Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నాడు రెడ్‌టేపిజం..నేడు రెడ్‌కార్పెట్

– విదేశాల్లో ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌లు – రెండున్నర ఏండ్లలో 34,000 కోట్ల పెట్టుబడులు, 7379 పరిశ్రమలు – నాడు కరెంటు కోసం పారిశ్రామికవేత్తల ధర్నాలు – నేడు మూడు షిఫ్టులకు నాణ్యమైన కరెంటు – ఈవోడీబీలో నంబర్ వన్ ర్యాంకు మనదే – 75,000 కోట్లకు చేరిన ఐటీ ఎగుమతులు

పారిశ్రామికవేత్తలను తెలంగాణ సర్కార్ స్వాగతించింది దుష్ప్రచారాలను పటాపంచలు చేశాం.. టీఎస్ ఐపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ రెడ్‌టేపిజం, బ్యూరోక్రసీ, కరెంటు కోతలతో కునారిల్లిన తెలంగాణ పారిశ్రామిక రంగానికి జవసత్వాలు అందించి సగర్వంగా ప్రపంచపటం మీద నిలబెట్టామని మంత్రి కే తారక రామారావు గారు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలు తరలిపోతాయని జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేసి.. విద్యుత్తు, నీరు, శాంతిభద్రతలు, ప్రోత్సాహకాలతో హైదరాబాద్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చామని అన్నారు.

assembley

రాష్ట్రం ఏర్పాటైన రెండున్నర ఏండ్లలో 34వేల కోట్ల పెట్టుబడితో 7379 పరిశ్రమలను రప్పించామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు చెప్పారు. తమ ప్రభుత్వ నిరంతర కృషి వల్లనే ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌కు తరలివచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన టీఎస్ ఐపాస్‌ను ప్రధానితో పాటు దేశ విదేశాల్లో పలువురు ప్రశంసించారని, ఇంత మెరుగైన విధానం అమెరికాలో కూడా లేదని అక్కడి పారిశ్రామికవేత్తలే చెప్పారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఫార్మాసిటీతోపాటు మెడికల్ డివైజెస్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, లెదర్ పార్క్, ఫర్నిచర్ పార్క్, స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐటీ రంగ ఎగుమతులు రూ. 75 వేల కోట్లకు చేరుకున్నాయని, వచ్చే రెండేండ్లలో వీటిని రెట్టింపు చేస్తామన్నారు. టీఎస్ ఐపాస్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ గారు సమాధానాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెట్టుబడులు రావన్నారు..

సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం.. తెలంగాణ వచ్చాక పెట్టుబడులు రావని, ఉన్న పెట్టుబడులు కూడా పోతాయని కొందరు ప్రచారం చేశారు. వారి పేర్లు ఇక్కడ అనవసరం. ఆనాడు పారిశ్రామిక వేత్తలు విద్యుత్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఎన్నో బాలారిష్టాలు దాటుకుని, సవాళ్లు ఎదుర్కొని శరవేగంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి పారిశ్రామికవేత్త టీఎస్ ఐపాస్‌ను అమలుచేస్తున్న ఆదర్శరాష్ట్రంగా తెలంగాణను చూస్తున్నారు. ఎన్నో ప్రోత్సాహకాలతోనే అపిల్, అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చాయి. సీఎం కేసీఆర్, నాటి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏడు గంటల పాటు పారిశ్రామిక వేత్తలతో చర్చించి పారిశ్రామిక పాలసీ రూపొందించారు. దానిని సమర్థవంతంగా అమలు చేస్తున్నందువల్లనే టీవీ18 బెస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆవార్డు ఇచ్చింది. వీటితో పాటు ఇండియాటుడే గత మూడు సంవత్సరాలుగా మనకే అవార్డు ఇస్తున్నది. అన్ని అవార్డులకంటే మాకు ప్రజలిచ్చిన అవార్డే గొప్ప. ఎక్కడ ఎన్నికలు జరిగినా మాకే గెలుపు సర్టిఫికెట్ ఇస్తున్నారు.

– విదేశాల్లో ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌లు

పెట్టుబడుల ఆకర్షణలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేద్దాం : మంత్రి కేటీఆర్ గారు

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆరు చోట్ల డెస్క్‌లను ఏర్పాటు చేస్తాం.. కేవలం ఐటీ, పారిశ్రామికరంగాల్లోనే కాకుండా మొత్తం 14 సెక్టార్లలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.. అని మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీలో పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణలోనూ తెలంగాణను నంబర్‌వన్ చేసేందుకు అన్ని పార్టీలవారు సహకరించాలని కోరారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రపంచవ్యాప్తంగా ఆరు చోట్ల డెస్క్‌లు (ఏజెన్సీ కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కే తారకరామారావు తెలిపారు. అమెరికాలో రెండు, యూరప్‌లో రెండు, చైనా, సౌత్‌ఈస్ట్ ఆసియాలో ఒక్కొక్కటి చొప్పున ఏజెన్సీలు ఏర్పాటు చేసి తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తామన్నారు. మేక్‌ఇన్ ఇండియాలో భాగంగా భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే కంపెనీలు తొలి ప్రాధాన్యంగా తెలంగాణను ఎంచుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కేవలం ఐటీ, పారిశ్రామికరంగాల్లోనే కాకుండా మొత్తం 14 సెక్టార్లలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్, సులభతర వ్యాణిజ్య విధానంపై స్వల్పవ్యవధి చర్చలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ గారు సమాధానమిచ్చారు.

సులభతర వ్యాణిజ్యంలో ఇప్పటికే నంబర్‌వన్ అనిపించుకున్న ఈ రాష్ర్టాన్ని పెట్టుబడుల ఆకర్షణలోనూ నంబర్‌వన్ చేసేందుకు పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఆయన శాసనసభ్యులను కోరారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నీ బాగా అమలవుతున్నాయని ప్రతిపక్ష నేత చెప్పడం సంతోషంగా ఉన్నదన్నారు. విధానాల అమలులోనూ 60 శాతం మార్కులతో ప్రభుత్వం ఫస్ట్‌క్లాస్‌లో పాసైందని ప్రతిపక్షనేత జానారెడ్డితోనే చెప్పించుకుంటామన్న విశ్వాసం తమకు ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి నంబర్‌వన్ అన్న పేరు వస్తున్నదన్నారు.

రెండేండ్లలో 1,95,390 మందికి ఉపాధి టీఎస్‌ఐపాస్ తెచ్చిన తరాత ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి కల్పించగలిగారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. ఈ 24 నెలల్లో టీఎస్‌ఐపాస్ ద్వారా 7,308 యూనిట్లు అనుమతులు పొందాయి. దీనిలో దాదాపు మూడు వేల యూని ట్లు టీఎస్‌ఐపాస్ ద్వారా వచ్చాయి. ఉత్పత్తి మొదలైన 1139 యూనిట్లలో 45,033 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిం చాం. నిర్మాణం పూర్తయ్యే దశలో మరో 405 యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా 25,453 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకనున్నది. 502 యూనిట్ల నిర్మాణాలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవికాకుండా రెండు నెలల క్రితం అనుమతి పొందిన 884 యూనిట్లు పని ప్రారంభించాల్సి ఉన్నది. అవి పూర్తయితే 72,740 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా ఈ రెండేండ్లలో లక్ష 95వేల 390 మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. టీఎస్ ఐపాస్‌లో స్వీయ ధ్రువీకరణలో భాగంగా ఆయా కంపెనీలు ఇచ్చిన ప్రకారమే ఈ లెక్కలు చెప్తున్నాను అని మంత్రి గారు పేర్కొన్నారు. బెంగళూరుతో ఐటీతోపాటు, రక్షణ రంగంలోనూ పోటీ పడుతున్నట్టు మంత్రి కేటీఆర్ గారు తెలిపారు. ఎంతో కృషి చేసి రాష్ర్టానికి బోయింగ్ కేంద్రాన్ని తేగలిగామని చెప్పారు. ఆదిభట్ల, శంషాబాద్‌లలో ఉన్న ఎయిరోస్పేస్‌లకు అదనంగా ఇబ్రహీంపట్నంలో కొత్త ఎయిరో స్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీరంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూరల్ టెక్నాలజీ పాలసీని తీసుకువచ్చామన్నారు.

బిల్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే దీనిపై ఐటీసీ కంపెనీతో చర్చలు జరిపామని తెలిపారు. గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కొన్ని రాయితీలు ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు. ఎగుమతులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో డ్రైపోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. వీటి కోసం రైల్వే, విమానాశ్రయం, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. భువనగిరి-చిట్యాల, జడ్చర్ల, జహీరాబాద్, ఆర్మూర్-జక్రాన్‌పల్లి సమీపంలో స్థలాలు గుర్తించామని, వీటిలో ఒకటి ఎంపిక చేసి కేంద్రానికి త్వరలోనే పంపుతామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్ట్లీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మ్యానుఫాక్చరింగ్ రాష్ర్టాల్లో తెలంగాణ చేరేలా, ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచేలా టాప్ టెన్ మొబైల్ ఫోన్ కంపెనీల్లో ఉన్న మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ వంటి సంస్థలకు స్థలాలు ఇచ్చామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై నోట్లరద్దు ప్రభావం తీవ్రంగానే పడినట్టు ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిరిసిల్లలోని చిన్న యూనిట్లు 20 వరకు మూతపడ్డాయని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రుణాల చెల్లింపునకు ఆరు నెలల సమయం ఇవ్వాలని ప్రధానమంత్రి, ఆర్‌బీఐ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. నంబర్1 కోసం ఎంతో కష్టపడ్డాం.. రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలని కేంద్రం ఈవోడీబీని ప్రవేశపెట్టింది. 2015-16లో మనకు 13వ ర్యాంక్ వచ్చింది. సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులందరూ బాధపడ్డారు. తరువాత 66 సమావేశాలు పెట్టి 26చట్టాలు సవరించాం. 58 జీవోలు, 12 సర్క్యూలర్లు జారీ చేశాం. 19 వెబ్ పోర్టల్స్ డెవలప్ చేశాం. 113 సేవలను ఆన్‌లైన్ చేశాం. ఫలితంగా ఈ సంవత్సరం మనం 98.78శాతంతో నంబర్‌వన్‌గా నిలిచాం.

మౌలిక సదుపాయాలు కల్పించాం.. పరిశ్రమలు పెట్టేవారికి శాంతిభద్రతలు, విద్యుత్, నీరు కావాలి. పోలీసులు శాంతిభద్రతలను పకడ్బందీగా కాపాడుతున్నారు. పరిశ్రమలకు కరెంటును మూడు షిప్టులకు ఇస్తున్నాం. మిషన్ భగీరథ కింద 10శాతం నీరు కేటాయించాం. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగానే దేశానికి తెలుసు. కానీ ఒక ఉద్యమకారుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

ఫార్మాసిటీకి 12వేల ఎకరాలు ఎందుకంటే.. హైదరాబాద్ ఫార్మా సిటీకి 12వేల ఎకరాలకు మించి సేకరించే పనిలో ఉన్నాం. ఎందుకంటే కేంద్రం నిబంధనల ప్రకారం 12వేల ఎకరాలు ఉంటే కేంద్రం దీన్ని నిమ్జ్‌గా గుర్తిస్తుంది. తద్వారా వివిధ ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో గాలి, నీరు కలుషితం కాని విధంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని 1545 పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు దశలవారీగా తరలిస్తాం. జహీరాబాద్ నిమ్జ్‌కు 2800 ఎకరాలు సేకరిం చాం. వరంగల్‌లో 2వేల ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మి స్తాం. ఫైబర్ టూ ఫ్యాబ్రిక్ వస్ర్తాలు అన్నీ ఇక్కడే తయారవుతాయి. ఇక్కడే టెక్స్‌టైల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. సంగారెడ్డి సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజేస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తు న్నాం. రావిరాల, మహేశ్వరంలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఏర్పా టు చేస్తున్నాం. మైక్రోమాక్స్, సెల్‌కాన్, డేటావిండ్ సంస్థలు ఉత్పత్తు లు ప్రారంభించాయి. మైక్రోమాక్స్ ఆర్‌ఎండీ సెంటర్ చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. జనగాంలో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఫర్నిచర్ పార్క్‌ను డెవలప్ చేయబోతున్నాం. తెలంగాణ మొత్తంగా 7ఆటో నగరాలను 30 ఎకరాల చొప్పున అభివృద్ధి చేస్తాం. రూరల్ ఇండస్ట్రియల్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తున్నాయి. సత్తుపల్లిలోని బుగ్గపాడులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాం. ఆలంపూర్‌లో మరొక్కటి నిర్మాణంలో ఉంది. నిజామాబాద్‌లో 40 ఎకరాల్లో స్పైస్ పార్క్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఆరు ఇండస్ట్రియల్ కారిడార్లను గుర్తించాం. మొదటి దశలో హైదరాబాద్-వరంగల్ చేపట్టాం.

ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్.. 2005-14 మధ్య కాలంలో తెలంగాణలో 13702 పరిశ్రమలు రూ.29183 కోట్లతో వచ్చాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 7379 వచ్చాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా 2929 వచ్చాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన వాటిలో 1100 సంస్థలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉంటే, మరో 400సంస్థలు ప్రారంభించే దశలో ఉన్నాయి. సిక్ ఇండస్ట్రీలను ఆదుకునేందుకు ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్‌ను ప్రవేశపెట్టబోతున్నాం.

2018 నాటికి ఫార్మా సిటీ మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్మా సిటీ ప్రాజెక్టులో మొదటి దశను 2018నాటికి అమలులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ తెలిపా రు. ఈ ప్రాజెక్టులో రూ.75వేల కోట్ల పెట్టుబడులు వస్తుండగా, మూడు లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

మావి ర్యాంకులు.. మీవి ట్యాగులు.. మనీ.. మ్యానుపులేషన్ అంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్ గారు తిప్పికొట్టారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా, ప్రగతిశీలంగా వ్యవహరిస్తున్నందు వల్లనే రాష్ర్టానికి అవార్డుల వచ్చాయన్నారు. కాంగ్రెస్ హయాంలో సీబీఐ కేసులను ప్రస్తావిస్తూ …మాకు నం1 ర్యాంకు వస్తే ..మీకు అవినీతిలో ఏ-1 ఏ-2 ట్యాగులు వచ్చాయి అని ఎద్దేవా చేశారు.

రాత్రికి రాత్రి విశ్వనగరాలు రావు.. అంతకుముందు అసెంబ్లీలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ విశ్వ నగరమనేది రాత్రికి రాత్రి (ఓవర్‌నైట్) ఏర్పాటు కాదని, ఏడెనిమిది సంవత్సరాల వ్యవధి అవసరమని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక చోదకశక్తిగా ఆయన అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి అవగాహనతోనే ప్రజలకు హామీలు ఇచ్చారని, ఆ మేరకే అంతా పని చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త తరలింపునకు రెండువేల వాహనాలు అందుబాటులోకి తెచ్చామని, 150 జిమ్స్, 152 క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్లాటర్‌హౌజ్‌లను ఆధునీకరించామని, ఆర్టీసీ వారు సూచించిన ప్రదేశాల్లో 50 బస్‌బేలను ఏర్పాటు చేశామని వివరించారు.. వంద ప్రజా టాయిలెట్లు, 13 మార్కెట్లు, 21 శ్మశానాలు పూర్తవగా, మరో 16 పురోగతిలో ఉన్నాయన్నారు.

అమెరికాలో టీఎస్ ఐపాస్ తరహా లేదు

నేడు యూఎస్ వెళ్లినప్పుడు కేపీఎంజీ సంస్థ గ్లోబల్ ఛైర్మన్ జాన్ వాయిమైర్‌తో భేటీ సందర్భంగా మా రాష్ట్రంలో సెల్ఫ్ డిక్లరేషన్ విధానం ఉంది. 15రోజుల్లో అనుమతులు ఇస్తాం. లేకుంటే అనుమతులు ఇచ్చినట్లుగానే భావించవచ్చు. ఏ అధికారి వల్లనైనా అనుమతులు జారీ కావడంలో ఆలస్యం అయితే అతనికి రోజుకు రూ.వెయ్యి రూపాయల ఫైన్ విధిస్తున్నాం. ఇటువంటి చట్టం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పాను. దానికి ఆయన ఇటువంటి చట్టం మీ దేశంలో కాదు… మా దేశంలో కూడా లేదని ప్రశంసించారు అని కేటీఆర్ గారు వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.