-యుద్ధప్రాతిపదికన పనులు -ప్రభుత్వానికి ఈ పథకం అత్యంత ప్రాధాన్యం -నాణ్యత విషయంలో రాజీపడొద్దు.. -పైపులు తెలంగాణలో తయారుకావాలి..అందుకు కంపెనీలను ఒప్పించాలి -వాటర్ గ్రిడ్ సమీక్షలో సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గ్రిడ్ సర్వే పనులకోసం రూ.105 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సర్వే పనులను త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు, గ్రిడ్ పనులను ఒకేసారి సమాంతరంగా ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకంపై అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే పనులను ప్రారంభించడానికి అవసరమయ్యే రూ.105 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించే ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యంగల అంశమని సీఎం స్పష్టం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పాలేరు, కిన్నెరసాని, వైరా, రామప్ప, ఎల్‌ఎండీ, కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, గడ్డెన్న, నిజాంసాగర్, మంజీర తదితర ప్రాజెక్టులనుంచి నీటిని తీసుకొని పైప్‌లైన్లద్వారా రాష్ట్రంలోని 25వేల జనావాస ప్రాంతాలకు మంచినీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
1.32 లక్షల కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు అవసరమైనందున ఇప్పుడే ఏ రకం పైపులు, ఎంత కావాలి? అనే అంశాలపై అంచనాలు రూపొందించి, టెండర్లు పిలిచి, పనులకు ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. పైపులు కూడా తెలంగాణలోనే తయారయ్యేలా కంపెనీలను ఒప్పించాలని చెప్పారు. దీనివల్ల పైపులను నిర్దేశిత ప్రాంతాలకురవాణా చేయడం సులువు అవడమే కాకుండా.. రాష్ట్రం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో పైపుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహాయ, సహకారాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. పైపులను గ్రామాలకు తరలిస్తూనే మరోవైపు ఎక్కడికక్కడ కరెంట్ మోటార్లను బిగించాలని చెప్పారు. గ్రిడ్ పనులకోసం ఎంత విద్యుత్ అవసరమో ఆ మేరకు ప్రతిపాదనలను విద్యుత్‌శాఖకు పంపాలని అధికారులకు సూచించారు. సబ్‌స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఇన్‌టేక్‌వద్ద, నీటిని శుద్ధిచేసే ప్లాంట్లవద్ద సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో 10శాతం నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున నీటిపారుదలశాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
గ్రిడ్‌కోసం నిర్మించే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుల బాధ్యతలుకూడా నీటిపారుదలశాఖకు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వేలకోట్ల వ్యయంతో, చరిత్రలో నిలిచిపోయేలా గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నందున నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి అధికారులకు విస్పష్టంగా చెప్పారు. నాణ్యత పరిశీలనకోసం సీఈ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని అధికారులకు సూచించారు. పైపులైన్లు, మోటార్లు, ఇతర సామాగ్రి కొనుగోలునుంచి పనితీరు వరకు ప్రతి ప్రక్రియలో నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పైపులు, మోటార్లు కొనుగోలుకు చేయడానికి నాణ్యతాప్రమాణాలు పాటించే కంపెనీలను సంప్రదించాలని చెప్పారు.
గ్రిడ్ నిర్మాణంనుంచి నిర్వహణవరకు అన్ని బాధ్యతలు గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ (ఆర్‌డబ్ల్యూఎస్)అధికారులే చూసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పైపులైన్లు, ట్యాంకులు, ఇతర వసతులను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రాజెక్టులు, నీటి వనరుల్లో నీటిలభ్యత ఉన్నప్పుడు అక్కడినుంచి నీటిని తోడి, మరోచోట నిలువ చేయాలని చెప్పారు. దీనివల్ల ప్రాజెక్టుల్లో నీరు ఎండిపోయినా మంచినీటికి ఢోకా ఉండదని అన్నారు. రాష్ట్రం కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్నందున రెండు నదుల నీళ్లను వాడుకోవాలని చెప్పారు.
వరద కాలువల ద్వారా ఎప్పటికప్పుడు చెరువులు నింపుకోవాలని సూచించారు. ఎత్తిపోతలద్వారా మొత్తం పథకాన్ని నిర్వహించవద్దని, ఎక్కువశాతం నీటిని ఎత్తైన కొండలకు ఎక్కించి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గ్రామాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షాసమావేశంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ కార్యదర్శులు నాగిరెడ్డి, రేమండ్ పీటర్, నర్సింగ్‌రావు, ప్రదీప్ చంద్ర, ఈఎన్‌సీ సురేందరరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.