– టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌కు నాయిని శాపనార్థాలు – రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, జానారెడ్డిపై ఆగ్రహం – అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలు టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రిపై అబద్ధాలు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
వారికి, ఆ పార్టీలకు రానున్న రోజుల్లో పుట్టగతులుండవు అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా బుధవారం నకిరేకల్‌లో నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కరెంట్ సమస్యలకు గత పాలకుల పాపమే కారణమన్నారు. గోదావరి జలాలు, సింగరేణి బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి కరెంట్‌కోతలకు చరమగీతం పాడి 50 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. ఆర్‌బీఐ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు రుణాలు త్వరలో మాఫీ చేస్తామన్నారు. మరో రెండేండ్లు రైతులు ఓపిక పడితే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి మూడు నెలలే అవుతున్నదని, 60 ఏండ్లుగా కుంటుపడిన రాష్ర్టాన్ని ఒకేసారి అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు మానుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అంతకుముందు కేతేపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించిన పోలీస్ భవనాన్ని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. హోంమంత్రి మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు సేవకులుగా ఉండాలని సూచించారు. మహిళల కోసం మహిళా పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
పోలీస్ వ్యవస్థ పటిష్టతకు రూ.340 కోట్లు మంజూరు చేశామన్నారు. శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్‌స్థానం లో నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. సిబ్బంది కష్టాలను గుర్తించిన ప్రభుత్వం, వారంలో ఒక రోజు సెలవు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య, హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిదర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.