశయం నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్య శాఖలో నెలకొన్న అన్ని సమస్యలపై సబ్ కమిటీ వేసి చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో మాదిరిగా ఫార్మాసిటీని అప్పటి దివంగత సీఎం వైఎస్ కంటగింపుతో విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రయత్నించారని, అయితే అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక ఫార్మా పరికరాలు తుప్పు పట్టిపోవడంతోపాటు నాణ్యత లేక మందులను మార్కెటింగ్ చేయలేకపోయారని గుర్తుచేశారు. దీంతో ఆ పరిశ్రమల యజమానులంతా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కాక తప్పలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ దేశంలోనే వాతావరణం సమశీతోష్ణ స్థితిని కలిగి ఉంటుందని విశ్లేషించారు. దేశంలోనే అత్యధికంగా విత్తనాలను పండించేది ఒక తెలంగాణలోనేనని గుర్తు చేశారు.
కొత్తగా ఏర్పడిన రాష్ర్టాల్లో జార్ఖండ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యత లేక అభివృద్ధి లో కొంత వెనుకబడిందని, మనకు ఆ సమస్య లేకుండా 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సామన్య పౌరుడి స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగినా సాధారణ వ్యక్తిగానే జీవిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు మొలుగూరి సరోజన, మారపల్లి నవీన్, అరుకాల వీరేశలింగం, డీ ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.