Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రైతు రాజ్యం.. ‘పాలమూరు’ నీళ్లు పారిచ్చి తీరుతం

-85% ప్రాజెక్టు పూర్తి.. ఆగస్టులో నీళ్లు నింపుతం
-ప్రాజెక్టు ఆలస్యం కాంగ్రెస్‌ నాయకుల పుణ్యమే
-కాళేశ్వరంతో పాటే ఇది కూడా పూర్తయ్యేది
-సుప్రీంకోర్టు నుంచి స్టేలు తెచ్చి పనులు ఆపిన్రు
-కృష్ణా నుంచి కాకపోతే గోదావరి నీళ్లు పారిస్తా
-మళ్లీ మనమే గెలుస్తున్నాం.. అందులో డౌటే లేదు
-వచ్చే టర్మ్‌లో మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి
-రాబోయే 3, 4 నెలల్లో మీరంతా మార్పు చూస్తరు
-కందుకూరు మండలం దాకా మెట్రోను విస్తరిస్తం
-రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు బహిరంగసభలో కేసీఆర్‌
-హరితోత్సవంలో మొక్కలు నాటిన ముఖ్యమంత్రి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్దతు ధర కోసం రైతుల ఆందోళనలు. రోడ్డెక్కుతున్న అన్నదాతలు. మహారాష్ట్రలో ఉల్లిరైతులు, హర్యానాలో పొద్దుతిరుగుడు రైతులు.. ఇలా పలు రాష్ట్రాల రైతులు పంట పండించటానికి, పండిన పంట అమ్ముకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. సాగునీటికి కటకట.. కరెంటు కష్టాలు..దళారుల మోసాలు.. ప్రభుత్వాల అలసత్వం..వెరసి భారతీయ రైతు దగాపడుతున్నాడు. ఒక్క తెలంగాణలో తప్ప.

పంట పెట్టుబడి కోసం ఏడాదికి రెండు విడతలుగా రైతుబంధు, పంట సమృద్ధిగా పండటానికి సరిపడా సాగునీరు, పొలానికి నీరు పారించటానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు. పైరు ఏపుగా పెరగటానికి అవసరమైన ఎరువులు.. ఇలా ఒకటేమిటి అన్నదాత అవసరాలన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వరి సాగులో నంబర్‌ వన్‌గా ఉన్న పంజాబ్‌ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది తెలంగాణ. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా త్వరలో ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభించనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

తరాలుగా పరిష్కారానికి నోచుకోని పోడు భూములకు పట్టాలివ్వటమే కాదు.. ఈ వానకాలం నుంచి పోడుభూములకు కూడా రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి దోహద పడేలా.. ప్రపంచమే అబ్బుర పడేలా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం… అలాంటి మరో భారీ ప్రాజెక్టు పాలమూరు- రంగారెడ్డిని కూడా అతి త్వరలో పూర్తి చేయనున్నది. ఆరునూరైనా.. ఎవరు అడ్డుపడినా, గోదావరి నీటిని మళ్లించైనా ప్రాజెక్టును పూర్తి చేసే కృతనిశ్చయంతో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండగ అన్న స్థితి నుంచి కేవలం తొమ్మిదేండ్లలో వ్యవసాయం పండుగ అనేలా చేశారు సీఎం కేసీఆర్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం మొత్తమ్మీద రైతు రాజ్యం అంటే ఒక్క తెలంగాణే అనేలా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఆయన దార్శనికత, ఆయన కార్యదక్షత, ఆయన మార్గనిర్దేశనం వెరసి తెలంగాణలో రైతేరాజు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల దాదాపు 85 శాతం పూర్తయిందని, ఆగస్టులో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లు నింపుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టులో కేసులు వేయటంతోనే ప్రాజెక్టు ఆలస్యమవుతున్నదని, కృష్ణా నుంచి కాకపోతే గోదావరి నీళ్లు పారిస్తానని భరోసా ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే పాలమూరు పూర్తి కావాల్సిందని, పుణ్యాత్ములు కాంగ్రెసోళ్ల వల్లే ఆలస్యమైందని తెలిపారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టేలు తెచ్చి పనులు ఆపి పుణ్యం కట్టుకున్న నాయకులని మండిపడ్డారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే వద్దని ఆపుతరు.. అదీ వాళ్ల రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల రిజర్వాయర్లన్నీ కట్టామని, ఆగస్టులో నింపుకోబోతున్నామని తెలిపారు. ‘దాసర్లపల్లి దగ్గర నా మిత్రుడు గణేశ్‌కు పొలం ఉండేది. అక్కడికి రమ్మంటేపోయిన. అక్కడ 10-15 ఎకరాలుంటే ఇరవై బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగ పోస్తే ఆ బోర్లన్నీ ఒక్క కాడికి తెచ్చి కుండీల పెట్టినరు. ఆ బాధలన్నీ వర్ణనాతీతం. తెలంగాణలో ఇలాంటి బాధలన్నీ దాదాపుగా తీరినయి. సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. వీళ్లకు మించి ఎంపీ రంజిత్‌రెడ్డి.. మాట్లాడితే, కనిపిస్తే మాకు నీళ్లు అంటరు. పాలమూరు ఎత్తిపోతల ఎప్పుడయితది? మాకు నీళ్లు ఎప్పుడొస్తయి? అని పంచాయితీ పెడత రు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. మీ బిడ్డగా నేను హామీ ఇస్తున్నా. వంద శాతం నీళ్లు తీసుకువస్తా’ అని సీఎం తెలిపారు.

కృష్ణా.. కాకపోతే గోదావరి
రంగారెడ్డి జిల్లాలో కృష్ణాజలాలు సాధ్యం కాకపోతే గోదావరి జలాలను పారిస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్‌కు పోయే మంచి నీళ్ల పైపు లైన్ల నుంచి నాకు కొన్ని నీళ్లు ఇప్పిస్తే ఇబ్రహీంపట్నం చెరువు నింపుకుంటమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నన్ను బతిమిలాడినరు. రైతు బిడ్డ అయినందున చెరువు ఎండితే చూడలేక బాధపడ్డరు. ఎంత బాధ, ఎంత కరువు ఉంటే ఎమ్మె ల్యే అంత బాధపడతరు. మీరేం చింత చేయొ ద్దు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో మా ర్పు చూస్తరు. కాల్వల తవ్వకం కూడా మొదలవుతుంది. టెండర్లు అవుతున్నయి. కృష్ణా నదిలో నీళ్ల కోసం కొంత పంచాయితీ ఉన్నది. కానీ గోదావరిలో ఎలాంటి పంచాయితీ లేదు. కొద్దిరోజుల్లో గోదావరి నీళ్లు గండిపేట, హిమాయత్‌సాగర్‌కు లింకయిపోతున్నయి. అక్కడ చిన్న లిఫ్టు పెట్టినా ఈ ప్రాంతాలకు బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఘట్‌కేసర్‌ మీదుగా గోదావరి నీళ్లను మూసీ దాటిస్తే కూడా ఈ ప్రాంతానికి లోయపల్లి దాకా నీళ్లు వస్తయి. అది కూడా పరిశీలన చేస్తున్నరు. ఏదో ఒక విధంగా ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్త అని హామీ ఇస్తున్నా. దాని గురించి ఏమాత్రం చింత అవసరం లేదు’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

మూడోసారీ గెలుపు మనదే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘మళ్లీ మనమే గెలుస్తున్నం. ఇందులో డౌటే లేదు. వచ్చే టర్మ్‌లో మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు కొనసాగించుకుందాం’ అని తెలిపారు. ‘ఒక ఇటుక మీద మరో ఇటుక పేర్చినట్టు ఒక్కో సమస్యను అడ్రస్‌ చేసుకుంటూ పోతున్నం. పేదలను అదుకుంటున్నం. గతంలో చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. మీ ఊర్లల్లనే, మీ కండ్ల ముందే ఇవి జరుగుతున్నయి. ఇటీవల మంచిర్యాల సభలో దివ్యాంగ సోదరులను ఎవరూ ఆదుకోలేదని, వాళ్లకిచ్చే రూ.3,016 పింఛనుకు అదనంగా రూ.వెయ్యి పెంచినం. అట్ల ఎన్నో పథకాలు ప్రతి వాళ్లకు అవసరమయ్యేవి పెట్టుకున్నం. గురుకుల పాఠశాలలు పెట్టి, వాటిని జూనియర్‌ కాలేజీలు కూడా చేసుకున్నం. ఇవన్నీ ఒక కులానికో, మతానికో సంబంధించినవి కాదు. గొర్రెల పంపిణీ చేసుకుంటున్నం. చేపపిల్లల్ని ఇచ్చి మత్స్యకారులను ఆదుకుంటున్నం. ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ కడుపులో పెట్టుకొని ఆదుకుంటున్నం’ అని కేసీఆర్‌ వెల్లడించారు.

తెలంగాణ ప్రజలు నంబర్‌ వన్‌
తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుస్తుందంటే తెలంగాణ ప్రజలు నంబర్‌ వన్‌ అని సీఎం అన్నారు. ‘ఆర్థిక పరపతిలో, విద్యుత్తు వినియోగంలో, తలసరి ఆదాయంలో, అత్యధిక ధాన్యపు రాసులు పండించడంలో, 24 గంటల విద్యుత్తు సరఫరా, ఇంటింటికీ నల్లాతో మంచినీళ్లు ఇవ్వ డం, వంద శాతం ఓడీఎఫ్‌ సాధించడంలో తెలంగాణ నంబర్‌ వన్‌’ అని చెప్పారు. ఈ నంబర్‌ వన్‌ అంటే తెలంగాణ ప్రజలు అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

మనల్ని అవహేళన చేసినవాళ్లు 7వ స్థానంలో..
‘మీకు వ్యవసాయం చేయరాదు. అన్నం తినడం కూడా మేమే నేర్పినం’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో అవహేళన చేసిన వాళ్లు ఈ రోజు 15 లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తే, తెలంగాణ ఏకంగా 56 లక్షల ఎకరాల్లో వడ్లు పండించింది. మనల్ని ఎక్కిరించినోళ్లు వడ్లు పండించటంలో ఏడో స్థానానికి పడిపోతే, తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఎక్కిరించినోళ్లు మన సమీపంలో కూడా లేరు. -సీఎం కేసీఆర్‌

మహేశ్వరం నియోజకవర్గంపై వరాల జల్లు
ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరిన పలు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డ అడిగినందున ఆ కోరికలు తీర్చవల్సిందేనని అన్నారు. ‘నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ కావాలన్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది వాళ్ల ఇష్టం. తప్పకుండా మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తం. తుమ్మలూరులో చాలావిల్లాలు వచ్చినందున కరెంటు సమ స్య వస్తున్నది. సబ్‌స్టేషన్‌ అవసరమన్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా చెప్పారు. కచ్చితంగా మంజూరు చేస్తున్న. మెట్రోను మహేశ్వరం దాకా పొడగించాలని కోరారు. న్యాయమైన కోరిక. మెట్రో విషయంలో ఏ నగరంలో చేయని తప్పు మన రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగింది. విమానాశ్రయానికి కచ్చితంగా మెట్రోను ఏర్పాటు చేస్తరు. కానీ గతంలో ప్రబుద్ధులు పెట్టలేదు. మొన్న నే విమానాశ్రయం వరకు మెట్రో కోసం రూ.6 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. శంషాబాద్‌ వరకు మెట్రో వస్తుంది. అక్కడి నుంచి మహేశ్వరం వరకు తీసుకురావడం చాలా సులభం. బీహెచ్‌ఈఎల్‌తో పాటు మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో తీసుకువచ్చేందుకు వంద శాతం ప్రయత్నం చేస్తా. తుమ్మలూరుకు రూ.కోటితో కమ్యూనిటీ హాల్‌ మంజూరు. దానికి దశాబ్ది కమ్యూనిటీ హాల్‌ అని పేరు పెడితే సార్థకం అవుతుంది. నియోజకవర్గంలోని 65 గ్రామపంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున స్పెషల్‌ ఫండ్‌. జజ్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లకు చెరో రూ.50 కోట్లు మంజూరుచేస్తున్నం’ అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.