-బంగారు భారత్‌ను కలగంటున్న కేసీఆర్ -నాడు ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ -ఇప్పుడు తెలంగాణ బెబ్బులిలా సీఎం కేసీఆర్ -కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే -జాతి సంపదను కొల్లగొట్టడంలో పోటీపడుతున్నాయి -అందుకే మరో ప్రత్యామ్నాయానికి సీఎం కేసీఆర్ నడుం కట్టారు -వరంగల్‌లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ బెబ్బులిలా సీఎం కేసీఆర్ తలపెట్టిన కలను సాకారం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలి. మొండివైఖరిని పక్కనపెట్టి, విశాల ప్రజాహితం కోసం వామపక్ష పార్టీలు కూడా ముందుకు రావాలి. ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న టీడీపీ సైతం మద్దతు పలుకాలి.
– ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, దేశ ప్రజల యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు పూర్తవుతున్నా ఇంకా ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో, విశాలమైన సహజ, మానవ వనరుల్ని సద్వినియోగంచేసి, జాతి ప్రయోజనాలకు పెద్దపీటవేయాల్సిందిపోయి స్వార్థ రాజకీయాలపైనే దృష్టిసారించాయని అన్నారు. ఇటువంటి పరిస్థితిని సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారని చెప్పారు. అందుకే ప్రత్యామ్నాయ నిర్మాణానికి పూనుకొన్నారని తెలిపారు. సోమవారం హన్మకొండలో మంత్రి అజ్మీరా చందూలాల్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. ఒకనాడు ఎన్టీఆర్ హయాంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ మాదిరిగానే ఇప్పుడు ఇదే తెలుగు గడ్డమీంచి, తెలంగాణ బెబ్బులిలా సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ కలను సాకారం చేసేందుకు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మొండివైఖరిని పక్కనపెట్టి, విశాల ప్రజాహితం కోసం వామపక్ష పార్టీలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేయాలని నిజంగా కోరుకునే వామపక్షాలేకాదు.. అన్ని పార్టీలు, సంస్థలు కేసీఆర్ నిర్ణయానికి మద్దతు పలుకాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్న టీడీపీ సైతం మద్దతు పలుకాలని కోరారు.
జాతి సంపద కొల్లగొట్టడంలోనే ఆ పార్టీల పోటీలు జాతి సంపదను కొల్లగొట్టడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని, కుంభకోణాలకు కేరాఫ్‌గా మారాయని కడియం శ్రీహరి విమర్శించారు. ఇటువంటి తరుణంలో ఈ రెండు రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ వేదిక నిర్మించాలని కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో దేశ ప్రయోజనాల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టిస్తున్న సీఎం.. రేపు బంగారు భారత్‌ను కలగంటున్నారని చెప్పారు. ఆ కల సాకారం అవుతుందనేందుకు దేశవ్యాప్తంగా వస్తున్న మద్దతే నిదర్శమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగుతూ ప్రజలను కేవలం ఓటు యంత్రాలుగా వినియోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తన పాలనాకాలంలో అవినీతికి పాల్పడుతూ రాజ్యాంగ వ్యవస్థను, పాలనా వ్యవస్థను అపహాస్యం చేయడమే కాకుండా సర్వవ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగేండ్లుగా చేసింది ఏమీలేదని స్పష్టంచేశారు. మోదీ రోజుకు నాలుగుసార్లు డ్రస్సులు మార్చుకోవడానికి, ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనకే పరిమితం అయ్యారు. నాలుగేండ్లపాలనలో పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ, దేశ ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు, గుణాత్మకమైన ప్రగతికి దోహదం చేసే కనీసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టలేకపోయారు అని కడియం విమర్శించారు. కుంభకోణాలు, సీబీఐ విచారణలు, జైళ్లకు వెళ్లిన నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం బ్యాంకులను కొల్లగొట్టి దర్జాగా విదేశాలకు పారిపోయే దొంగలకు సద్దిగడుతున్నదని మండిపడ్డారు.
బ్యాంకులు కొల్లగొట్టి పారిపోతున్నవారి పట్ల వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ప్రధాని మోదీని కడియం డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం అంతా బయటికి వస్తుందని, జీఎస్టీతో దేశ ప్రజలకు భారీ మేలు జరుగుతుందని ప్రగల్బాలు పలికిన మోదీ.. ఈ దేశ సగటు భారతీయుడిని కష్టాలకు గురిచేసి, సంపన్నులకు మేలు చేశారని ఆరోపించారు. అసలీ బ్యాంకుల దోపిడీ వెనుక ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్యం ఉండొచ్చన్న అనుమానాన్ని కడియం వ్యక్తంచేశారు. ఈ దేశాన్ని ఆర్థిక నేరగాళ్ల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని భావించే సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.