-నల్ల చట్టాలపై బీఆర్‌ఎస్ అలుపెరుగని పోరు
-అది రాహుల్‌కు తెలియకపోవడం సిగ్గుచేటు
-బీజేపీని ఎదుర్కొనేది ముమ్మాటికి బీఆర్‌ఎస్సే
-కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రూ.4 వేల పింఛన్ ఇవ్వనోళ్లు.. ఇక్కడ ఇస్తరా?
-రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేకే, నామా, బీఆర్‌ఎస్ ఎంపీలు
ఖమ్మం వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి అసలైన రిష్తేదార్ పార్టీ కాంగ్రెస్సేనని.. పార్లమెంటు సాక్షిగా మోదీని కౌగిలించుకున్న బంధువు రాహుల్ అని విమర్శించారు. సోనియా, రాహుల్‌పై నేషనల్ హెరాల్డ్ కేసును బీజేపీ అందుకే ముందుకు పోనివ్వలేదని గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే పింఛన్ రూ.4వేలు ఇస్తామంటూ రాహుల్ చెప్పడంపై రాజకీయపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణలో ఇస్తామనడం విడ్డూరమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై అందరినీ కలుపుకొని పోరాడేవాడే నిజమైన నాయకుడని, అలాంటి లక్షణాలు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి లేవని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే సామర్థ్యం రాహుల్‌కి లేదని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను బీఆర్‌ఎస్ పార్టీ సమర్థించిందని రాహుల్‌గాంధీ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకించిందని, కేంద్రం తీరును నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించామని చెప్పారు.

బీఆర్‌ఎస్ కారణంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకొన్నదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి చేతకాదని, ప్రాంతీయ పార్టీలే కాషాయ పార్టీని సమర్థంగా ఎదుర్కొంటాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాడినప్పుడు ఏనాడూ కాంగ్రెస్ పార్టీ కలిసి రాలేదని కేకే గుర్తు చేశారు. బీజేపీపై జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్ లాగా ఏ పార్టీ పోరాడడం లేదని చెప్పారు.
బీజేపీకి అసలైన బంధువు కాంగ్రెస్సే: నామా
‘బీజేపీకి రిష్తేదార్ బీఆర్‌ఎస్ కాదు.. అసలైన రిష్తేదార్ కాంగ్రెస్సే’ అని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. దేశంలోనే వ్యవసాయం, రైతుల గురించి ఆలోచించేది కేవలం సీఎం కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. బీజేపీకి దగ్గర బంధువు రాహుల్ గాంధేనని, పార్లమెంట్‌లో ప్రధాని మోదీని కౌగిలించుకొన్నది రాహుల్ కాదా? అని నిలదీశారు. లోక్‌సభలోనూ రైతు చట్టాలను బీఆర్‌ఎస్ ఎంపీలుగా వ్యతిరేకించామని, బిల్లును వ్యతిరేకిస్తూ బీబీ పాటిల్ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ రికార్డులను పరిశీలించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ 30 సార్లు వాయిదా తీర్మానాలు, ప్రధాని మోదీ, మంత్రులపై సభా హకుల నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. దేశ చరిత్రలోనే ప్రధాని, కేంద్ర మంత్రులపైనా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన పార్టీ బీఆర్‌ఎన్ అని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి వ్యాఖ్యలపై కూడా నామా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అబద్ధాలతో అధికారంలోకి రావాలని యత్నం: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. భట్టి విక్రమార్క చేసింది ప్రజలు లేని పాదయాత్ర అని.. కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా వారికి ఏ జిల్లాలో రెండు సీట్లుకూడా రావని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నారని ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. కర్ణాటకలో గెలిస్తే ఇకడ కూడా గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాహుల్‌గాంధీ ఇప్పుడే ‘ఏబీసీడీ’లు నేర్చుకుంటున్నారని ఎంపీ పీ రాములు ఎద్దేవా చేశారు. రాహుల్ పూర్తి అవగాహనారాహిత్యంతో ప్రసంగం చేశారని, లీడర్‌గా కాకుండా రీడర్‌గా మాట్లాడారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ కేంద్రంపై తాము యుద్ధమే చేశామని గుర్తు చేశారు