Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆరు నుంచి గ్రామబాట

-30 రోజుల ప్రణాళిక అమలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం -విస్తృత ప్రజాభాగస్వామ్యంతో నిర్వహించాలి -మార్గదర్శనం కోసం 3న విస్తృతస్థాయి భేటీ -అమలు పర్యవేక్షణకు గ్రామానికి ఒక ఇంచార్జి -పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలి -ప్రత్యేక కార్యాచరణ నిరంతరం కొనసాగించాలి -పంచాయతీలకు నెలకు రూ.339 కోట్ల చొప్పున నిధులు -ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -సఫాయీ కర్మచారులకు శుభవార్త -వేతనం రూ.8500కు పెంపు -36 వేలమంది కార్మికులకు లబ్ధి

CM KCR unveils action plan for transforming villages

గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సెప్టెంబర్ 3న విస్తృతస్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. గ్రామాల్లో అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్న సఫాయీ కర్మచారులకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. వారి వేతనాలను రూ.8,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. పంచాయతీరాజ్‌శాఖలో అన్ని ఖాళీలను భర్తీచేయడంతోపాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదలచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అమలుచేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో ఏడుగంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్తులను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికాపద్ధతిలో గ్రామాల అభివృద్ధి, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరుగాలని, మొత్తంగా విస్తృత ప్రజాభాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడికి 30 రోజుల కార్యాచరణ నాంది పలుకాలని ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని భావించినప్పటికీ.. అధికారుల సూచనమేరకు మొదటిదశలో 30 రోజులపాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు.

మన ఊరిని మనమే బాగుచేసుకోవాలి మంత్రులు, అధికారులతో విస్తృతంగా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను సీఎం కేసీఆర్ ఖరారుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు గడిచినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉన్నది. మన ఊరును మనమే బాగుచేసుకోవాలనే స్పృహరావాలి. చేయగలిగి కూడా చేయకుంటే నేరం అవుతుంది. ఏ ఊరు ప్రజలు ఆ ఊరుకు కథానాయకులు కావాలి. ఊరి పరిస్థితిని మార్చుకోవాలి. పనిచేసే గ్రామ పంచాయతీ వ్యవస్థను తయారుచేయడం కోసమే కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామకార్యదర్శి నుంచి జిల్లాపరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీచేస్తున్నాం. కావాల్సినన్ని నిధులు విడుదలచేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను చట్టం స్పష్టంగా పేర్కొన్నది. విధులపట్ల నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకునే అధికారంకూడా చట్టం కల్పించింది. చాలా ముఖ్యమైన పనులను ప్రభుత్వమే తన యంత్రాంగం ద్వారా నేరుగా చేస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, పన్నులు వసూలుచేయడంలాంటి బాధ్యతలు గ్రామపంచాయతీలు నెరవేర్చాల్సి ఉన్నది. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం కూడా కావాలి. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కలిసిపనిచేసి గ్రామాలను మార్చుకునే సంస్కృతి అలవాటుకావాలి అని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పంచాయతీరాజ్ కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పీసీసీఎఫ్ శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, జెడ్పీ సీఈవో గోపాల్‌రావు, డీపీవో సురేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ కరుణాకర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, డీఎఫ్‌వో రామలింగం, జెడ్పీ సీఈవో ప్రసూనారాణి, డీపీవో మహమూద్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ రాజేంద్ర చౌహాన్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డీఎఫ్‌వో వసంత, జెడ్పీ సీఈవో కాంతమ్మ, డీపీవో నరేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శేషారావు, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్ ఆశ, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్లు రామారావు, సుధాకర్‌రావు, ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.

3న విస్తృతస్థాయి సమావేశం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు మార్గదర్శనం చేసేందుకు సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్లతోపాటు డీఎఫ్‌వోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తర్వాత రెండుగంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుచేసే అధికారులతో సమావేశమై కలెక్టర్లు తగిన సూచనలు చేస్తారు. మొత్తం కార్యక్రమం కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది.

సఫాయీ కర్మచారులకు నెలకు రూ.8,500 వేతనం రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో కలిపి 36 వేలమంది సఫాయీ కర్మచారులు పనిచేస్తున్నారు. ఆయా గ్రామపంచాయతీల ఆర్థిక పరిస్థితినిబట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు వేతనంతో వారు జీవితం వెళ్లదీస్తున్నారు. గ్రామపంచాయతీ బాధ్యతలు నిర్వహించడంతోపాటు మరో పని వెతుక్కోవాల్సి వస్తున్నది. వీరి దీనస్థితిని అర్థంచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సఫాయీ కర్మచారుల వేతనాలను రూ.8,500కు పెంచాలని నిర్ణయించారు. సఫాయీ కర్మచారులు ఇకపై పూర్తిసమయం గ్రామపంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుంది.

CMKCR1

ఇదీ.. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ -మొదటిరోజు గ్రామసభ నిర్వహిస్తారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఎందుకు నిర్వహిస్తున్నామో ప్రజలకు విడమరిచి చెప్పాలి. ప్రభుత్వ ఉద్దేశాలను వివరిస్తారు. ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి. -రెండోరోజు కోఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామపంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక నిర్వహించాలి. -సర్పంచ్ కుటుంబసభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయరాదు. -గ్రామానికున్న అవసరాలేమిటి? ఉన్న వనరులేమిటి? అనే విషయాలను బేరీజు వేసుకుని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. -ఆ ఏడాది చేయాల్సిన పనులకు, వార్షిక ప్రణాళిక, ఐదేండ్లలో చేయాల్సిన పనులకు కూడా పంచవర్ష ప్రణాళిక రూపొందించాలి. -ఈ ప్రణాళికలకు గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఈ ప్రణాళిక ఆధారంగానే నిధులు ఖర్చు చేయాలి.

పారిశుద్ధ్య నిర్వహణ -కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలిగించాలి. -పనికిరాని, ఉపయోగించని బావులు, లోతట్టు ప్రాంతాలను పూడ్చటంద్వారా నీరు నిలువకుండా చర్యలు చేపట్టి, దోమల ఉత్పత్తిని నిరోధించాలి. -పాఠశాలలు, అంగన్‌వాడీలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి. -సర్కారుతుమ్మ, జిల్లేడులాంటి పిచ్చిమొక్కలను తొలిగించాలి. -అన్ని రహదారులను శుభ్రంచేయాలి. -డ్రైనేజీలను శుభ్రంచేయాలి. డ్రెయిన్లకు మరమ్మతులు చేయాలి. మురికికాల్వలో ఇరుక్కుపోయిన చెత్తాచెదారం తొలిగించాలి. -అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లటంద్వారా పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టాలి. -లోతట్టు ప్రాంతాల్లో, రోడ్లపై నిలిచిన నీటిని తొలిగించాలి. -గ్రామస్థులందరూ నెలలో రెండు సార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. -సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి. -మొక్కలకు నీరు పోయటానికి, చెత్త సేకరణకు గ్రామపంచాయతీలు ట్రాక్టర్ సమకూర్చుకోవాలి. -అన్ని గ్రామాల్లో డంప్‌యార్డ్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని గుర్తించాలి. తగిన ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలుచేయాలి. -శ్మశానవాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలాన్ని గుర్తించాలి. -గ్రామపంచాయతీలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి.

హరితహారం -గ్రామపంచాయతీలే గ్రామంలో నర్సరీలను ఏర్పాటుచేయాల్సి ఉన్నందున, వాటికి శాశ్వత ప్రాతిపదికన అనువైన స్థలం ఎంపికచేయాలి. -నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామపంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. -12,751 గ్రామపంచాయతీ హరితహారం నర్సరీలతోపాటు కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను అటవీశాఖ పెంచుకోవచ్చు. -రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గ్రామపంచాయతీ గుర్తించాలి. ఇంటిదగ్గర నాటడానికి అవసరమైన పండ్లు, పూలమొక్కల ఇండెంట్‌ను సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు, రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్‌ప్లాన్ (హరిత ప్రణాళిక)ను సిద్ధంచేయాలి. ఈ గ్రీన్‌ప్లాన్‌ను గ్రామసభ ఆమోదించాలి. -జిల్లా గ్రీన్‌కమిటీ సూచనలకు అనుగుణంగా హరితప్రణాళికను రూపొందించాలి. -గ్రామపంచాయతీలు మొక్కలు పెట్టడంతోపాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి.

పవర్ వీక్ -30 రోజుల కార్యాచరణలో వారంపాటు పవర్‌వీక్ నిర్వహించాలి. -వేలాడుతున్న, వదులుగా ఉండే కరంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. -వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు పెట్టాలి. -వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, ప్రత్యేక మీటర్, స్విచ్‌లు బిగించాలి. -వీధిలైట్లు పగలు వెలుగకుండా చూడాలి. చలికాలంలో సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7 గంటలనుంచి ఉదయం 5.30 వరకు వీధిదీపాలు వెలిగి ఉండేలా చూడాలి.

నిధుల వినియోగం -కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా జమచేసి, ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధు లు విడుదల చేస్తుంది. ప్రతినెల రూ. 339 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు నిధులు వస్తాయి. -వీటితోపాటు గ్రామపంచాయతీ స్వీయ ఆదాయం, నరేగా నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి. -గ్రామపంచాయతీ బడ్జెట్‌లో పది శాతం నిధులను పచ్చదనం పెంచే కార్యక్రమాల కోసం కేటాయించాలి. -అప్పులు, జీతాలు చెల్లించడంలాంటి వాటితోపాటు విద్యుత్‌బిల్లుల చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో (చార్జ్‌డ్ అకౌంట్) చేర్చాలి. -వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చుచేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.