Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నలుదిశలా ఐటీ కారిడార్ల విస్తరణ..!

హైదరాబాద్‌కు నలుదిశలా ఐటీ కారిడార్లను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నదని తెలిపారు. కేవలం గచ్చిబౌలి ప్రాంతంలోనే కాదు.. ఆదిభట్ల, ఉప్పల్, మేడ్చల్, శామీర్‌పేట వైపు కూడా ఐటీ కారిడార్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది. అందుకు తగిన అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు ఉండి, తక్కువ జీవన వ్యయంతో నివసించేందుకు అవకాశాలు ఉన్నాయి.

-దేశంలోనే నంబర్ వన్‌గా హైదరాబాద్ -వేల ఉద్యోగాలు, ఉపాధి కల్పన సర్కార్ లక్ష్యం -11న ఐటీఐఆర్‌పై ప్రత్యేక సమావేశం -త్వరలోనే కొత్త ఐటీ పాలసీ! -ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి -నోవాటెల్ హోటల్‌లో హైసీ, -నాస్‌కామ్ ప్రతినిధులతో భేటీ

Development in IT

ముఖ్యంగా దేశంలోనే ఉత్తమ మౌలిక వసతులున్నాయి. అందువల్లే మనకు బెస్ట్ ఇన్‌ఫ్రా అవార్డు కూడా మనకు వచ్చింది అని ఆయన చెప్పారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆతర్వాత విలేకరులతో మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఇందుకోసం బ్రహ్మాండమైన ఐటీ పాలసీని తీసుకువచ్చేందుకు ఐటీ కంపెనీల ప్రతినిధుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

నానక్‌రాంగూడ, ఖానామెట్, గోపన్‌పల్లి ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ప్రధానమైన 11 రహదారులను అభివృద్ధి చేయాలని కంపెనీల ప్రతినిధులు కోరారు. ఐటీ కారిడార్లలో నీటి సరఫరా విషయాన్ని అడిగారు. ఈ మేరకు అన్ని చర్యలూ తీసుకుంటాం. డిసెంబర్ నాటికి కృష్ణా మూడో దశ ద్వారా నీటి సరఫరా కొంతమేర మెరుగుపడినా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిస్థాయిలో ఐటీ కంపెనీలు ఎన్ని నీళ్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం.

హైదరాబాద్‌కు అనేక కొత్త కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆదిభట్లలోని టీసీఎస్ కంపెనీ 28వేల మంది ఉద్యోగులతో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఎనిమిది వేల మంది మహిళా ఉద్యోగులు ఉన్నందున ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ కావాలన్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్ ప్రారంభంకాగా.. వాళ్లకు ప్రత్యేకంగా రెండు వాహనాలు కావాలంటే వాటిని కూడా అందించాం. కాంటింజెంట్ కంపెనీ కూడా రూ.500 కోట్లతో 7-8వేల మంది ఉద్యోగాలు కల్పిస్తూ విస్తరణ పనులు చేపట్టింది.

ఇలా అనేక కంపెనీల ద్వారా ఐటీ రంగం విస్తరించి.. వేలాది ఉద్యోగాలు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని కేటీఆర్ వివరించారు. ఐటీఐఆర్‌కు సంబంధించి ఈనెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డులో ఒక ముక్క పనులు పూర్తి కావాల్సి ఉందని, దానికి అధికారులు టెండర్లు కూడా పిలిచారని తెలిపారు. అదేవిధంగా ఔటర్‌ను అనుసంధానించే 16 రేడియల్ రోడ్లను హెచ్‌ఎండీఏ నుంచి ఆర్ అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందని వివరించారు.

కాగా, సాఫ్ట్‌వేర్ రంగంలో జాతీయ సరాసరి కంటే ఎప్పుడూ హైదరాబాద్ సరాసరి ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం అధ్యక్షుడు రమేశ్ అన్నారు. మంత్రి వెంట టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్, జలమండలి ఎండీ జగదీశ్వర్, ఐటీ (కమ్యూనికేషన్స్) డైరెక్టర్ ఏఎస్ రమేష్, జలమండలి డైరెక్టర్ రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఐటీ పాలసీ సిద్ధమవుతున్నది..! హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల సంఘం (హైసీ), నాస్కం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. కొత్త ఐటీ పాలసీకి సంబంధించి విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రతినిధులు ప్రధానంగా ఐటీ కారిడార్లలో ఉన్న మౌలిక వసతుల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కేటీఆర్.. ఇకముందు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ.. ముందుకుపోదామని సూచించారు. ప్రస్తుతం సుస్థిర పాలన ఉన్నందున ఐటీ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.