Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణ పిల్లలు టెక్ చాంప్స్

-కార్పొరేట్లకు రుణమాఫీ చేసి.. ఉచితాలపై ఉపన్యాసాలా?
-60 పాఠశాలల్లో 22 వేల మందికి కంప్యూటర్‌ బేసిక్స్‌
-టీ-ఫైబర్‌తో రాష్ట్రంలోని 26 వేల బడుల అనుసంధానం
-సర్కారు బడిలోని ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ
-కేంద్రం నుంచి బండి సంజయ్‌ పైసా తీసుకురాలేదు!
-పెన్షన్లు ఉచితమైతే.. కార్పొరేట్‌ రుణాల మాఫీ ఏంది?
-పనిచేసేవాళ్లకు.. మాటలుచెప్పేవాళ్లకు తేడా తెలుసుకోండి
-కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేసే బాధ్యత ప్రజలదే
-ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌

సమైక్య పాలకులు గుడిని, బడిని పట్టించుకోలేదు. కనీసం సాగునీటి గోస తీర్చలేదు. మనసున్న సీఎం కేసీఆర్‌ వల్లే అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. మున్ముందు మరింత అభివృద్ధిని చూస్తారు. ఇంత మంచి పనులు చేస్తున్న సీఎంను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉన్నది.
-మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలోని విద్యార్థులను టెక్‌ చాంప్స్‌గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్‌ చాంప్స్‌’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యార్థులకు ‘కంప్యూటర్‌ చాంప్స్‌’ పేరుతో బేసిక్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం అందిస్తున్నట్టు తెలిపారు. 26 వేల పాఠశాలలను టీ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు కోసం అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు పోటీపడాలని పిలుపునిచ్చారు. క్రీడలు దేహదారుఢ్యంతోపాటు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నదని గుర్తుచేశారు.

మంత్రి కేటీఆర్‌ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట మండలం గోరంట్యాల పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనం, కంప్యూటర్స్‌ చాంప్స్‌ను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పరికరాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో 1,200 మంది దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని మినీ స్టేడియంలో వాలీబాల్‌ అకాడమీని ప్రారంభించారు. ఆయాచోట్ల ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. విద్యతోనే వికాసం, విజ్ఞానం లభిస్తుందని.. పాఠశాల తరగతి ఒక గది మాత్రమే కాదని, ఒక విజ్ఞాన గని అని కేటీఆర్‌ అన్నారు. ‘టెక్‌ చాంప్స్‌’ కార్యక్రమంతో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ అక్షరాస్యతను అందించనున్నట్టు తెలిపారు.

కార్పొరేట్లకు రుణమాఫీ చేసి.. ఉచితాలపై ఉపన్యాసాలా?
పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు, సూటుబూటు వేసుకొన్నోళ్లకు రూ.12.50 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ర్టాల్లో పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇవ్వటాన్ని తప్పుపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పెన్షన్లు ఉచితాలంటూ గాయి చేస్తున్న ప్రధాని.. మరి రూ.12.5 లక్షల కోట్లు ఏ లెక్కన మాఫీ చేశారని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నయాపైసా మేలుచేయని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు.. నేడు తమకు ఓట్లేస్తే ఏదో అద్భుతం చేస్తామని మళ్లీ ప్రజలముందుకు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధిలో తమతో పోటీ పడాలని సవాల్‌ విసిరారు.

ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సొంత జిల్లాకు బుడ్డ పైసా అయినా తెచ్చారా? అని నిలదీశారు. ‘విమర్శించటం కష్టమేమీ కాదు. కానీ, ఎంపీగా జిల్లాకు ఒక ట్రిపుల్‌ ఐటీ, నవోదయ పాఠశాల, సిరిసిల్ల మెగా పవర్‌ లూం క్లస్టర్‌ తెచ్చావా? బుడ్డ పైసా పని అయినా చేశావా? కార్లకు అడ్డం పడుడు, డ్రామా కొట్టుడు, ధర్నాలు చేయడం కాదు.. దమ్ముంటే, చేతనైతే ఢిల్లీలో పతార ఉంటే మోదీతో మాట్లాడి జిల్లాకు ఏం అవసరమో అవి తీసుకురా. నేనొక బడి కట్టాను.. నువ్వూ ఒక మంచి బడి కట్టి చూపించు. అంతేగానీ పనిచేసేటోళ్ల కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకోవద్దు’ అని బండి సంజయ్‌కి హితవు పలికారు. ప్రజల దయ ఉంటే తాను తప్పకుండా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇప్పటికే చాలా పనిచేశానని, ఇంకా పని చేస్తానని, అందుకే ప్రజలమీద తనకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్‌ మనసున్న పాలకుడు. ఎవరో డిమాండ్‌ చేశారని కాదు.. ఎల్లారెడ్డిపేట మండలానికి డిగ్రీ కళాశాలను మా ప్రభుత్వం కచ్చితంగా ఇస్తుంది’ అని ప్రకటించారు.

దివ్యాంగుల మేలు కోరే ప్రభుత్వం
తమది దివ్యాంగుల మేలు కోరే ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎవరూ అడగకున్నా సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,116కు పెంచారని చెప్పారు. ‘తెలంగాణలో 5.10 లక్షల మంది దివ్యాంగులకు జూలై నెల నుంచి రూ.4,116 పెన్షన్‌ ఇవ్వబోతున్నాం. ఇంత భారీ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఏకైక సీఎం కేసీఆర్‌’ అని స్పష్టంచేశారు. రూ.45. 23 కోట్లతో 45,417 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మూలనిధిని ఏర్పాటు చేసి, ఇప్పటివరకు రూ.10.50 కోట్లు ఖర్చుపెట్టామని, వారి సమస్యలు తీర్చేందుకు ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌ 155326ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విద్య, ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను 3 శాతం నుంచి నాలుగు శాతానికి పెంచామని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో సైతం 5 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి గౌరవం కాపాడుతున్నామని తెలిపారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాలోని 1,220 మంది దివ్యాంగులతోపాటు కొంత మంది ట్రాన్స్‌జెండర్లకు ఉచిత సహాయ పరికరాలను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 75 మందికి వీల్‌ చైర్లు, 150 మందికి త్రీవీలర్‌ స్కూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు, 40 టెలివిజన్లు, లాప్‌ట్యాప్‌లు, బ్యాటరీ సైకిళ్లు, చేతి కర్రలు, వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టీటీడీసీ చైర్మన్‌ ప్రవీణ్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, ఆర్‌బీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, బీర్‌ఎస్‌ జిల్లాధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

మాది మనసున్న ప్రభుత్వం
తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణలో విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయ రంగాలు ఎలా ఉండేవో.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తుచేసుకోవాలని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్ల పాలన సాగించినవారు గుడిని, బడిని పట్టించుకోలేదు. కనీసం సాగునీటి గోస తీర్చలేదు. మనసున్న సీఎం కేసీఆర్‌ వల్లే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణ సర్కారు వేతనాలు ఇస్తున్నది. చిరుద్యోగులను కుడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. హోంగార్డులకు జీతాలు పెం చింది. ట్రాఫిక్‌ పోలీసులు అడగకున్నా 30 శాతం పొల్యూషన్‌ అలవెన్సు ప్రవేశపెట్టిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్‌. ఇంత మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది.

కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయండి’ అని కోరారు. ఎకనమిక్‌ సపోర్టు స్కీంలో గతంలో సభ్యులకు రూ.30 వేలు ఇస్తే.. తాము రూ.లక్షకు పెంచామని, తొమ్మిదేండ్లలో రూ.36.26 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. దివ్యాంగులను పెండ్లి చేసుకుంటే ఆడపిల్లయితే రూ.2.25 లక్షలు, అబ్బాయికి రూ.లక్ష చొప్పున ఇప్పటివరకు రూ.37.23 కోట్ల ప్రోత్సాహం అందించినట్టు వివరించారు. దివ్యాంగులకు రూ.1. 25 లక్షల విలువైన స్కూటర్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 18 వేల స్కూళ్లను ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా అన్ని హంగులతో కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.