-ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ: వినోద్ -ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తాం: ఈటెల
అభివృద్ధి అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబుకు చూపిస్తామని, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీతోపాటు స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ దేశంలోనే అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామన్నారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా హుజూరాబాద్‌ను తీర్చిదిద్దుతానని హామీఇచ్చారు. నిరుపేదల కోసం రూ.3లక్షలతో ఇల్లు నిర్మిస్తామని, రైతులకు రూ.లక్ష రుణమాఫీ అమలుచేసి తీరుతామన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పిన పెన్షన్ల పెంపు, రెండేళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరాను కచ్చితంగా అమల్లోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానని చెప్పారు. హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేసి తీరుతానని పునరుద్ఘాటించారు. తెలంగాణ వచ్చిందని సంబురపడకుండా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. 14 ఏళ్లు ఉద్యమాలు చేశామని, ప్రస్తుతం ఐదేళ్లలోనే గణనీయమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని చెప్పారు.