Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

500 కోట్లతో మార్కెట్లు

-అన్ని మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మండీలు
-325 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధిప్లాంట్లు
-తొలిదశలో 71 మున్సిపాలిటీల్లో నిర్మాణం
-వైకుంఠధామాల నిర్మాణానికి 200 కోట్లు
-ప్రతినెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు
-భావితరాల ఉన్నతే ప్రభుత్వ లక్ష్యం
-ఆ దిశగానే పాలన.. ఎన్నికల్లో లబ్ధికి కాదు
-మన పల్లెలు, పట్టణాలు ఆదర్శం: మంత్రి కేటీఆర్‌
-జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రం అందుకు భిన్నంగా కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తున్నది.. పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లు మంజూరుచేస్తున్నాం. కరోనా కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ ప్రభుత్వం రాజీపడటం లేదు. తెలంగాణ భవిష్యత్‌ ఉన్నతే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. ఎన్నికల్లో లబ్ధి పొందడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.
-మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో 43 శాతం జనాభా పట్టణాల్లోనే ఉన్నదని, మౌలిక వసతులను కల్పించేందుకు నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అందులో భాగంగానే రూ.500 కోట్లతో హైదారాబాద్‌ మినహా అన్ని మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తునట్టు చెప్పారు. తెలంగాణ భవిష్యత్‌ ఉన్నతే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని, ఎన్నికల్లో లబ్ధి పొందడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లి, కోరుట్లలో మంత్రి పర్యటించారు. పితృవియోగంతో విషాదంలో ఉన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మెట్‌పల్లి అనుబంధ గ్రామం రేగుంటలోని ఇంటికి వెళ్లి మంత్రి కేటీఆర్‌ ఓదార్చారు. ఎమ్మెల్యే తండ్రి సురేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి కోరుట్ల 23వ వార్డులో మానవవ్యర్థాల శుద్ధి ప్లాంటును (ఎఫ్‌ఎస్‌టీపీ) ప్రారంభించారు. మెట్‌పల్లి ఖాదీ మైదానంలో రూ.2.5 కోట్లతో నిర్మించే వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు భూమిపూజ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణకు ముందు 68 మున్సిపాలిటీలు ఉండగా, ఇప్పుడు 142కు పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణాలను ఆదర్శంగా మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. పట్టణాల్లో మానవ వ్యర్థాలను శుద్ధి ప్లాంట్లను(ఫికల్‌ స్లిడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) అన్ని మున్సిపాలిటీల్లో రూ.325 కోట్లతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటిదశలో 71 చోట్ల ప్లాంట్ల నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తవుతాయని, వచ్చే ఏడాది మిగిలిన పట్టణాల్లో పూర్తిచేస్తామని తెలిపారు. హైదరబాద్‌ మినహా 141 మున్సిపాలిటీల్లో రూ.200 కోట్లతో వైకుంఠ ధామాల నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు.

తెలంగాణ వచ్చాకే 12 మెడికల్‌ కాలేజీలు
పల్లె ప్రగతిలాగే పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టామని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ స్థానికసంస్థల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ అందుకు భిన్నంగా కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని చెప్పారు. పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్లను మంజూరుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ వసతుల కల్పనలో ప్రభుత్వం రాజీపడకుండా నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. ఇవేకాకుండా పట్టణాల్లో మంచినీరు తదితర మౌలికవసతుల కల్పన కోసం అదనంగా నిధులను మంజూరుచేస్తున్నట్టు తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టు వివరించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు నాలుగు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత తొలుత ఐదు, ఇటీవల మరో ఏడు మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్‌ మంజూరుచేశారని గుర్తుచేశారు. అన్ని సౌకర్యాలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు.

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి విలేకరులకు ఇండ్ల స్థలాలను కేటాయించే విషయాన్ని పరిశీలించాలని సమావేశం అనంతరం కలెక్టర్‌ రవిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.ఆర్‌ఎంపీ, పీఎంపీలను హైరిస్క్‌ గ్రూపులుగా గుర్తించి టీకాలు వేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ వినతిపత్రం అందజేయగా, మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు బయలుదేరిన మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి జాతీయ రహరదారుల వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, జగిత్యాల, పెద్దపల్లి జడ్పీ చైర్‌పర్సన్లు దావ వసంత, పుట్ట మధు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు అన్నం లావణ్య, రాణవేని సుజాత, సీడీఎంఏ సత్యనారాయణ, జగిత్యాల కలెక్టర్‌ గుగులోత్‌ రవి, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

నా చెల్లికి జాబ్‌ ఇప్పించరా సార్‌!
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంత్రి కేటీఆర్‌ను తన చెల్లెలికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్న కోరుట్ల మండలంలోని ఐలాపూర్‌కు చెందిన దివ్యాంగుడు చెప్యాల నరేశ్‌ ఉన్నత విద్య అభ్యసించిన తన చెల్లెలికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ ఓ దివ్యాంగుడు కోరుట్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన చెప్యాల నరేశ్‌ మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. అతని యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. నరేశ్‌ వినతిపై సరేనంటూ సానుకూలంగా స్పందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.