– మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – సమైక్య రాష్ర్టంలో తీవ్ర అన్యాయం – రెండు ఫిషరీస్ కళాశాలలు, రిసెర్చ్ సెంటర్లు – 3939 చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను వదిలాం – ఫిషరీస్ కార్పోరేషన్ ను బలోపేతం చేస్తాం – బేగం జబార్ బ్రోకర్లను తరిమేస్తాం – ఫిషరీస్ కార్పొరేషన్ లో నియామకాలు చేపడుతాం

వచ్చే బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో మత్స్య పరిశ్రమపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో చేపలు, చేపల పరిశ్రమ కేవలం కోస్తా ప్రాంతానికే పరిమితమయ్యేది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక్కడ చేపల పెంపకానికి వసతులున్నప్పటికీ నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపల పరిశ్రమ అంటే కోస్తాంధ్రగా వ్యవహరించారని తెలిపారు. అన్ని రంగాలతో పాటే మత్స్య పరిశ్రమ విధ్వంసం జరిగింది.
వచ్చే రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే సంవత్సరానికే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మూడున్నర లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతాయని అంచనా వేశామన్నారు. 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేప పిల్లలను పెంచే అవకాశం ఉందన్నారు. సుమారు వచ్చే రెండేళ్లలో రెండు ఫిషరీస్ కళాశాలలు, రెండు రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ తెలంగాణకు ఉన్న గొప్ప వరమని చెప్పారు. రెడ్డి రాజులు, నిజాం ప్రభువులా పుణ్యమా అని తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి శ్రీశైలంలో చేపలు పడుతారు. మన మత్స్యకారులను దగ్గరికి రానివ్వరు అని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లోని రాజోలు వద్ద తెలంగాణ మత్స్యకారులపై ఆంధ్రా మత్స్యకారులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మత్స్య పరిశ్రమలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేపలను పెంచే అవకాశం ఉందన్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు పలు రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపడుతామన్నారు. సింగూరు, ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, నిజాంసాగర్, లంకా సాగర్, వైరా, పాలేరు దాకా రిజర్వాయర్లున్నాయి, వాటన్నింటిలో చేపల పెంపకం చేపట్టాలన్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
చేప పిల్లల కొనుగోలుకు రూ. 24 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలోని 3939 చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను వదిలామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉ్నన ఫిషరీస్ కార్పొరేషన్ జవజీవాలు లేకుండా ఉందన్నారు. ఫిషరీస్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి.. బేగంబజార్‌లోని బ్రోకర్లను తరిమేస్తామని స్పష్టం చేశారు. బెస్తవారు, ముదిరాజ్‌లకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. త్వరలోనే మత్స్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో చేప పిల్లల పెంపకం జరగాలన్నారు. మత్స్యకారులు బ్రహ్మాండమైన ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని చెప్పారు.మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.