-ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతాం -త్వరలో కొలువుల జాతర: మంత్రి కేటీఆర్

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తేలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాటల్లో నిలకడలేదని, ఆయన రోజుకోతీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమాలపై స్పష్టమైన ఆధారాలుంటే బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. టీడీపీలో రేవంత్‌రెడ్డి ఒక విదూషకుడిలాంటివాడని ఎద్దేవా చేశారు.
ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ చేరుకున్న ఆయన రాష్ర్టాల జౌళిశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నలుగురు కేంద్ర మంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఎలాంటి చర్చా జరపలేదన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టుపై కేంద్రం జారీ చేసిన గెజిట్ గురించి మాట్లాడుతూ ఏ ప్రాజెక్టు విషయంలోనైనా ఇలాంటి గెజిట్‌లు రావడం సహజమేనన్నారు.
గెజిట్ వల్ల మెట్రో ప్రాజెక్టు పురోగతికి వచ్చిన ఇబ్బందేమీలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇస్తామని చెప్పారు. 2040వ సంవత్సరానికల్లా మెట్రో ప్రాజెక్టును 250 కిలోమీటర్లు విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే భారీస్థాయిలో ఉద్యోగాల నియామకాలు చేపడుతామని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ యువతకు భయాలు అవసరంలేదన్నారు. గ్రామీణ తాగునీటి అభివృద్ధి విభాగంలో సుమారు వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఐటీఐఆర్‌కు నిధులివ్వండి.. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఐఆర్ (ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్స్), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఐటీ అనుంబంధ రంగాల అభివృద్ధికి అధిక నిధులివ్వాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ఐటీ-కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరారు. బుధవారం కేంద్రమంత్రిని కలిసిన ఆయన కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, దీనికి కేంద్రం ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నదని, రెండు దశల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 2040 నాటికి ప్రత్యక్షంగా 15లక్షల మందికి పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు. 49,913 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ఐటీశాఖ చర్యలు చేపట్టిందని, తొలి దశ 2019 నాటికి పూర్తవుతుందని చెప్పారు. దీనికి కేంద్రం రూ.942 కోట్లు కేటాయించనున్నట్లు గతంలో హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు రూ.165 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండో దశలో రూ.3921 కోట్లకుగాను కేంద్రం రూ.3110 కోట్ల మాత్రమే మంజూరు చేసిందని, మిగిలిన మొత్తం వెంటనే ఆమోదించాలని కోరారు. హైకోర్టు విభజనపై కూడా కేంద్రమంత్రితో కేటీఆర్ చర్చించారు. హైకోర్టు ప్రాంగణంలో కూడా రెండు రాష్ర్టాలకూ వేర్వేరు హైకోర్టులు పనిచేసే వాతవరణం ఉన్నదని, అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు విడివిడి హైకోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.