Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అభివృద్ధే మన కులం

-ఇక రాష్ట్రంలో మిషన్‌ విలేజ్‌
-ఊరికోసం ఊరంతా కలిసికట్టుగా పనిచేయాలి
-గ్రామసీమలన్నీ అభివృద్ధి చెందాలి
-స్వయం సమృద్ధిని సాధించాలి
-రామునిపట్ల, అంకాపూర్‌ ఆదర్శం
-ఏడాదిలో బంగారు వాసాలమర్రి
-గ్రామ అభివృద్ధికి ఐదు కమిటీలు
-వాసాలమర్రి గ్రామసభలో కేసీఆర్‌
-యాదాద్రి జిల్లాపై సీఎం వరాల జల్లు
-జిల్లాలోని 421 గ్రామాలకు 25 లక్షలు
-భువనగిరి మున్సిపాలిటీకి ఒక కోటి
-మిగిలిన ఐదింటికి 50 లక్షల చొప్పున

ప్రతి ఊర్లో అందరూ ఐక్యంగా ఉండాలని.. అభివృద్ధే మనందరి కులం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మిషన్‌ను ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో కులం, మతం, రాజకీయపార్టీలు.. ఏవీ ఉండవని స్పష్టంచేశారు. ఇకపై అందరిదీ ఒకే కులమని.. అదే అభివృద్ధి కులమని చెప్పారు. పాత పగలు, పంచాయితీ లు పక్కకు పెట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రేమభావంతో మెలగాలన్నారు. మంగళవారం యా దాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జరిగిన గ్రామసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అక్కడి గ్రామ ప్రజలనుద్దేశించి సీఎం చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

బంగారు వాసాలమర్రి కావాలె
తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి వాసాలమర్రి మీదికెల్లి మస్తుసార్ల పోయిన. వంకర టింకర రోడ్లు, గడ్డలు, గెర్రెలు గందరగోళంగా అనిపిచ్చింది. ఈ ఊరు జెర బాగుపడొచ్చు గదా? అని ఎన్నోసార్లు అనుకొన్న. వరంగల్‌ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించి వాపస్‌ పోతుంటే రాత్రి ఈ ఊరు స్కూల్‌ కాడ చౌరస్తాల ఆగి అక్కడున్న ఐదారుగురితో మాట్లాడిన. మీ ఊరును బాగుచేద్దాం, అందరూ సిద్ధంగా ఉంటరా? అని అడిగితే ఉంటమన్నరు. ఆ తర్వాత సర్పంచ్‌, గ్రామపెద్దలు 40 మంది నా పొలంకాడికి ఒచ్చిన్రు. వాసాలమర్రిని మంచిగ చేద్దామని చెప్పిన. అనుకోకుండా కరోనా సెకండ్‌వేవ్‌ రావడం, నాకు కరోనా రావడంతో కుదరలే. లాక్‌డౌన్‌ ఎత్తేసినంక వెంటనే మీ ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసిన. ఇప్పుడు ఇట్లా కలుసుకొన్నం. ఇద్దరు ఆడబిడ్డలు ఆకుల ఆగవ్వ, చిన్నూరి లక్ష్మిని నా పక్కకు కుసోవెట్టుకొని అన్నం తిన్నం. తిన్నంక ఆగమ్మకు రెండు అల్లనేరేడుపండ్లు ఇచ్చిన. ఊర్లె ఏడన్నా ఉన్నాయా? అంటే, లెవ్వు బిడ్డా అన్నది. అల్లనేరేడు చెట్టు లేకుంట ఊరుంటదా? మరి ఎందుకున్నది? అన్నీ మర్శిపోయినం మనం. అన్నీ మళ్లా రావాలె. సీఎం వస్తున్నడనంగనే ఏమేం ఇయ్యాల్నో రాసుకొచ్చిన్రు. మనిషికో బర్రె, ఇంటికో ట్రాక్టరు ఇచ్చేదైతే కలెక్టర్‌గారికి చెప్తే వస్తయి. దానికి కేసీఆర్‌, ఇంతమంది వచ్చుడెందుకు? ఇంతమంది వచ్చిన్రంటే ఒక ప్రత్యేకమైన పని జరుగాలె. అది ఒట్టిగ మాటతోని జరగది. ఇదొక మిషన్‌. అంద రం పట్టువడితే.. వాసాలమర్రి ఒక ఏడాది గడిశేనాటికి ‘బీ వాసాలమర్రి’ కావాలె. బీ అంటే బంగారు వాసాలమర్రి. అట్ల కావాల్నంటే అన్నింటికంటే ఎక్కువ అందరికీ ప్రేమ భావం ఉండాలె. ప్రతి ఇల్లు.. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలంటే మొట్టమొదట కావాల్సింది శాంతి. ఒకర్నిచూసి ఒకరు కోపానికి వచ్చే పరిస్థితి ఉండొద్దు. ఊర్లె పోలీస్‌ కేసులు ఉండొద్దు. ఒకర్ని చూసి ఒకరు చిరునవ్వు నవ్వాలె.. కష్టంసుఖం ఎవరికైనా ఒకటే అనే భావన మొదలైతే వంద కు వందశాతం ఇది బంగారు వాసాలమర్రి అయితది. ఊరుకు ఏమేం కావాల్నో నేనిస్తా. మా సీఎం గారు చెప్తే.. పట్టువట్టి అద్భుతం చేసిందన్న పేరు రావాలె. సుట్టుపక్క గ్రామాలన్నీ మిమ్ములను చూసి నేర్చుకోవాలె. అందుకోసమే మీ ఊరికి వచ్చిన. నేను కనీసం ఇంకో 20 మాట్లవస్తా. అప్పుడు ఓ చెట్టు కింద కూసొని మాట్లాడుకుందాం. గ్రామంలో మూడు దళితవాడలున్నాయి. ప్రతి వాడకు నేనే పోత. వాళ్లను కూసోవెట్టుకొని మంచిచెడ్డలు కనుక్కుంటా.

అంకాపూర్‌ ఆదర్శం కావాలె
నా సూచనతో వాసాలమర్రి నుంచి 270 మంది నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ను సూశి వచ్చిన్రు. అన్ని ఊర్లలెక్కనే అక్కడా భూమి ఉన్నది. వాళ్లు పండిచ్చేది బంగారం కాదు. మరి ఆ రైతులకు మంచి బంగ్లాలు ఎట్లున్నయి? ఆ ఊరిలో గ్రామాభివృద్ధి కమిటీ ఉంటది. అదే వాళ్లకు సుప్రీంకోర్టు. 2 సార్లు గ్రామ సర్పంచికే జరిమానా ఏశిర్రు. 45 ఏండ్లసంది ఆ ఊరికి పోలీస్‌ అవసరం పడలే. చిన్న సమస్య ఉన్నా.. అభివృద్ధి కమిటీలనే కూర్చొని పరిష్కారం చేసుకొంటరు. నేను 1987లో పోయిన. అప్పటికే ఆ ఊర్లో రెండు బ్యాంకులున్నయి. రైతుల డబ్బు ఒక బ్యాంకులో రూ.9 కోట్లు, ఇంకోదాంట్లో రూ.13 కోట్లు ఉన్నయి. అక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మొత్తం ఆడవాళ్లే చూస్తరు. పొదుపుచేస్తరు కాబట్టి గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఊరి డబ్బుతో స్కూల్‌, కమ్యూనిటీ హాల్‌ వంటివి కట్టుకొన్నరు. ఊ ర్లో మార్కెట్‌ కమిటీవాళ్లు దేశమంతట తిరుగుతరు. ఏ పంట ఎక్కడ అమ్ముడుపోతదో కనిపెడుతరు. ఆ పంటలే ఏస్తరు. పంట కోయంగనే పంపిస్తరు. పద్ధతి లో ముందుకుపోయిన్రు కాబట్టే అభివృద్ధి చెందిన్రు.

రామునిపట్ల లెక్క మారాలె
నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామునిపట్ల అనే ఊరిలో ఇట్లనే చేశినం. ఊరిలో ఎటుగాకుంట, ఏం పనిలేకుండా, ఏ ఆస్తిపాస్తి లేకుండా ఉన్న రో వాళ్లకు ఏం చేద్దమని ఆలోచించిన్రు. అట్లా ఎంతమంది ఉన్నరో లెక్కతీసిన్రు. దాంట్ల ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లకు హైదరాబాద్‌ల కుట్టుమిషిన్‌ పని నేర్పిచ్చిన్రు. తర్వాత ప్రతిజ్ఞ చేసి.. ఆ ఊరోళ్లంతా బట్టలు ఆ నలుగురి దగ్గర్నే కుట్టిస్తరు. ఇంకొకాయనకు ఎరువుల దుకాణం పెట్టిచ్చిన్రు. ఊరంతా అక్కడ్నే ఎరువులు కొంటరు. ఇంకొకాయనకు చెప్పుల దుకా ణం పెట్టిచ్చి.. అక్కడ్నే కొంటరు. 30-40 మంది పిల్లలకు ట్రాక్టర్లు ఇప్పిచ్చిన్రు. ఆ ఊరి పొలాలన్నీ ఆ ట్రాక్టర్లే దున్నుతయి. ఒకాయినెకు డీసీఎం కొనిచ్చి, ఊరోళ్లంతా గిరాకీ ఇస్తరు. ముగ్గురికి కూరగాయల దుకాణం పెట్టిచ్చిండ్రు. వీళ్లు ఊర్లె రైతుల దగ్గర్నుంచి కూరగాయలు తెచ్చి అమ్ముతరు. ఆ ఊర్లె ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఒక పని ఉంది. అక్కడ అద్భు తం జరుగుతున్నది. ఇదే పద్ధతిని వాసాలమర్రిలో చేద్దాం. ఎర్రవెల్లిల గూడ మంచిగ చేశినం. ఆ ఊర్లో 24 గంటలు నల్లాల్లో మంచినీళ్లు వస్తయి.

ఒక మిషన్‌గా పనిచేయాలె
ఇదొక మిషన్‌. ఇందులో కులం, మతం, ఆడా, మగా అనే తేడాలుండయి. ఊరంతా ఊరికోసం పనిచేయాలె. మహిళల్లో చదువుకున్నవాళ్లు ఇతరులను సంజాయించాలె. ఇల్లు, పిల్లల గురించి మొగోళ్ల కంటే ఎక్కువ ఆడవాళ్లే ఆలోచిస్తరు. మనఊరు బాగుచేసుకోవాలని ఆడవాళ్లు పట్టువట్టాలె. ఎవరైనా ఎటమటం చేస్తే తప్పుబిడ్దా అని చెప్పాలె. వేలితో కొడుతే దెబ్బతాకది.. అదే పిడికిలి బిగించి కొడితే బ్రహ్మాండంగా తాకుతది. వాసాలమర్రికూడా పిడికిలి లెక్క తయారుకావాలె. ఎలక్షన్లు ఒచ్చినప్పుడు ఇష్టమున్న వాళ్లకు ఓటేసుకోవచ్చు. మిషన్‌లో ఉన్నప్పుడు ఒక్కటిగా ఉండాలె. ఇట్లా మీరు మొదలువెడితే ప్రతి కుటుంబానికి లాభం కల్పించే బాధ్యత నాది. ఇయ్యాల్టి నుంచి వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే.

యాదాద్రి జిల్లాలో పల్లెకో పాతిక లక్షలు
యాదాద్రి భునగిరి జిల్లాలోని 421 పంచాయతీలకు సీఎం సహాయనిధినుంచి రూ.25 లక్షలు మంజూరుచేస్తున్న. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో భువనగిరికి రూ.కోటి, ఆలేరు, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూరు, యాదగిరిగుట్టకు రూ.50 లక్షలు చొప్పున ప్రత్యేక నిధులు మంజూరుచేస్తున్నా. వాసాలమర్రిలో రాబోయేరోజుల్లో గ్రామనిధి ఏర్పా టు చేసుకుంటం. గ్రామంలో ఎవరికి అక్కరపడ్డా ఉపయోగపడేటట్టు ప్రభుత్వం కొంత డబ్బు, తలాకొంత డబ్బు వేసుకొని నిధిని తయారుచేసుకుంటం. తద్వా రా వ్యవసాయం, వృత్తులు బాగుపడుతయి. అందరికీ పని దొరుకుతది. ఈ మిషన్‌ ముందుకు పోవాలంటే గ్రామ అభివృద్ధి కమిటీ, శ్రమదాన కమిటీ, పరిశుభ్రత, తాగునీటి కమిటీ, హరితహారం కమిటీ, రైతుల కమిటీలను ఏర్పాటుచేసుకోవాలె. చదువు వచ్చినవారు రానివారికి వివరించాలి. చదువుకోవడానికి, పెండ్లికి ప్రభుత్వంలో అనేక స్కీములున్నయి. అవసరమైనవాళ్లకు వాటిని అందియ్యాలె.

తిట్టుడు బంద్‌చేయాలె
అన్నింటికంటే ముందు తిట్టుడు బంద్‌ జేయాలె. ఊరందరం కలిసి ప్రేమగా మాట్లాడుకోవాలె. పాత పగలు, పంచాయతీలు పరిష్కరించుకోవాలె. కష్టమొస్తే నేనున్నా అని ధైర్యం చెప్పాలె. ఇట్లా అందరం పట్టువట్టి, కలిసికట్టుగా ముందుకుపోతే వందకు వందశాతం ఈ ఊరు బంగారు వాసాలమర్రి అయితది. ఈ ఊరు బాగుపడితే సుట్టుపక్కల నాలుగైదు ఊర్లు నేర్చుకొని బాగుపడుతయి. అంకాపూర్‌ వల్ల ఆర్మూర్‌, బాల్కొండ, మెట్‌పల్లి తాలూకాల్లో దాదాపు 300 గ్రామాల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకున్నరు. అవన్నీ అంకాపూర్‌లా అభివృద్ధి చెందినయి. ఒక గ్రామం నుంచి ప్రసరించే అభివృద్ధి వెలుగు చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతది. సమాజానికి లాభం కలుగుతది.

బంగ్లాదేశ్‌ హశ్మీ దారి.. పేదోడి రహదారి
ప్రొఫెసర్‌ హష్మీ అనేటాయిన బంగ్లాదేశ్‌లో ఉంటడు. ఒకరోజు ఢాకా నగరంలో ఫుట్‌పాత్‌ మీద నిల్చొని ఉంటడు. ఐదారుగురు పేద ఆడబిడ్డలు ముంగటికెళ్లిపోతరు. తెల్లారి కూడా మళ్లా పోతరు. వాళ్లు ఎక్కడికి పోతున్నరని ఆసక్తి కలిగి వాళ్ల ఎనుకపోతడు. వాళ్లు రోజువారీ మిత్తికి డబ్బు ఇచ్చే సేటు దగ్గరికిపోతరు. ఆ డబ్బుతో హోల్‌సేల్‌ మార్కెట్‌కు పోయి కూరగాయలు కొనుక్కొని, ఊరంతా తిరిగి అమ్ముతరు. సాయంత్రం ఆ సేటు దగ్గరికిపోయి డబ్బు కట్టి, మిగిలిన దాంతో ఇంట్లకు కావాల్సినయి కొనుక్కుంటరు. వంటచేసుకొని పిల్లలకు పెట్టి, వాళ్లు తిని పండుకుంటరు. వాళ్లను ఎట్లనన్నా బాగుచేయాల్నని ప్రొఫెసర్‌ హష్మీ అనుకుంటడు. తెల్లారి అదే రోడ్‌కాడికి పోతడు. వాళ్లను పిలిశి తక్కువ వడ్డీకి డబ్బు ఇస్తా అని చెప్పి ఇస్తడు. కొన్ని రోజుల తర్వాత ‘అమ్మా మీ వల్ల నేను మంచి వ్యాపారం చేశిన. మీరు మా ఇంటికి భోజనానికి రావాలె’ అని పిలుస్తడు. వాళ్లు పోయినంక తినవెట్టి హాల్‌లో కూసోవెడుతడు. అల్మారాలకెల్ల్లి ఒక సంచి తీసుకొచ్చి అక్కడ పెడుతడు. నేను వ్యాపారిని కాదు. పేదోళ్లు కొంత దాచిపెట్టుకుంటే ఎట్లా బాగుపడుతరో సూపెడుదామని ఇట్ల చేశిన. ఈ రూ.35 వేలు మీవే.. మనిషికి ఆరువేలు వస్తయి. వాటితో కూరగాయల బండిపెట్టుకోండి అని చెప్తడు. మీ లెక్కనే ఇంకో గ్రూప్‌ తయారు చేయాల్నని మాట తీసుకుంటడు. ఎంత పేదోడయినా తన కష్టంల కెల్ల్లి కొంత దాశి పెట్టుకుంటే దరిద్రంల కెల్ల్లి బయటపడుతరని నిరూపించిండు. ఇట్లా అనేక ఉపాయాలు ఉంటాయి. కానీ మనకు చెప్పేవాళ్లు లేక ఆగమాగం ఉరుకుతున్నం. నేల విడిచి సాముచేస్తున్నం.

ఆగవ్వ నా దోస్తువట్టొద్దా?
పంచులు, ప్రాసలు, చమక్కులు, సామెతలు, పిట్టకథలు.. ఇలా అన్ని రకాల హంగులతో సాగే సీఎం కేసీఆర్‌ ఉపన్యాసం వింటేనే పెండ్లి భోజనం తిన్నట్టుంటుంది. వాసాలమర్రి సభలోనూ ఆద్యంతం కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలోనే ప్రజలు చప్పట్లు కొట్టగా ‘సప్పట్లు కొట్టుడు గాదు.. పనిజెయ్యాలె’ అని హితబోధ చేశారు. ఊరిని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పగానే కొందరు విజిల్‌ వేశారు. ‘ఇంతకుముందు ఒకాయిన సీటీ కొట్టిండు.. సీటీ కొట్టడానికి నేనేమన్నా సినిమా యాక్టర్‌నా? సీటీలు కొట్టుడు.. సప్పట్లు కొట్టుడు బంద్‌ జెయ్యాలె’ అని తనదైన శైలిలో చెప్పారు. ‘నాకు ఇక్కడ ముగ్గురు నలుగురే తెలుసు. ఇప్పుడు నాకు ఆకుల ఆగవ్వ బాగ దోస్తయింది. లక్ష్మి గూడ నా దోస్తే’ అని అనగానే గ్రామస్థులు ఒక్కసారిగా నవ్వారు. దీంతో ‘ఎందుకట్ల నవ్వుతరు.. ఆగవ్వ నా దోస్తు వట్టొద్దా?’ అని ప్రశ్నించడంతో సభా ప్రాంగణమంతా నవ్వులు పూశాయి.

అందరినీ మంచిగ చూసుకోండి
-ఆప్యాయ పలకరింపు.. అందరికీ
-వడ్డించిన తర్వాతనే తన భోజనం
‘ఎవరయ్యా బాబూ అక్కడ.. ఫస్ట్‌ మహిళలందరినీ ఇటువైపు వచ్చి భోజనానికి కూర్చోమనండి. అమ్మా.. మీరు ఇటు రండి. ఇక్కడ కూర్చోండి. మీరు ఇటు వెళ్లి కూర్చొండి. పెద్దమనిషి ఇక్కడ ఒక సీటు ఖాళీ ఉన్నది కూర్చోండి. వడ్డించేవాళ్లు ఇటు వైపు రండి. వెజిటేరియన్‌ సెక్షన్‌లో ఇంకా భోజనాలు మొదలుకాలేదు.. వాళ్లను కూడా మంచిగ చూసుకోండి..’ ఇగో ఇట్ల అన్నది ఎవ్వరో కాదు.. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. మన ఇంటిపెద్ద లెక్క భోజనశాలలో దాదాపు ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అందరికీ సరిగ్గా వడ్డిస్తున్నారో లేదో పరిశీలించారు. సభావేదిక వద్ద నుంచి భోజనశాలకు నడుచుకుంటూ వచ్చిన సీఎం కేసీఆర్‌.. భోజనశాల ప్రధానద్వారం వద్ద నిలబడి ఎవరెవరు ఎక్క డ కూర్చోవాలో చూపించారు. తమ వద్ద నిలబడి భోజనం పెట్టించడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. డైనింగ్‌ హాలు లో కూర్చున్నవారందరి విస్తర్లలో భోజనాలు వడ్డించిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ భోజనం చేయడానికి కూర్చున్నారు. గ్రామస్థులతో కలిసే భోజనంచేశారు. అందరూ భోజనం చేసి చేతులు కడుక్కున్న తర్వాతనే సీఎం తన భోజనాన్ని ముగించారు.

వాసాలమర్రికి స్పెషల్‌ ఆఫీసర్‌
మీ జిల్లాకు జగదీశ్‌రెడ్డి రూపంలో మంచి మనిషి ఉన్నరు. ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ప్రజలు బాగుపడటం ఇష్టమున్న వ్యక్తి. ఆయన కూడా వస్తరు. మంత్రి దయాకర్‌రావు హైదరాబాద్‌ పోతూపోతూ.. వాసాలమర్రి నా శాఖలోకే వస్తదని చెప్పి షెడ్యూల్‌ లేకపోయినా వచ్చిన్రు. గ్రామం అభివృద్ధిలో పాలు పంచుకుంటమని చెప్పిన్రు. ఎమ్మెల్యే సునీత మీ ఎంబడి ఉంటరు. కలెక్టర్‌ పమేలా గతంలో వరంగల్‌ మున్సిపాలిటీలో బాగా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్నరు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక అధికారిగా ఆమెను నియమిస్తున్నం. తక్కువకు నేను ఉంట. ప్రభుత్వం తరఫున డబ్బు ఇప్పించే బాధ్యత నాది. ఒక్క రూపాయి ఇస్తే మీ శ్రమతోని పది రూపాయల పని కావాలె.

మర్రిచెట్టు పేరుమీదుగా వాసాలమర్రి
వాసాలమర్రిలో ఒకప్పుడు భారీ మర్రిచెట్టు ఉండేదట. పెద్ద పెద్ద ఊడలతో ఒకటి, రెండు ఎకరాల్లో విస్తరించి ఉండేదట. దానిని వాసాలమర్రి అని పిలిచేవారు. ఆ తర్వాత కాలక్రమంలో అదే ఊరు పేరుగా మారింది. ‘పిల్లలమర్రి ఎట్లనో మా వాసాలమర్రి అట్ల. మా తాతముత్తాతల కాలంల పెద్ద మర్రిచెట్టు ఉండెనట. దానికి వాసాల లెక్క ఊడలు ఉంటుండెనట. అందుకనే ఊరికి ఆ పేరు వచ్చిందని చెప్తరు’ అని స్థానికుడు మల్లయ్య తెలిపారు. ఒకప్పుడు గ్రామం ఇప్పుడున్న చోట కాకుండా దాదాపు అర కిలోమీటర్‌ దూరంలో గడ్డమీద ఉండేదట. ఎత్తుమీద ఉండటంతో నీటి కొరత తీవ్రంగా ఉండి, పంటలు పండకపోయేవి. దీనికితోడు రజాకార్లు, దోపిడీ దొంగల అఘాయిత్యాలు పెరిగిపోవటంతో ఒక్కో కుటుంబం ఖాళీ చేసి దిగువన ఇండ్లు నిర్మించుకోవటం మొదలైంది. క్రమంగా ఊరు మొత్తం దిగువకు వచ్చేసింది. ఇప్పటికీ పాత గ్రామానికి చెందిన ఆంజనేయస్వామి ఆలయం, గ్రామదేవతల ఆలయాలు అక్కడే ఉన్నాయి. ప్రధాన పండుగల సమయంలో అక్కడికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. ఇదంతా 150 ఏండ్ల కిందటే జరిగినట్టు తెలుస్తున్నది.

తలా ఓ చెయ్యివేస్తే..
ఊర్లో ఒక ఆడబిడ్డ పెండ్లయితే కులం లేదు, మతం లేదు.. ఊరందరం భుజం ఆనాలె. కానీ మనం అట్ల చేస్తలేం. పెండ్లికి పోయి ఏమేం పెట్టిండో సూద్దాం, వాని ఇజ్జత్‌ పోవాలె అని సూస్తున్నం. కానీ.. మనోడు గదా, గరీబోడు గదా అనుకుంటే పైసా కర్సు లేకుండా పెండ్లయితది. మనం ఇంటికో పొయ్యిల కట్టె ఇస్తే ఆ కర్సు తప్పుతది కదా. గ్రామంలో చిన్నవాళ్లు, పెద్దవాళ్లు ఉండరు. నాయీబ్రాహ్మణులు, రజకులు ఉంటరు. వాళ్లు ఊరికి సేవచేస్తున్నరు. అట్లే ప్రతి ఒక్కరూ పరోక్షంగా సమాజానికి, ప్రజలకు సేవచేస్తున్నరు.

ఊరు మురిసింది
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం వాసాలమర్రి గ్రామ ప్రజల్లో భరోసా నింపింది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసిన వాసాలమర్రివాసులు స్వయంగా సీఎం కేసీఆర్‌ తమ గ్రామానికి రావడమే కాకుండా గ్రామాన్ని దత్తత తీసుకోవడం, సహపంక్తి భోజనం చేయడంతో మురిసిపోతున్నారు. సీఎం ప్రసంగిస్తున్నంతసేపు గ్రామస్థులు చప్పట్లతో హర్షద్వానాలు తెలిపారు. సీఎం సభకు హాజరయ్యేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆడబిడ్డలు శుభకార్యానికి హాజరవుతున్నట్టుగా అలంకరించుకొన్నారు. సభ ముగిశాక సీఎం కేసీఆర్‌ తిరుగు పయనమయ్యే సమయంలో గ్రామస్థులంతా రోడ్డుకిరువైపులా నిల్చుని వీడ్కోలు పలికారు.

రైతుబంధు వచ్చింది రంది పోయింది
మాకు ఎకరం పొలం ఉన్నది. సారు రైతుబంధు మొదలువెట్టినప్పటి సంది టైముకు పైసలు పడుతున్నయ్‌. ఇత్తనాలు, మందులు కొనుడుకు, దున్నుకం కర్సు ఎల్తున్నది. ఈ తాప మొన్ననే 5 వేలు పడ్డయి. ఇంకా బ్యాంకులకెల్లి తీయలే. ఒకటిరెండు వానలు పడంగనే ఎవుసం పనులు మొదలుపెడుతం. మా నాయినకు రూ.2వేల పింఛన్‌ వస్తున్నది. మాకు రేషన్‌బియ్యం వస్తున్నది.
– చెన్నరాజు నర్సింలు, రైతు

బాయికాడ ఎప్పుడూ కరెంటు ఉంటది
నాకు ఐదెకరాల పొలం ఉన్నది. ఒకప్పుడు బాయికాడ కరంటు సక్కగ ఉండేది కాదు. నడిరాత్రి పోయి కరంటు పెట్టేది. కేసీఆర్‌ సారు 24 గంటల కరంటు మొదలైనంక కష్టం మొత్తం పోయింది. బాయికాడికి ఎప్పుడు పోయినా కరంటు ఉంటది అనే ధీమా వచ్చింది. ఒకప్పుడు ఇంట్ల తింటుండంగ కరంటు వస్తే పల్లెం పక్కకువెట్టి బాయికాడికి ఉరికేది. ఇప్పుడు నిమ్మలంగా తిని పోతున్నం.
– కొండా నర్సింలు, రైతు

తిండివెడుతున్న ఉపాధి పని
ఇప్పుడు ఉపాధిహామీ పని రోజూ దొరుకుతున్నది. బాయికాడ పనులు లేనప్పుడు ఉపాధి పని ఆదుకుంటున్నది. లాక్‌డౌన్‌ టైమ్‌ల బయట పనులు దొరుకలే. అసోంటప్పుడు ఈ ఉపాధి పనులే ఆదుకున్నయి. రోజుకు రూ.200 దాకా పడుతున్నది. ఇల్లు గడుస్తున్నది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కూలి పెరిగింది.
– బుర్రకాయల వెంకటమ్మ

ముసలోళ్లను పింఛిన్లు బతికిస్తున్నయి
తెలంగాణ వచ్చినంక ఊరు మస్తు మారింది. జనాల శేతులల్ల పైసలు జెర ఎక్కువ ఆడుతున్నయి. మా పంతులు (ఆంజనేయులు) 65 ఏండ్లు ఈ ఊర్లె కారోబార్‌గా పనిచేశిండు. ఆయన ఉన్నప్పుడు పింఛన్‌ వస్తుండే. ఇప్పుడు నా పేరు మీదికి మారుస్తరట. మా అసోంటి ముసలోల్లను ఈ పింఛిన్లు బతికిస్తున్నయి. మా భూమికి పంట పెట్టువడి కూడా వస్తున్నదట. రైతులు జెర నిమ్మలంగ ఉంటున్నరు.
– తిరుక్కొవళ్లూరు భారతమ్మ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.