-సంక్షేమం, అభివృద్ధి సర్కార్‌కు రెండు కండ్లు: మంత్రి పోచారం
వచ్చే ఏడాదిలోగా 10 లక్షల లీటర్ల పాలతో మెగా డెయిరీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మెగా డెయిరీ ఏర్పాటుకు రూ. 245 కోట్లు ఖర్చు అవువుతుందని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
ఉద్యానశాఖ శిక్షణ కేంద్ర కార్యాలయంలో మంత్రి పోచారం విలేకరులతో మాట్లాడుతూ ఐదు లక్షల లీటర్ల సామర్ధ్యం గల విజయ డెయిరీకి తెలంగాణ నుంచి కేవలం 90 వేల లీటర్ల పాలు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. పశువుల దాణా, గడ్డి విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. ఒక్కో పాడిపశువుకు రూ.40 నుంచి రూ.45వేల వరకు రుణం ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని 96 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి రెండు బర్రెల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలకు తగ్గకుండా పాడి పశువుల కోసం ఖర్చు చేస్తామన్నారు.
పాడి, పంట, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లతో సమానమని చెప్పారు. గత ప్రభుత్వాలు వ్యవసాయానికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో ఈ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతుల ఆత్మహత్యలకు పదేండ్లు పరిపాలించిన కాంగ్రెస్, 9ఏండ్లు పాలించిన టీడీపీదే భాద్యతన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వెల్లడించనున్నదని చెప్పారు. గొర్రెలు,మేకల పెంపకానికి ప్రతి జిల్లాకు రూ. 50కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకానికి రూ.60 వేలు రుణం ఇస్తామని, ఇందులో రూ.20వేలు సబ్సిడీ అని చెప్పారు. బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం పురోగతిని సూచిస్తున్నదని చెప్పారు.