Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సింగరేణి మన కొంగు బంగారం

దేశానికే తలమానికం.. యువతకు ఉద్యోగాలు అధికం

సమైక్య పాలనలో సింగరేణి కీర్తి తగ్గింది.. ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్సింగరేణిపై శాసనసభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్2009-2014 మధ్య ఐదేండ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1066 కోట్లు. కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని భావించి, దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా లాభాల్లో 23 శాతం వాటాను కార్మికులకు ప్రభుత్వం చెల్లించింది. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపుటంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ దేశ రక్షణకోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనేది సత్యం.

kcr

సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమని, దేశానికే తలమానికమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ సంస్థ వల్ల యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సింగరేణి సంస్థపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంస్థపై అధికార, ప్రతిపక్ష సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. గతంలో సింగరేణి సంస్థలో 1.16 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారని, సమైక్యపాలనలో ఆ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల సింగరేణి కీర్తి తగ్గిందని చెప్పారు. గత పాలనలో సింగరేణి కార్మికుడు చనిపోతే కేవలం రూ.7 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చేవారని విమర్శించారు. ఇప్పుడు ఈ సంస్థలో ఎవరైనా కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు మొత్తం రూ.48.50 లక్షల పరిహారం చెల్లిస్తున్నామ ని స్పష్టం చేశారు.

వివరాలు ఆయన మాటల్లోనే.. సింగరేణి సంస్థ తెలంగాణ కొంగుబంగారం. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే సంస్థ. గతంలో 1.16 లక్షల మంది ఉద్యోగస్థులు ఆ సంస్థలో పనిచేసేవారు. సమైక్య పాలకులు ఈ సం స్థను నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా సింగరేణి సంస్థ కీర్తి తగ్గింది. ఈ సంస్థపై చర్చ పెడితే 15 మంది అధికార, ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. అంటే ఈ సంస్థపై వారికున్న ప్రేమ, గౌరవం, అభిమానం ఏమిటో అర్థమైంది. సమైక్య పాలకులు తెలంగాణలో అనేకం ధ్వంసం చేశారు. అందులో సింగరేణి ఒకటి. విదేశాల నుంచి రకరకాల మిషన్లు తెచ్చారు. అవి సరిగా పనిచేయలేదు. దీంతో ఆ సంస్థ వైభవం కోల్పోయింది. తెలంగాణలో ఉన్న సర్‌సిల్క్ సంస్థ కూడా పోయింది. దానిలో ఐదారువందల మంది ఉద్యోగులు ఇంకా ఉన్నారు. దానిని తెరిపించాలని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనేకసార్లు నా దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కేంద్రంలో ఫర్టిలైజర్ కంపెనీ (ఎఫ్‌సీఐ) సంస్థ కూడా పోయింది. రామగుండం వైభవాన్ని సమైక్య పాలకులు ధ్వంసం చేశారు. అలాంటిదే ఐడీపీఎల్ కూడా పోయింది. ఎఫ్‌సీఐ గురించి ప్రధానమంత్రితో చర్చించాను.

తిరిగి ఆ సంస్థను ప్రారంభించడానికి సానుకూలత వ్యక్తం చేశారు. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. సమైక్య పాలకులు అక్రమాలు చేసి సింగరేణిని కూడా ధ్వంసం చేశారు. ఈ విధంగా సింగరేణి, ఆర్టీసీ, డిస్కం (ఎలక్ట్రిసిటీ బోర్డు)లను ధ్వంసం చేసి భయంకరమైన పరిస్థితులు సృష్టించారు. సింగరేణి భూగర్భ గనులపై కొంతమంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దానివల్ల లాభం లేదని, నష్టాలు వస్తాయని అంటున్నారు. కాని ఉద్యోగాలు, కార్మికుల కోసం అండర్‌గ్రౌండ్ మైన్లను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చనిపోయినవారి కుటుంబాలకు రూ.48.50 లక్షల పరిహారం సింగరేణి కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబీకులకు రూ.36 లక్షల పరిహారం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ వారసత్వ ఉద్యోగం లేకపోతే.. అదనంగా మరో రూ.12.50 లక్షలు చెల్లిస్తాం. సహజ మరణం పొందిన కార్మికుడికి కూడా మొత్తం రూ.38 లక్షల పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

కొత్తగా 11 భూగర్భ మైన్లు ప్రారంభిస్తాం రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు రావాలి. అందుకోసం కొత్తగా 11 భూగర్భ మైన్లను ప్రారంభిస్తాం. అందులో భాగంగా సింగరేణి సంస్థలో కొత్తగా 11,600 ఉద్యోగాలు కల్పించబోతున్నాం. వారసత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచుతున్నాం. సింగరేణిలో బకాయిలు రాబట్టడం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడాను.

త్వరలో మైనింగ్ టూరిజం కొత్తగూడెం, ఇల్లందులోని అనువైన ప్రాంతంలో కొత్తగా మైనింగ్ టూరిజాన్ని ఏర్పాటు చేయనున్నాం. అందుకు చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలు తెలుసుకోవడం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేయాలి. సింగరేణి కార్మికుల కోసం 500 పడకలతో సూపర్, మల్టీ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభించడానికి చర్యలు చేపట్టాం. వచ్చే బడ్జెట్‌లో మీరు శుభవార్త వింటారు. దానిని నేనే ప్రకటిస్తాను. గతంలో సింగరేణిలో కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం. ఇందూ ప్రాజెక్టువల్ల రూ.50కోట్లు నష్టం వచ్చింది. తిరిగి రాబడుతున్నాం. ఎవరైనా అక్రమాలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సింగరేణి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చాలా మంచి సంస్థ. ఈ సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం రైతుల నుంచి భూసేకరణ జరిగింది. వారికి తగిన పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంతమంది అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. వారికి పట్టాలు ఇప్పిస్తాం. మరికొంత మందికి ఇండ్ల స్థలాలు కేటాయించడానికి చర్యలు చేపడతాం. సింగరేణి సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

(అసెంబ్లీలో గురువారం సింగరేణిపై స్వల్పకాలిక చర్చకు ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంస్థ గురించి వివరాలతో ప్రకటన చేశారు. అసెంబ్లీలో ప్రకటనను స్వయంగా సీఎం చదువగా, శాసనమండలిలో ఆ ప్రకటనను మంత్రి జగదీశ్‌రెడ్డి సభ్యులకు చదివి వినిపించారు. సింగరేణి సంస్థపై సీఎం కేసీఆర్ ప్రకటన పాఠం ఆయన మాటల్లోనే..)

తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేల మంది కార్మికుల శ్రమ. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది. వారి కుటుంబాల్లో ఎన్నడూ లేనంత సంతోషం నింపింది. నల్లబంగారంగా భావించే అపారమైన బొగ్గు నిల్వలు రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో అపారంగా విస్తరించి ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ , పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ, వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. తెలంగాణ నేలగర్భంలో 10,528 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. మరో శతాబ్దకాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భంలోంచి బొగ్గును తవ్వితీస్తున్నారు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపుటంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ దేశ రక్షణకోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనేది సత్యం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటిలేనిది.

మన రాష్టానికి గర్వకారణం దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ర్టానికి గర్వకారణం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి. ప్రతీ సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో 78.71 శాతం బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. రాష్ర్టానికి దేశానికి సింగరేణి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది. ఇంకా, స్పాంజ్ ఐరన్, సిమెంట్, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కూడా సింగరేణి సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం సింగరేణిలో 46 గనులుండగా, అందులో 30 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్టు గనులున్నాయి.

నష్టమైనా భూగర్భగనులు కొనసాగాల్సిందే సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2015-16లో మొత్తం ఉత్పత్తి 600 లక్షల టన్నులు కాగా దీనిలో ఓపెన్ కాస్టు గనుల నుంచి 497 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుంచి 106 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. అంటే 61 శాతం మంది పనిచేస్తున్న భూగర్భ గనుల్లో 17 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే, 18 శాతం కార్మికులు పనిచేస్తున్న ఓపెన్ కాస్టుల ద్వారా 82 శాతం బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. భూగర్భ గనుల్లో టన్ను బొగ్గుకోసం అయ్యే ఉత్పత్తి వ్యయం 4,118 రూపాయలు కాగా అమ్మకం ధర 2360 రూపాయలు. అంటే ఒక్కో టన్నుకు 1758 రూపాయల నష్టాన్ని సంస్థ భరించాల్సి వస్తున్నది. ఓపెన్ కాస్టు గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 1204 రూపాయలు. అమ్మకం ధర 2008 రూపాయలు. ప్రతీ టన్నుపైన 804 రూపాయలు లాభం వస్తున్నది.

2015-16 సంవత్సరంలో భూగర్భ గనుల వల్ల 1869 కోట్ల నష్టం రాగా, ఓపెన్ కాస్టు గనుల ద్వారా 3998 కోట్ల లాభం వచ్చింది. ఇదేవిధంగా గత ఆరు సంవత్సరాలలో భూగర్భ గనుల ద్వారా కలిగిన నష్టం 8118 కోట్లు కాగా, ఓపెన్ కాస్టు గనుల ద్వారా వచ్చిన లాభం 12469 కోట్లు. భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్టుల లాభాలతో పూడుస్తూ సంస్థ ముందుకుపోతున్నది. కార్మికులు, అధికారులు సమన్వయంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పు వల్ల 2015-16లో 600 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి, 15శాతం వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. కోల్ ఇండియా, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకన్నా ముందున్నది.

మూడు శాతం వృద్ధి నుంచి 15 శాతానికి.. 2009-2014 మధ్య ఐదేండ్ల కాలంలో సగటున 3 శాతం మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 శాతం వృద్ధి రేటును సాధించడం గమనార్హం. 2009-2014 మధ్య ఐదేండ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1066 కోట్లు. కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇటు సింగరేణి చరిత్రలోగానీ, అటు దేశ చరిత్రలోగానీ ఎన్నడూలేని విధంగా లాభాల్లో 23 శాతం వాటాను, అంటే 245 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాము. దీపావళి బోనస్ కింద ప్రతీ కార్మికుడికి సగటున 54వేల రూపాయలు చొప్పున మొత్తం 303 కోట్ల రూపాయలు చెల్లించాం.

డిపెండెంట్ ఉద్యోగాలు.. భారీ పరిహారాలు సింగరేణి కార్మికులకు ఎంతోకాలంగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల హక్కును 1998లో అప్పటి ప్రభుత్వం రద్దుచేసింది. హక్కును పునరుద్ధరించాలంటూ కార్మికులు గత 18 ఏండ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. మేము అధికారంలోకి వస్తే డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరించాం. వారసులకు ఉద్యోగం వద్దనుకున్నప్పుడు కార్మికుడికి ఇచ్చే పరిహారాన్ని ఐదు లక్షల నుంచి 12 లక్షల 50 వేలకు పెంచాం.

గని ప్రమాదంలో కార్మికులు మరణిస్తే గత ప్రభుత్వాలు కేవలం 7 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేవి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచాం. సంస్థ కాంట్రిబ్యూషన్ కింద 10 లక్షల రూపాయలు, కార్మికుల కాంట్రిబ్యూషన్ కింద మరో పది లక్షలు, ఎక్స్ గ్రేషియా ఐదు లక్షలు.. మొత్తం 25 లక్షల రూపాయలు కార్మికుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాగా అందజేస్తున్నాం. కార్మికుడు ఉద్యోగంలో ఉండగా సహజ మరణం చెందితే, ఇచ్చే పరిహారం గతంలో కేవలం లక్షా 50 వేల రూపాయలు. ఇప్పుడు 15 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఈ విధంగా మెరుగైన పరిహారం ఇచ్చే పద్ధతి దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీలో లేదు.

భద్రత చర్యలు.. సకల సౌకర్యాలు కార్మికులకు పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నది. కార్మికులు గతంలో బరువైన క్యాప్ ల్యాంపులు ధరించి గనిలోకి దిగేవారు. కార్మికులకు ఈ కష్టం తప్పించేందుకు వీటిస్థానంలో లక్షల రూపాయలు వెచ్చించి కేవలం 400 గ్రాముల బరువుండే క్యాప్ ల్యాంపులు అందజేశాము. భూగర్భ గనిలోకి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడా అవసరం లేకుండా ప్రతీ గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. సింగరేణి కొత్త రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, స్విమ్మింగ్ పూళ్లు, వ్యాయామశాలలు ఏర్పాటు చేసింది.

విస్తృతాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక తెలంగాణ గర్వించే సింగరేణి సంస్థను మరింత విస్తృతపరిచేందుకు, పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. వచ్చే ఐదేండ్ల కాలంలో 20 ఓపెన్ కాస్టు గనులు, 11 భూగర్భ గనులు కొత్తగా ప్రారంభించబోతున్నదని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం 600 లక్షల టన్నులున్న బొగ్గు ఉత్పత్తిని 2020-21 నాటికి 900 లక్షల టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకున్నది. కొత్తగా 11,621 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి ఇతర రాష్ర్టాలకు, దేశాలకు విస్తరించేందుకు కార్యాచరణకు దిగింది. ఇప్పటికే కేంద్రం కేటాయించిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో పని ప్రారంభించింది. విదేశాల్లో కూడా కార్యకలాపాలు విస్తరించడం కోసం సింగరేణి ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా తదితర దేశాల్లో బొగ్గు వ్యాపారానికి ఉన్న అవకాశాలను సింగరేణి అధికారులు పరిశీలించారు. సింగరేణితో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 13 కంపెనీలు ఆసక్తి చూపాయి.

విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ.. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ సింగరేణి అడుగుపెట్టింది. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును నిర్మించింది. త్వరలోనే సింగరేణి సంస్థ మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నది. బొగ్గు, విద్యుత్తు రెండింటినీ సింగరేణి ఉత్పత్తి చేయడం వల్ల కరెంటు ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నది. తెలంగాణ డిస్కమ్‌లకు కూడా ప్రయోజనం కలుగుతున్నది. యాజమాన్యం, కార్మికులు అనే విభజనకు అతీతంగా, సింగరేణి అంతా ఒకే కుటుంబంగా భావించి ఉత్పత్తిలో పాలుపంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మా పిలుపును ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు సానుకూలంగా తీసుకుని ప్రతిస్పందించారు. చేయి చేయి కలిపి సింగరేణిని ప్రగతిపథంలో నిలిపేందుకు పరిశ్రమిస్తున్నారు.

అందరూ ఒకటే అనే భావన కలిగేందుకు వీలుగా కార్మికులు, అధికారులు ఒకే యూనిఫాం ధరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మె కాలానికి వేతనం, లాభాల్లో పెద్ద వాటా, బోనస్, ఎక్స్‌గ్రేషియా పెంపు, డిపెండెంట్ ఉద్యోగాల హక్కు పునరుద్ధరణ లాంటి చర్యలు సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వం పట్ల ఎనలేని విశ్వాసం పెంచాయి. ఈ సందర్భంగా బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు నల్లబంగారాన్ని వెలికితీస్తూ గొప్ప సంపదను సృష్టిస్తున్న కార్మికలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓపెన్ కాస్ట్, భూగర్భ గనులు రెండూ ఉంటాయి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.