Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రూ.4,700 కోట్లు నాలుగేండ్లలో కేంద్రం నుంచి వచ్చే అవకాశం

-నాలుగేండ్లలో కేంద్రం నుంచి వచ్చే అవకాశం వ్యాట్ వాటాకు క్లియరెన్స్ -ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి సడలింపునకు హామీ -త్వరలోనే 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు -కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఫలప్రదం

KCR ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ఈ పర్యటన ఫలితంగా రాష్ర్టానికి రూ.4,700కోట్లు అదనంగా నిధులు రానున్నాయి. పలురకాలైన కొత్త సంక్షేమ పథకాల అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న రాష్ర్టానికి కేంద్రం అందించబోయే ఆర్థిక సహాయం ఎంతో తోడ్పాటు ఇవ్వనుంది. ముఖ్యమంత్రి మూడురోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి వివరించారు. రాష్ర్టానికి అధిక మొత్తంలో పన్నులు, నిధులు వస్తాయని ఆశించినా, చాలా సంస్థలు వ్యాట్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెల్లిస్తున్నాయని, ఫలితంగా తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. గత పదేండ్లుగా రాష్ర్టాల నుంచి వసూలుచేసిన వ్యాట్‌లో ఉమ్మడి రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటాను కేంద్రం పెండింగ్‌లో ఉంచింది. ఇది సుమారు పదివేల కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్ర ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఇవ్వాల్సిన నిధులనైనా విడుదల చేయాలని కోరారు. దీనికి జైట్లీ అంగీకరించినట్లు సమాచారం. ఫలితంగా మొత్తం పది వేల కోట్లలో తెలంగాణ రాష్ట్ర వాటాగా సుమారు రూ.4,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ దీనిని ఒకేసారి కాకుండా ప్రస్తుత ఏడాది కొంత, ఆ తరువాత ప్రతీ ఏడాదికి మరికొంత చొప్పున ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలుస్తున్నది.

ఇందులో మొదటి విడతగా రూ.1200 కోట్లను విడుదల చేసినా రాష్ర్టానికి ఎంతో ఊరట కలుగుతుంది. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు, సంక్షేమ పథకాల అమలు, రైతుల రుణమాఫీకోసం వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వానికి కేంద్రం అందించే సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. నూతన రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం)చట్టం పరిధిని సడలించాలని చేసిన విజ్ఞప్తికి కూడా కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 3% ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కొంత సడలిస్తే, బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు రుణాలను తెచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అవసరాలకు ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను వెచ్చించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని కూడా నిలబెట్టుకోవాలని కేంద్రానికి సీఎం విన్నవించారు. ఎన్టీపీసీ చైర్మన్‌తో భేటీ అయిన సీఎం.. రాష్ట్రం విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఎన్టీపీసీ బోర్డులో ఆమోదం తెలిపి, కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని ఆ సంస్థ చైర్మన్ సీఎంకు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.