-తెలంగాణలో ఏర్పాటుకు ఐటీసీ సంసిద్ధత -లక్ష ఎకరాల్లో సర్వీ చెట్ల పెంపకం -పరిశ్రమల స్థాపనకు తరలివస్తున్న ప్రముఖ సంస్థలు -ముఖ్యమంత్రి కేసీఆర్‌తో హిందూజా, ఐటీసీ, మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల భేటీ

రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రపంచస్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా పారిశ్రామిక ఆర్థికవిధానాన్ని ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అనుకూలమని ఈ సంస్థలు గుర్తించాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పుతామంటూ ప్రభుత్వానికి సమాచారమిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ దొబాలే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్‌సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార పదార్ధాల తయారీ యూనిట్లను నెలకొల్పుతామని వారు సీఎంకు చెప్పారు. రూ.3500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమను స్థాపించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అలాగే లక్ష ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచుతామన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, పూర్తి సహకారాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణ గ్లోబల్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతోన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్‌ప్రామాణి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. సచివాలయంలో సోమవారం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తోపాటు ఐటీ, పంచాయతీరాజ్ శాఖమంత్రి కే టీ రామారావుతో సమావేశమయ్యారు.
దేశంలో అమలవుతోన్న పన్నుల విధానం కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణకు చర్యలు తీసుకుంటామని భాస్కర్ హామీ ఇచ్చారు. దీనివల్ల వందల మందికి ఉపాధి కలుగనుంది. త్వరలో హైదరాబాద్‌కు రానున్న మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెండ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌరసన్మానం చేస్తామని కేసీఆర్ చెప్పారు. అలాగే.. ఒప్పందం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ తనను సచివాలయంలో కలిసిన హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజాను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థలు ముందుకొస్తుండడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పారిశ్రామికవేత్తలకు స్నేహపూర్వకంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తనను కలిసిన వివిధ కంపెనీల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ చెప్పారు. అది పూర్తయిన వెంటనే ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు.