-3 జూట్ మిల్లులు
-10 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు
-10 లక్షల ఎకరాల్లో జనుము పంట
-వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డిలో స్థాపన
-రాష్ట్రంతో మూడు కంపెనీల ఒప్పందం
-ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం జూట్ బ్యాగులే
-ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో వాటికి డిమాండ్
-వరితో దీర్ఘకాలంలో యోజనం లేదు
-ప్రత్యామ్నాయ పంటలే మేలు: కేటీఆర్

రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. వరి సాగు వల్ల తాత్కాలికంగా సంతోషపడవచ్చు కానీ, దీర్ఘకాలంలో పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పారు. రాష్ట్రంలో రూ.887 కోట్లతో మూడు జూట్ మిల్లుల స్థాపనకు ప్రభుత్వంతో గ్లోస్టర్, కాళేశ్వరం ఆగ్రోటెక్, ఎంజీబీ కమోడిటీస్ సంస్థలు శుక్రవారం ఒప్పందం కుదుర్చుకొన్నాయి. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రు లు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆయా కంపెనీల ప్రతినిధు లు సంతకాలు చేశారు. వరంగల్‌లో రూ.330 కోట్ల తో గ్లోస్టర్, కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రోటెక్ రూ.254 కోట్లతో, సిరిసిల్లలో ఎంబీజీ కమోడిటీస్ రూ.303 కోట్లతో పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నాయి.
10,400 మందికి ఉపాధి
మూడు జూట్ మిల్లుల స్థాపనతో రాష్ట్రంలో 10,400 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరి పండించే రైతులు జనుము పంటవైపు మళ్లే అవకాశాలు లభిస్తాయన్నారు. 10 లక్షల ఎకరాల్లో జనుము పంట వేసే అవకాశం ఉన్నదని చెప్పారు. జనుము ఉత్పత్తులు, ముఖ్యం గా గోనె సంచుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే జూట్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ జూట్ మిల్లులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. గతంలో రాష్ట్రంలో కేవలం 20 లక్షల టన్నుల ధాన్యం పండితే, ఇప్పుడది కోటి టన్నులకు చేరిందని గుర్తుచేశారు. రైతులకు 24 గంటలు విద్యుత్తు సరఫరా, సమృద్ధిగా సాగునీరు, రైతుబంధు ఇస్తుండటంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ జూట్ మిల్లులు రైతుల నుంచి జనుమును నేరుగా కొనుగోలు చేస్తాయన్నారు. రాష్ట్రప్రభుత్వం, కంపెనీలు రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. వీటిద్వారా జూట్ ఉత్పత్తులకు మరింత డిమాండ్ వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం జూట్ బ్యాగులేనని చెప్పారు.
రేపు దేశం ఆచరిస్తుంది: నిరంజన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ నేడు ఆలోచించేదాన్ని రేపు భారతదేశం మొత్తం ఆచరిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి చెప్పిన అనేక అంశాలను అంతకు ముందుగానే సీఎం కేసీఆర్ ఆచరించి చూపించారని తెలిపారు. తెలంగాణలో అద్భుతమైన మానవవనరులు, ముడిసరుకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల మాట్లాడుతూ 2014 వరకు తెలంగాణలో 3.2 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా, పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తితో వాటి డిమాండ్ 2021-22లో 50 కోట్లకు పెరిగిందన్నారు. ఇప్పుడు ఏర్పాటుచేసే మూడు మిల్లుల్లో తయారయ్యే సంచులు కూడా మన అవసరాలకు సరిపోనంతగా పంట పండుతున్నదని వెల్లడించారు.
పారిశ్రామీకరణకు గుండెకాయ: హేమంత్
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామీకరణకు గుండెకాయలాంటిదని గ్లోస్టర్ కంపెనీ చైర్మన్ హేమంత్ బాగూర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఇక్కడి వ్యవసాయ అనుకూల వాతావరణం చూసి పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మిల్లుల ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, కంపెనీల ప్రతినిధులు హేమంత్ బాగూర్, విజయ్ మదాని తదితరులు పాల్గొన్నారు.
రాయితీలు ఇవే…
ఈ మిల్లుల్లో తయారయ్యే గోనె సంచులను మొదటి ఏడేండ్లు వందశాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
ఆ తరువాత ఐదేండ్లపాటు 75 శాతం సంచులను, ఆ తరువాత 8 ఏండ్లపాటు 50 శాతం సంచులను ప్రభుత్వం కొంటుంది.
మొదటి ఐదేండ్లు ఈ మిల్లుల్లో గోనె సంచుల తయారీకి అవసరమైన జనుమును పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవడానికి ప్రభుత్వం రవాణా రాయితీ ఇస్తుంది.
మొదటి రెండేండ్లు రవాణాపై రాయితీని 75 శాతం, మూడు, నాలుగేండ్లలో 50 శాతం, ఐదో ఏడాది 25 శాతం చెల్లిస్తుంది.
మూలధన వ్యయం, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, విద్యుత్తు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.
వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఈ పరిశ్రమలకు అవసరమైన జనుము పంట వేసేలా చర్యలు తీసుకొంటుంది.