-కుల మతాలకతీతంగా కేసీఆర్ పాలన.. పనిచేసే సర్కారును ప్రోత్సహించండి
-పనిచేయని విపక్షాలను చెత్తబుట్టలో వేయండి
-అన్నివర్గాలకూ అభివృద్ధి ఫలాలు
-కరీంనగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్
-మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధి మీ అందరి గుండెను తడుతుందని నేను భావిస్తున్నా. పనిచేసే ప్రభుత్వాన్ని అశీర్వదించాల్సిన బాధ్యత, పనిచేసే నాయకత్వాన్ని జబ్బతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అదే సమయంలో పనిచేయని, పనికిరాని నాయకులను చెత్తబుట్టలో పారేయాల్సిన బాధ్యత కూడా చైతన్యవంతులైన ప్రజలపై ఉన్నది. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్ల మాదిరిగా, కులం మతం అనే పిచ్చి లేకుండా అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతమని ముందుకు పోతున్న కేసీఆర్ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలని కోరుతున్నా.
– కరీంనగర్ సభలో మంత్రి కేటీఆర్

తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, పసలేని వాగుడు వాగే నేతలకు మధ్య తేడాను ప్రజలు గుర్తించాలని కోరారు. మంత్రి కేటీఆర్ కరీంనగర్‌లో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానేరు నదిపై నిర్మించిన కేబుల్‌బ్రిడ్జి (తీగల వంతెన)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాల గుండెలు గుభేలుమంటున్నాయని అన్నారు. ‘మా జిల్ల పేరు చెబితే జల్లు మనాలె’ అని ఆనాడు కరీంనగర్ ప్రజలు గర్వంగా పాడారు. ఈ రోజు కరీంనగర్‌లో అభివృద్ధి చూస్తే ప్రతిపక్షాల గుండెలు జల్లుమంటున్నాయి. రూ.224 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, రూ.485 కోట్లతో అభివృద్ధి చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు.. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. నిజంగా తెలంగాణ రాకపోయి ఉంటే ఈ అభివృద్ధి పనులు జరిగేవా? ఆలోచించండి. ఆ రోజు మంచినీళ్లు, కరెంటు, సాగునీరు, రహదారులు ఎలా ఉండేవి? ఈ రోజు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి. 180 కిలోమీటర్ల పొడవున్న మానేరు నది సుజల దృశ్యంగా మారి కనువిందు చేయనున్నది. ఇవి కలలో కూడా మనం ఊహించని దృశ్యాలు. ప్రజాకవి దాశరథి అప్పుడెప్పుడో ‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అన్నారు. ఈ రోజు కోటి రతణాల వీణ మాత్రమే కాదు, కోటిన్నర ఎకరాల మాగాణం’ అని పేర్కొన్నారు.

పట్టువదలని విక్రమార్కుడు గంగుల
మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కరీంనగర్ నగరం సర్వాంగ సుందరంగా మారుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ‘నగరంలో జంక్షన్లు, రోడ్లు ఎలా మారాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కార్పొరేటర్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు కరీంనగర్ ప్రజలకు అండగా ఉండటం, కరీంనగర్ ప్రజల అదృష్టం. ఇలాంటి మంచి నాయకుడు దొరికినప్పుడు ప్రజలు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. తీగల వంతెనగానీ, పాఠశాలల నిర్మాణంగానీ, తిరుపతి తర్వాత పదెకరాల్లో అంతటి గొప్ప గుడి కట్టడంగానీ.. మంత్రి గంగుల చేసినట్టు గొప్ప పనులు చేసే దమ్మున్న నాయకుడు కరీంనగర్ గడ్డపై ఎవరన్నా ఉన్నారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఒక మేధావి అని కేటీఆర్ ప్రశంసించారు. ఇంతమంచి నాయకుడి సేవలను ప్రజలు కోల్పోయారని అన్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బీజేపీ నేత బండి సంజయ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో బడి బాగైంది. గుడి బాగైంది. అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఏ రంగం తీసుకున్నా దేశానికే దిక్సూచిలా ఉన్నాం. అందువల్ల పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత, పనిచేసే నాయకత్వాన్ని జబ్బతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నది. పని చేయని నాయకులను, పనికి రాని నాయకులను చెత్తబుట్టలో పారేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని పేర్కొన్నారు. కులం, మతం అనే పిచ్చి లేకుండా అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, జనహితమే మా అభిమతమని ముందుకు పోతున్న కేసీఆర్ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలని కోరారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌రావు, కౌశిక్‌రెడ్డి, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.