మోదీ.. తెలంగాణకు ఏం ఇస్తరు.. ఏదో ఒక శుభవార్తతోనే ఇక్కడ అడుగుపెట్టాలి
-9 ఏండ్లుగా రాష్ట్రాన్ని సతాయిస్తూనే ఉన్నరు
-తెలంగాణ అభివృద్ధికి అడ్డు పడుతూనే ఉన్నరు
-ప్రధానికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్
-ఈసారైనా ఇచ్చేదేమన్నా ఉందా?
-మోదీజీ.. శుభవార్తతోనే రాష్ర్టానికి రండి
-అభివృద్ధికి సహకరించకుండా ఆటంకాలు
-రక్షణ శాఖ భూములపై స్పందనే లేదు
-ఎస్టీపీలకు నిధులడిగినా పట్టింపులేదు
-10 వేల కోట్లతో మూసీ వెంట ఎక్స్‌ప్రెస్‌వే
-నదిపై కొత్తగా 14 కొత్త బ్రిడ్జిల నిర్మాణం
-నగరంలో 100 శాతం మురుగు శుద్ధి
-సెప్టెంబర్ నాటికి అన్ని ఎస్టీపీలు పూర్తి
-మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
-నార్సింగి ఇంటర్ చేంజ్, కోకాపేటలోమురుగునీటి శుద్ధి కేంద్రాల ప్రారంభం
మోదీజీ.. ఈసారైనా రాష్ట్రానికి ఏమైనా ఇస్తారా? ఎప్పటిలాగే ఉత్త చేతులతోనే వస్తారా? దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఏం శుభవార్త మోసుకొస్తారు? నగరంలో లింకు రోడ్లు, స్కైవాక్, స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములివ్వాలి.
– మంత్రి కేటీఆర్

మరోసారి తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారైనా రాష్ర్టానికి ఏమైనా ఇస్తారా? ఎప్పటిలాగే ఉత్త చేతులతోనే వస్తారా? అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించకపోగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏండ్లుగా సతాయిస్తూనే ఉన్నదని విమర్శించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ప్రధాని ఏం శుభవార్త మోసుకొస్తారో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు. కోకాపేటలో రూ. 41 కోట్లతో 15 ఎంఎల్‌డీ సామర్థ్యంతో జలమండలి నిర్మించిన ఎస్టీపీని, రూ.29.50 కోట్లతో హెచ్‌ఎండీఏ నిర్మించిన నార్సింగి ఇంటర్ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణపై బీజేపీ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని అన్నారు.
‘హైదరాబాద్‌లో36 కిలోమీటర్ల మేర స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 120 ఎకరాలు ఇస్తే.. భూమికి బదులు భూమి కింద శామీర్‌పేటలో 500 ఎకరాలు తిరిగి ఇస్తామని అనేకసార్లు ప్రతిపాదనలు పంపాం. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్ర పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ ఈసారైనా తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా హైదరాబాద్‌లో లింకు రోడ్లు, స్కైవాక్, స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములివ్వాలి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మా పార్టీ ఎంపీలతో కలిసి రక్షణశాఖ భూములు ఇవ్వాలని కోరాం. ఉప్పల్ స్కైవాక్ తరహాలో మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి అర ఎకరం రక్షణ శాఖ స్థలం అవసరం. అత్తాపూర్‌లో లింకు రోడ్డు నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కావాలి. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ, జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు 36 కిలోమీటర్ల మేర రెండు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ స్థలాలు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరాం. భూమికి బదులుగా భూమి ఇస్తామని ప్రతిపాదించాం. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. మరోసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని.. హైదరాబాద్ వచ్చేలోపు రక్షణ శాఖ మంత్రికి ఆదేశాలివ్వాలి’ అని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ గ్రోత్ ఇప్పుడే మొదలైంది
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిదేండ్లలో కొంత అభివృద్ధిని చూశామని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరింత ప్రగతి సాధిస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి వేగానికి ఔటర్ రింగు రోడ్డు ఒక అసెట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఔటర్‌పై నార్సింగి వద్ద నిర్మించిన 20వ ఇంటర్ చేంజ్‌ను ప్రజలకు అంకితం చేసినట్టు చెప్పారు. మల్లంపేట వద్ద 21వ ఇంటర్ చేంజ్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పెరుగుతున్న రద్దీకి, ప్రజా అవసరాలకు అనుగుణంగా నాలుగు లేన్లతో సర్వీస్ రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ మేరకు విస్తరణ పనులు చేపట్టనున్నట్టు కేటీఆర్ చెప్పారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పనులను రెండున్నరేండ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు శంషాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు కేటాయించామని, రాబోయే రోజుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరో ఐదేండ్లలో కోకాపేట నియో పోలీస్ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఔటర్ వెంట అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మెట్రోను బీహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు వరకు విస్తరిస్తామని ప్రకటించారు.
వేగంగా మూసీ సుందరీకరణ
మూసీ నదిపై 14 కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటి నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐదు పనులకు టెండర్లను ఆహ్వానించామని, మిగిలిన తొమ్మిది పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ప్రభుత్వ రూ.లక్ష కోట్లు నష్టపోయిందని, దీనివల్లనే మూసీ సుందరీకరణ అనుకున్న స్థాయిలో చేయలేకపోయామని తెలిపారు. మూసీ సుందరీకరణ పనులు త్వరలోనే వేగం పుంజుకొంటాయని పేర్కొన్నారు. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు మూసీ వెంట 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామని, ఇందుకోసం రూ.10 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ పచ్చిమ, తూర్పు ప్రాంతాలను కలిపే ఈ స్కైవే పూర్తయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
వందశాతం మురుగుశుద్ధి నగరంగా హైదరాబాద్
మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం వచ్చే సెప్టెంబర్ నాటికి దేశంలో కొత్త రికార్డును సృష్టించబోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వంద శాతం మురుగునీటిని శుద్ధిచేసే తొలి నగరంగా హైదరాబాద్ నిలవనున్నదని చెప్పారు. రూ.3,866 కోట్లతో 1,259 ఎంఎల్‌డీ సామర్థ్యంతో సీవరేజీ ట్రిట్‌మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని, ఇందులో తొలి ఫలితంగా కోకాపేట ఎస్టీపీ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సెప్టెంబర్ నాటికి దశలవారీగా అన్ని ఎస్టీపీలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇదే అంశంపై కేటీఆర్ శనివారం ట్వీట్ కూడా చేశారు. శుద్ధిచేసిన నీటిని తిరిగి వినియోగించేలా వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ పాలసీని తీసుకొస్తామని మంత్రి చెప్పారు.
ఈ నీటిని బిల్డర్లు నిర్మాణ రంగానికి వినియోగించేలా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 2 వేల ఎంఎల్‌డీ మురుగునీరు శుద్ధి జరుగుతుందని, దేశంలోని ఏ నగరంలోనూ ఇంత పెద్దమొత్తంలో శుద్ధి చేయటంలేదని అన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి ఆర్థికసాయం చేయాలని కోరితే.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఒకింత ఆశ్చర్యపోయారని, ఎస్టీపీలను సందర్శిస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు హైదరాబాద్‌లో 11 లక్షల కుటుంబాలకు ఉచిత నీరు అందించేందుకు ఇప్పటివరకు రూ.850 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.