Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

20ఏండ్ల విజయ గర్జన

-టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది పండుగ
-వచ్చేనెల 15న వరంగల్లో లక్షల మందితోబహిరంగ సభ
-ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ
-సర్వసభ్య సమావేశం, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
-గర్జన సభ తర్వాత జిల్లా పార్టీ ఆఫీసుల ప్రారంభం
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి

టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘ద్విదశాబ్ది ఉత్సవాలు’ నిర్వహించనున్నట్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్‌ 15న వరంగల్‌ వేదికగా ‘తెలంగాణ విజయ గర్జన’ పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల ప్రస్థానం, కార్యకర్తల శ్రమను గుర్తు చేసుకోవడంతోపాటు, ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టి, సాధించిన విజయాలను మరోసారి దేశానికి చాటి చెప్తామన్నారు. అంతకు ముందే.. ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అధ్యక్ష ఎన్నికపై ప్లీనరీలో అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను, చాలెంజ్‌లను అధిగమించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో రాజకీయ శక్తిగా ఎదిగింద న్నారు. ‘కేసీఆర్‌ నేతృత్వంలో దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణను ఎలా సాధించుకున్నామో అందరికీ తెలుసు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు 2014లో అధికారాన్ని అప్పగించారు. అప్పటి నుంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని కలెగలిపి జోడెడ్లలా జనరంజక పాలన అందించాం,ఫలితంగా 2018లో మళ్లీ భారీ మెజారిటీతో రెండోసారి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని దీవించారు’ అని పేర్కొన్నారు.

లక్షల్లో తరలిరండి
తెలంగాణ విజయగర్జనకు ప్రజలు, కార్యకర్తలు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని వరంగల్‌కు రావాలని లక్షల్లో తరలిరావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘విజయ గర్జనకు సీఎం కేసీఆరే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. వారి నాయకత్వంలోనే రాష్ట్రం వచ్చింది. ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విజయగర్జన సభ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు మొదలు పెడుతామని, ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణాశిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఏడేండ్లలోనే తనదైన ముద్ర
ఏడేండ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ ప్రత్యేకతను సంపాదించుకున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా తనదైన ముద్రను వేసుకున్నదన్నారు. మన నుంచి స్ఫూర్తి పొంది, మన పథకాలను అనుకరించి స్వయంగా కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ర్టాలు పథకాలను అమలు చేసే స్థాయికి తెలంగాణ చేరుకున్నదని చెప్పారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఏ విధంగా దోహదం చేస్తున్నదో ఇటీవల ఆర్బీఐ, నీతి అయోగ్‌ విడుదల చేసిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం పెరుగుదల, జాతి నిర్మాణంలో మన పాత్ర ఎలా ఉన్నదో కేంద్ర ప్రభుత్వ సంస్థలే కండ్లకు కట్టినట్టు వివరించాయన్నారు. సీఎం కేసీఆర్‌ పాలన జాతికే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. కార్యకర్తల కష్టం, కేసీఆర్‌ జనరంజక పాలన, సాధించిన చిరస్మరణీయ విజయాలను సెలబ్రేట్‌ చేసుకునేందుకు నవంబర్‌ 15న ‘తెలంగాణ విజయగర్జన’ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

25న హైదరాబాద్‌లో ప్లీనరీ
ఏప్రిల్‌ 27 టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండేండ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ సర్వసభ్వ సమావేశం, ప్రతినిధుల సభ ఉంటాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. అయితే.. 2019లో సార్వత్రిక ఎన్నికలు, గతేడాది, ఈసారి కరోనా వల్ల అనివార్యంగా ప్లీనరీ వాయిదా పడిందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం, పార్టీ ప్లీనరీ జరుగుతుందని చెప్పారు. ఇందులో దాదాపు 14వేల మంది పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3,600 పైచిలుకు వార్డు కమిటీలు, బస్తీ, డివిజన్‌, పట్టణ కమిటీలు, అనుబంధ సంఘాల నిర్మాణం పూర్తయిందన్నారు. 25న జరిగే ప్లీనరీలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని, నూతన అధ్యక్షుడి నిర్ణయానుసారం జిల్లా కమిటీలు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ నిర్మాణం ఉంటుందని వివరించారు. ప్లీనరీలో రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ అంశాలు, ప్రజా సమస్యలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలపై విస్తృతమైన చర్చ జరుగుతుందని, పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతామని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న తెలంగాణ భవన్‌లో శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్నిక కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు అది అపాయింటెడ్‌ పోస్టు మాత్రమేనని తెలిపారు. సమావేశంలో మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కార్పొరేషన్‌ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్‌, సీనియర్‌ నేత పర్యాద కృష్ణమూర్తి పాల్గొన్నారు.

తెలంగాణ విజయగర్జన వరకు ఇదీ షెడ్యూల్‌
-అక్టోబర్‌ 17: పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ
-అక్టోబర్‌ 17: పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షాల సంయుక్త సమావేశం
-అక్టోబర్‌ 22: నామినేషన్లకు ఆఖరు తేదీ
-అక్టోబర్‌ 23: నామినేషన్ల పరిశీలన
-అక్టోబర్‌ 24: నామినేషన్ల ఉపసంహరణ
-అక్టోబర్‌ 25: పార్టీ సర్వసభ్య సమావేశం, నూతన అధ్యక్షుడి ఎన్నిక అనంతరం 14 వేల మందితో ప్లీనరీ.
-అక్టోబర్‌ 27: తెలంగాణ విజయగర్జన విజయవంతానికి అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు.
-నవంబర్‌ 15: తెలంగాణ విజయ గర్జన

అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్‌ అధికారులు: పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి.
ఎన్నికల పర్యవేక్షకులు: పార్టీ సీనియర్‌ నేత పర్యాద కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌
ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్‌: మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.