-కంటివైద్య శిబిరాల్లో జనజాతర -పదిరోజుల్లో 11,44,918 మందికి కంటిపరీక్షలు -బుధవారం ఒక్కరోజే 1,33,432 మందికి పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కంటివెలుగు వైద్య శిబిరాలు లక్షల మందికి చక్కటి కంటిచూపును ప్రసాదిస్తున్నాయి. ఈ శిబిరాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. ఉదయం నుంచే జనం తండోపతండాలుగా తరలివస్తుండటంతో కంటివైద్య పరీక్ష శిబిరాలు చాలాచోట్ల జాతరలను తలపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల్లో కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 11,44,918కి చేరింది. వీరిలో 2,24,376 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. మరో 3,02,520 మందిని ప్రత్యేక కంటిఅద్దాలకు ప్రతిపాదించారు. మొత్తం 1,16,236 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు ప్రతిపాదించగా.. 6,637 మందికి శస్త్రచికిత్సలు చేశారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్నవారిలో 3,69,348 మందికి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు. కాగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,33,432 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 24,781 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. మరో 28,376 మందికి ప్రత్యేక కంటి అద్దాలు.. 9,324 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు ప్రతిపాదించారు. 588 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. బుధవారం కంటిపరీక్షలు చేయించుకున్నవారిలో 47,257 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు.

చిన్నారుల్లో బయటపడుతున్న కంటి సమస్యలు హైదరాబాద్ నగరంలో కంటివెలుగు వైద్యశిబిరాలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. నగరంలో ఇప్పటివరకు నిర్వహించిన వైద్యశిబిరాల్లో 12 ఏండ్లలోపు పిల్లల్లో ఎక్కువగా కంటి సమస్యలు బయటపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో బుధవారం 28,864 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో ఆరువేలకుపైగా 12 ఏండ్లలోపు పిల్లలు ఉన్నట్లు తేలింది. వీరిలో ఎక్కువగా కండ్లనుంచి నీళ్లుకారడం, పుస్తకాల్లో అక్షరాలను సరిగ్గా చూడలేకపోవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం, తలనొప్పి, కండ్లలోమంట తదితర సమస్యలతో బాధపడుతున్నట్లు కంటిపరీక్షల్లో తేలింది. ఈ సమస్యలకు ఎక్కువగా టీవీ చూడటం, సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, వీడియోగేమ్స్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగించడం, పౌష్టికాహారలోపం కారణమని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరా బాద్‌లో 16,158 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 8,075 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.

జనగామలో విద్యార్థుల క్యూ కంటివెలుగు కార్యక్రమానికి జనగామ జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. విద్యార్థులు సైతం కంటి పరీక్షల కోసం క్యూ కడుతున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 3,176 మందికి పరీక్షలు నిర్వహించగా.. 481 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 177 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. జిల్లాలో పదిరోజుల్లో 25,888 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4,870 మందికి అద్దాలను అందించారు. 2,966 మందిని శస్త్రచికిత్సల కోసం రిఫర్ చేశారు. ఇప్పటివరకు జనగామలోని ఉడుముల దవాఖానలో 71 మందికి ఆపరేషన్లు పూర్తిచేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 20 గ్రామాల్లో పూర్తి సిద్దిపేట జిల్లాలో పదిరోజుల్లో 20 గ్రామాల్లో కంటిపరీక్షలు పూర్తిచేశారు. మొత్తం 33,478 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 5,365 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సల నిమిత్తం 3,099 మందిని రిఫర్ చేశారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 4,254 మందికి కంటిపరీక్షలు నిర్వహించి.. 587 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 179 మందిని శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో.. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 49,856 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో 11,219 మందికి కంటి అద్దాలు అందజేశారు. మరో 15,262 మందికి ప్రత్యేక కంటి అద్దాలు ప్రతిపాదించారు. మొత్తం 4,748 మందిని శస్త్రచికిత్సలకు రిఫర్ చేశారు.

మహబూబాబాద్‌లో జాతరలా.. హబూబాబాద్ జిల్లాలో కంటివెలుగు శిబిరాలు జాతరలను తలపిస్తున్నాయి. కంటివైద్య పరీక్షలు చేయించుకునేందుకు శిబిరాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. వృద్ధ్దులతోపాటు చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 36, 266 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4,458 మందికి కంటి అద్దాలు అందించారు. 5,678 మంది కంటిశుక్లాలు పెరుగుట, కార్నియా, గ్లకోమా, టెరీజియం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం 2,893 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, 649 మందికి కంటి అద్దాలను అందించారు. 232 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 22,598 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 5,062 మందికి కంటి అద్దాలు అందించారు. మొత్తం 1,540 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్‌చేశారు.
వరంగల్‌లో ఉత్సాహంగా.. రెడ్డికాలనీ(వరంగల్): కంటివెలుగు కార్యక్రమం వరంగల్ అర్బన్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. పదిరోజుల్లో 23 వైద్య శిబిరాల్లో 36,032 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 8,390 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు. మరో 11,806 మందికి ప్రత్యేక కంటి అద్దాలు ప్రతిపాదించారు. ఆపరేషన్లు, ఇతర సమస్యల నిర్ధారణ కోసం 4,242 మందిని రిఫర్‌చేశారు.
వరంగల్ రూరల్‌లో వరంగల్‌రూరల్ జిల్లాలో పదిరోజుల్లో 26,623 మందికి కంటిపరీక్షలను నిర్వహించగా.. 6,064 మందికి కంటి అద్దాలను పంపిణీచేశారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్నవారిలో కాటరాక్ట్‌తో 3,156 మంది, కాంప్లికేటెడ్ కాటరాక్ట్‌తో 81 మంది, కార్నియాతో 158 మంది బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.
భద్రాద్రిలో 79 మందికి శస్త్రచికిత్సలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 39,866 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు. 79 మందికి శస్త్రచికిత్సలు చేయించారు. 9,597 మందికి కంటి అద్దాలు అందజేశారు. 3,974 మందికి కంటిలో శుక్లాలు ఉన్నాయని గుర్తించారు. బుధవారం ఒక్కరోజే 3,980 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి.. 881 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 22,276 మందికి కంటిపరీక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటివెలుగు శిబిరాలకు విశేషస్పందన లభిస్తున్నది. బుధవారం 2,432 మందికి కంటిపరీక్షలు చేశారు. 459 మందికి కంటి అద్దాలు అందజేశారు. 98 మందిని ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు. జిల్లాలో పదిరోజుల్లో 22,276 మందికి పరీక్షలు నిర్వహించగా.. 5,277 మందికి అద్దాలు అందజేశారు. 1,694 మందిని కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం రిఫర్ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో జోరుగా.. పెద్దపల్లి జిల్లాలో కంటివైద్య పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం 3,146 మందికి కంటిపరీక్షలు చేసి.. 846 మందికి కంటి అద్దాలు అందజేశారు. 618 మందిని కాటరాక్ట్ ఆపరేషన్లకు రిఫర్ చేశారు. జిల్లావ్యాప్తంగా పదిరోజుల్లో 28,394 మందికి పరీక్షలు చేసి 6,893 మందికి కంటి అద్దాలను అందజేశారు.
జగిత్యాలలో జనసందోహం జగిత్యాల జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహించిన ప్రతిచోట జనసందోహం కనిపిస్తున్నది. జిల్లాలో బుధవారం 5,075 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,157 మందికి కంటి అద్దాలు అందించారు. మెరుగైన కంటి పరీక్షలు, ఆపరేషన్లు అవసరమున్న 137 మందిని ఇతర దవాఖానలకు రిఫర్‌చేశారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 46,972 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా.. 7,794 మందికి కంటి అద్దాలను అందజేశారు.
కరీంనగర్‌లో కిటకిట కరీంనగర్‌హెల్త్: కరీంనగర్ జిల్లాలో కంటివెలుగు శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. బుధవారం జిల్లాలో 4,225 మందిని పరీక్షించగా, 1,233 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 521 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్‌చేశారు. ఇప్పటివరకు జిల్లా లో 38,455 మందిని పరీక్షించగా.. 11,604 మందికి అద్దాలు అందజేశారు.
పేదలకు వరం దృష్టిలోపంతో బాధపడేవారికి కంటివెలుగు శిబిరం వరంలాంటింది. కంటి వైద్య శిబిరంలో కంటిపరీక్షలు చేయించుకున్నాక నా సమస్య తీరింది. అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు. – రత్నమాల, శ్రీనగర్ కాలనీ,సిద్ధిపేట జిల్లా
అద్దాలు ఇచ్చిండ్రు నాకు కండ్లు మంచిగ కనిపిస్తలేవ్. ప్రైవేట్ దవాఖానకు పోదామంటే, పైసలు ఉండాల్నాయే. దీంతో ఏడికి పోలే. సర్కార్ క్యాంపులో డాక్టర్లు మంచిగ చూసిన్రు. అద్దాలు, మందులు ఇచ్చిన్రు. పేదోండ్ల ప్రతి కష్టాన్ని కేసీఆర్ సార్ అర్థం చేసుకుంటున్నడు. -పాలక్క, రెబ్బెన
ప్రైవేట్ దవాఖానకు వెళ్ల్లే బాధలు తప్పాయి మా ఇంట్లో అందరం కంటి పరీక్షలు చేయించుకున్నాం. మసకగా ఉండే చూపు బాగుపడింది. ఇక మాకు ప్రైవేటు దవాఖానకు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. వైద్య శిబిరాలు ఉచితంగా ఏర్పాటుచేయడం హర్షణీయం. – ఎం. నర్సింహులు, రామవరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రూ. 30వేలు అయితయన్నరు చాలా రోజుల నుంచి నాకు చూపుతగ్గి కండ్లు నొప్పిలేస్తున్నయ్. దవాఖానలో చూపించుకుందామంటే రూ.30 వేల దాకా ఖర్చయితయని పక్కనోళ్లు బయపెట్టిండ్రు. ఇక్కడ డాక్టర్లు మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చిం డ్రు. – పోలోజు నర్సింహాచారి, సూర్యాపేట
దూరం పోవుడు దప్పింది కొన్ని రోజుల సంది కండ్లు మంచిగ కనిపిత్తలేవ్. కంటివెలుగు శిబిరంలో కంటి పరీక్ష చేపించుకున్న. డాక్టర్లు మంచిగ చూసిన్రు. అద్దాలు ఇచ్చిన్రు. దూరం పోవుడు దప్పింది. నాలాంటి పేదోళ్లకు ఇది మంచి అవకాశం. -అన్నమేని రవీందర్, పోత్గల్, ముస్తాబాద్ మండలం
రెండేండ్ల సంది నజరిస్తలేవు నాకు రెండేండ్ల సంది కండ్లు నజరిస్తలేవు. దవాఖానకుపోతే ఏమైతదో ఎన్ని పైసలైతయోనని భయంతో ఇన్నాండ్లు సప్పుడుజేక ఉన్న. ఈ రోజు మా ఉళ్లె డాక్టర్లు పరీక్షలు చేసి కండ్లు మసకగా ఉన్నాయని చెప్పిన్రు. ఉచితంగా అద్దాలు ఇచ్చిన్రు. ఏమైతదో అనుకున్న నా కండ్లకు కేసీఆర్‌సార్ ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలను అందించిండు. – దాసరి వెంకన్న, గోపాల్‌పూర్, మంథని
గౌర్నమెంటోళ్లే జీబుదోలిన్రు నాకు శానరోజుల సంది కంటిసూపు మందగించింది. పైసల్లేక దవాఖాన్లకు పోలేదు. ఇయ్యాల డాక్టర్లే మా వాడకు జీబుదోలిండ్రు. ఆ జీబులనే వచ్చి కండ్ల పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు అద్దాలు ఇచ్చిన్రు. అవి పెట్టుకున్నంక మసకలువోయినయ్. కేసీఆర్‌సారు దేవునోలె వచ్చిండు. -ఒజ్జల నర్సమ్మ, ధర్మపురి
ఒక్క కన్నుతో ఇబ్బంది ఉండె నేను సింగరేణిలో 15 ఏండ్ల కిందటనే రిటైరయిన. అప్పటినుంచి నాకు ఒకే కన్ను కనబడేది. డాక్టర్లకు చూపిస్తే కంటినరం దెబ్బతిన్నదని చెప్పిన్రు. ఆపరేషన్ చేయించుకోమన్నరు. నాకు వీలుకాక చేయించుకోలె. ఇప్పుడు కంటివెలుగు శిబిరంలో డాక్టర్లు నా కన్ను పరీక్షించి అద్దాలు ఇచ్చిన్రు. – దాసి మల్లేశం, విద్యానగర్, కరీంనగర్ జిల్లా
వృద్ధులకు గొప్పవరం కంటివెలుగు పథకం వృద్ధులకు గొప్ప వరం లాంటిది. సీఎం కేసీఆర్‌సార్ మాలాంటివాళ్లకు కష్టం రాకుండా చూసే పెద్ద కొడుకసంటోడు. ఇదే పరీక్షలకు ప్రైవేట్ దవాఖానకుపోతే వేలకువేలు గుంజేటోళ్లు. – డీ లక్ష్మి, పాత మంచిర్యాల
కేసీఆర్ మాపాలిట దేవుడు నాకు చూపు మందగించి మూడేండ్లు అయ్యింది. దవాఖానలో చూపించుకోనీకే పైసలులేవు. ఇప్పుడు సీఎం కేసీఆర్ దయతో కండ్లద్దాలు ఇచ్చిండ్రు, ఇప్పుడు చూపు బాగా కనిపిస్తున్నది. – బెల్లరి బాలస్వామి, పెంట్లవెల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా