
-సభ్యులందరి సహకారం ముఖ్యం -ఏకగీవ్ర ఎన్నికకు ధన్యవాదాలు.. -సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు -రాష్ట్ర అసెంబ్లీ రెండో స్పీకర్ పోచారం -పోచారం హయాంలోనే రైతుబంధు, రైతుబీమా -వ్యవసాయశాఖను ఆయన నిర్వహించిన కాలం ఉజ్వల ఘట్టం -అందుకే ఆయనను లక్ష్మీపుత్రుడని పిలుచుకుంటా: సీఎం కేసీఆర్ -నేడు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం -పోచారం ఏకగీవ్ర ఎన్నికను ప్రకటించిన ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ -స్వయంగా తోడ్కొని వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పీసీసీ నేత ఉత్తమ్, ఎమ్మెల్యేలు ఈటల, బలాల
తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం అని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్లు తీసుకున్నామని, అన్ని పార్టీల సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రతిపాదించారని తెలిపారు.
సీఎం కేసీఆర్, సభ్యులు అజ్మీరా రేఖానాయక్, మల్లు భట్టివిక్రమార్క, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అహ్మద్ బిన్‌అబ్దుల్లా బలాల.. స్పీకర్‌గా పోచారం పేరును ప్రతిపాదించారని చెప్పారు. మరో పోటీదారు లేకపోవడంతో పోచారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ సహా సభ్యులంతా హర్షాధ్వానాలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (టీఆర్‌ఎస్), అహ్మద్ బలాల (ఎంఐఎం) తదితరులు పోచారంను తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ప్రొటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో సభ్యులంతా మర్యాదపూర్వకంగా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. సభాపతి బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్, బలాల తదితరులు శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా పలువురు సభ్యులు పోచారం ఎన్నికపై సంతోషం వ్యక్తంచేశారు. తమకు పోచారంతో ఉన్న అనుబంధాన్ని సభలో పంచుకున్నారు. మంత్రిగా, నాయకుడిగా రాణించిన పోచారం.. స్పీకర్‌గా కూడా సమర్థంగా పనిచేస్తారన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.

వ్యవసాయ శాఖ నిర్వహణ ఉజ్వల ఘట్టం:సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన కాలం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. ఆయన హయాంలో చేపట్టిన రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలు అమలుచేస్తున్నాయని, అనేక రాష్ర్టాలు పరిశీలిస్తున్నాయని గుర్తుచేశారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితిసైతం ప్రశంసించిందన్న కేసీఆర్..అదంతా ఆయన కాలుమోపిన వేళా విశేషమన్నారు. అందుకే ఆయనను లక్ష్మీపుత్రుడిగా పిలుచుకుంటానని పేర్కొన్నారు. స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అభినందిస్తూ మాట్లాడిన కేసీఆర్..స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక మెట్లు అధిగమిస్తూ.. ఆరుసార్లు శాసనసభకు పోచారం ఎన్నికయ్యారని, పలుశాఖల మంత్రి పదవులు చేపట్టారని గుర్తుచేశారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నకాలంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందన్నా రు. శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ జీవితంలో వ్యవసాయశాఖ నిర్వహించడం ఉజ్వలమైన ఘట్టంగా పేర్కొన్నారు. క్యాబినెట్‌లో ఆయన లేకపోవడం ఒకవిధంగా తనకు లోటేనన్న కేసీఆర్.. పోచారం స్థానంలో మరొక సమర్థుడికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలోనూ పోచారం పోరాడారని సీఎం గుర్తుచేశారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుందన్నారు. భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యం,ఆయుష్షును ఆయనకు ఇవ్వాలని ఆకాంక్షించారు. వాస్తవానికి పరిగె ఆయన ఇంటిపేరైనా.. ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకునేంతగా పోచారం గ్రామస్థుల తో శ్రీనివాస్‌రెడ్డి మమేకమయ్యారని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి, 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారని, 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. అప్పట్లో తాను సర్పంచ్‌గా కావాలని ప్రయత్నించినా, వీలుకాకపోవడంతో తానుకూడా పీఏసీఎస్‌గా చైర్మన్‌గానే రాజకీయజీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. పో చారం 1987లో నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారని కేసీఆర్ చెప్పారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య ఉంటూ తెలంగాణ సాధనకు కృషిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో గృహనిర్మాణం, 1999లో భూగర్భగనులు, 2000లో పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసి రాణించారని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశంలోనే తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తారన్న అభిలాషను వ్యక్తంచేశారు.
న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తా: పోచారం విధి నిర్వహణలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తానని స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తనను శాసనసభకు స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవానికి కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కసభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆరుసార్లు గెలిపించి, ఈ పదవికి ఎంపికయ్యేలా బాటలు వేసిన బాన్సువాడ ప్రజలకు కృతజ్ఞతలు. పార్లమెంటరీ వ్యవస్థలో శాసనసభాపతి పదవి అత్యంత కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషిచేస్తా. సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు సాగుదాం అని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం నాకు ఎప్పుడూ దక్కలేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకు మేలుచేసే ఎన్నో పథకాల రూపకల్పనకు సహకరించడం, దేశంలో ఏ వ్యవసాయమంత్రికి లేనివిధంగా లక్ష్మీపుత్రుడనే పేరును నాకు ఖరారు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదిఅని తెలిపారు.
నేడు 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం రాష్ట్ర రెండో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రసంగిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.