Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రూ. 27వేల కోట్లతో వాటర్ గ్రిడ్

-ప్రతి ఇంటికీ నల్లా -నాలుగేండ్లలో అందరికీ రక్షితనీరు -ఈ గ్రిడ్ ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది -లక్షా 26 వేల కి.మీల పొడవున పైప్‌లైన్ -డీపీఆర్ సర్వేకు రూ.317కోట్లు -రెండు నెలల్లో సర్వే పనులకు టెండర్లు -వాటర్ గ్రిడ్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ -లిప్టుల కన్నా కాంటూర్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

KCR review on Water Grip Project

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రపంచరికార్డు సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ పథకంలో భాగంగా భూమి చుట్టుకొలతకు నాలుగు రెట్లు పొడవైన పైప్‌లైన్లు వేయబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీటిని అందించడం తన స్వప్నమని కేసీఆర్ ప్రకటించారు. సుమారు రూ.27 వేల కోట్ల వ్యయంతో ఈ వాటర్ గ్రిడ్ చేపడుతున్నామని సీఎం చెప్పారు. మూడు నెలల్లో డీపీఆర్ సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.317 కోట్లను తక్షణం మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధమ్యాలలో తాగునీటి అంశమే మొదటిదని, రానున్న బడ్జెట్‌లో కూడా మంచినీటికి అధికంగా నిధులు ఇస్తామని సీఎం చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ వాటర్ గ్రిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు నాగిరెడ్డి, ఎస్‌కే జోషి, రేమాండ్ పీటర్, ప్రదీప్‌చంద్ర, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావులతో పాటు ఆర్‌డబ్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వాటర్ గ్రిడ్ స్వరూపాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. మొత్తం 24 గ్రిడ్‌లతో అన్ని గ్రామాలు అనుసంధానం చేస్తూ పైప్‌లైన్లు వేయాలని నిర్ణయించారు. డీపీఆర్ సర్వే కోసం రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం వాటర్ గ్రిడ్‌కు సంబంధించి అధికారులు రూపొందించిన మ్యాపులు, కాంటూర్‌లను పరిశీలించారు. గూగుల్ ఎర్త్ సహకారంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులను, కాంటూర్‌లను, భౌగోళిక పరిస్థితులను కేసీఆర్ పరిశీలించారు.

పరిశ్రమలకు నీరివ్వండి..: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులోనే పరిశ్రమలకు నీరందించే వెసులుబాటు కూడా కల్పించాలని అన్నారు. ఈ వాటర్ గ్రిడ్ ప్రపంచ రికార్డు నెలకొల్పుతుందని చెప్పారు. భూమి చుట్టు కొలత 33వేల కిలోమీటర్లయితే అంతకు నాలుగు రెట్ల పొడవున 1,26,036 కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేస్తామన్నారు. ఇక్కడ వేసే పైప్‌లైన్ పొడవుతో నాలుగుసార్లు భూమిని చుట్టి రావచ్చని కేసీఆర్ అన్నారు. గ్రిడ్‌లో5,227 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ లైన్, 45,809 కిలోమీటర్ల సెకండరీ నెట్‌వర్క్, 75వేల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ పైప్‌లైన్ నిర్మిస్తామని సీఎం చెప్పారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌దే బాధ్యత.. ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రో వాటర్ వర్క్స్, పబ్లిక్ హెల్త్ లాంటి శాఖలు ప్రజలకు మంచినీరు సరఫరా చేయడం కోసం పనిచేస్తున్నాయని, వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి రావలసిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మంచినీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్ స్వీకరించాలని చెప్పారు. ఇందుకోసం ఎంత వ్యయం అవుతోంది?ఎంతనీరు అవసరం అవుతుందనే విషయాలపై కచ్చితమైన అధ్యయనం జరగాలన్నారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి సరఫరా వ్యవస్థకు, పరిశ్రమలకు ఎంత నీరు అవసరం? హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకు ఎంత నీరు అవసరం? గ్రామాలకు ఎంత నీరు అవసరం? ఆసుపత్రులు, కార్యాలయాలు, ఇతర సంస్థలకు ఎంత నీరు కావాలి? అనే విషయాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. మొత్తంగా రాబోయే 30 ఏళ్లకు సంబంధించిన అవసరాలు కూడా తీర్చే విధంగావాటర్ గ్రిడ్ రూపకల్పన జరగాలన్నారు. ఏ జిల్లాకు ఏ నీటి వనరుల ద్వారా నీరందించాలనే విషయంలో ఖచ్చితమైన అవగాహనకు రావాలని సీఎం చెప్పారు.

కాంటూర్‌పైనే గురిపెట్టండి.. నీటి వనరు నుంచి గ్రామాలకు నీరు అందించేందుకు పూర్తిగా లిప్టుల మీద ఆధారపడవద్దని, సమీపంలోని కాంటూర్లను గుర్తించి, అక్కడికి నీరు ఎక్కించాలని, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం జిల్లాలు, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లిలో 670 మీటర్ల కాంటూర్ ఉందని, ఇది తెలంగాణలోనే ఎత్తైన కాంటూరు అని సీఎం చెప్పారు. అక్కడికి నీరు ఎక్కిస్తే తెలంగాణలోని చాలా ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చని తెలిపారు. వరంగల్ నగరంలోని పద్మాక్షీ గుట్ట ప్రాంతంలో చాలా గుట్టలున్నాయని, అక్కడి ఎల్‌ఎండి నీరును ఎక్కిస్తే సగం జిల్లా అవసరాలు తీర్చవచ్చన్నారు. సిద్దిపేటలోని గుడ్డేలుగుల గుట్ట పైకి ఎల్‌ఎండీ నీరు ఎక్కించి మొత్తం గ్రామాలకు నీరందిస్తున్న విషయాన్ని సీఎం అధికారులకు వివరించారు.

డెడ్ స్టోరేజీలు పాటించాలి.. జూరాల, నాగార్జున సాగర్ వంటి శాశ్వత నీటి వనరులుగా ఉంటాయని, గోదావరి ఎత్తిపోతల పథకం లాంటివి కొన్ని రోజులు మాత్రమే నీరు అందించగలుగుతున్నాయన్నారు. అలాంటి చోట్ల స్టోరేజ్ ట్యాంకులను నిర్మించాలని సూచించారు. జలాశయాల్లో కూడా 365 రోజుల పాటు మంచినీటి అవసరాలు తీర్చడం కోసం డెడ్ స్టోరేజ్ లెవల్స్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరం మినహాయిస్తే మిగితా తెలంగాణకు 80టీఎంసీల నీరు అవసరం అవుతుందని సీఎం అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలు ప్రతి మనిషికి 30 లీటర్ల నీరు అందించడం కోసం ఏర్పాటు చేసినవని, మరో 70 లీటర్ల కోసం ప్రాజెక్టును రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇది మొత్తం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు మూలస్తంభం అవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

హైదరాబాద్‌పై మరోసారి చర్చ… హైదరాబాద్‌ను గ్రిడ్ పరిధిలోకి తేవాలా? వద్దా? అనే విషయంపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. వాటర్ గ్రిడ్‌తో పాటు పారిశుద్ధ్య నిర్వహణను అంతర్భాగంగా చేపట్టే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై సర్వే పనుల నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సీఎం కేసీఆర్ ప్రత్యక్ష్యంగా పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. గ్రిడ్ పనులు జరిగే ప్రాంతాల్లో హెలికాప్టర్‌తో కేసీఆర్ పరిశీలిస్తారు.

రూ. 27వేల కోట్లతో.. సుమారు రూ.27 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలతోపాటు పరిశ్రమలకు కూడా ఈ గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇందుకోసం 24 గ్రిడ్‌లను అన్ని గ్రామాలతో అనుసంధానం చేస్తూ 1,26,036 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ వేస్తారు. దీనిలో 5227 కిలోమీటర్లు ప్రధాన లైన్ కాగా, 45,809 కిలోమీటర్లు గ్రామాలకు నీటిని సరఫరా చేసే లైన్.

మరో 75వేల కిలోమీటర్ల పరిధిలో గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ వేస్తారు. నాలుగేళ్లలో గ్రిడ్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ గ్రిడ్ ద్వారా అందించే నీరు 2050 నాటి వరకూ తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేలా ఉంటుంది. వాటర్ గ్రిడ్ డీపీఆర్ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.317 కోట్లను తక్షణం మంజూరు చేయాలని నిర్ణయించారు. డీపీఆర్ సర్వే కోసం రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రిడ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఫైనాన్స్ సంస్థల నుంచి నిధులను సేకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

అధికారులకే వివరాలు చెప్పిన సీఎం వాటర్ గ్రిడ్ కీలకాంశలపై చర్చ సందర్భంగా సీఎం అధికారులకే సమాచారం అందించారు. అధికారులు అందుబాటులో ఉన్న పూర్తి సమాచారంతోనే వెళ్లినా సీఎం చెప్పిన సమాచారంతో తడబడాల్సి వచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న చెరువులు, గుట్టల వివరాలను అధికారులు వివరిస్తున్న సమయంలో కేసీఆర్ వారి సమాచారాన్ని సరిచేశారు. చెరువులు, వాటి సాగు విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం, చెరువులకు చుట్టుపక్కల ఉన్న గుట్టలు, ఎత్తైన ప్రాంతాలు తదితర సమాచారం అధికారులకంటే ముఖ్యమంత్రి వద్దే అధిక సమాచారం ఉంది. జిల్లా సరిహద్దులు, ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఏసమయంలో ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండేది, పైప్ లైన్లకు ఎలాంటి పైపులను ఉపయోగించాలి వంటి వివరాలను సీఎం గుక్క తిప్పుకోకుండా వివరిస్తుంటే అధికారులు అవాక్కయ్యారు. ముఖ్యంగా చెరువులు, కుంటల వివరాలు, వాటి పరివాహక ప్రాంతాల వివరాలను సీఎం చెబుతుంటే గ్రామీణ నీటిపారుదల, రెవిన్యూ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పూర్తి సమాచారం సేకరించి పెట్టుకోవాలని, పైపై లెక్కలతో సరిపెట్టవద్దని సీఎం ఈ సందర్భంగా అన్నారు.

వాటర్ గ్రిడ్ సమగ్ర స్వరూపం వ్యయం: రూ.27 వేల కోట్లు జిల్లాల్లో గ్రిడ్‌లు: 24 పొడవు : 1,26,036 కి.మీ ప్రధాన లైన్ : 5227 కి.మీ అనుసంధా న లైన్లు: 45,809 కి.మీ గ్రామాల్లో లైన్లు: 75,000 కి.మీ కాల వ్యవధి: నాలుగేండ్ల్లు సరఫరా చేసే నీరు: 80 టీఎంసీలు నీటి సరఫరా ఒక్కొక్కరికి.. గ్రామాల్లో: 100 లీటర్లు పట్టణాల్లో: 150 లీటర్లు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.