Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జనహితం మా అభిమతం

-అభివృద్ధి, సంక్షేమం మాకు జోడుగుర్రాలు – దేశం అబ్బురపడే పథకాలు తెచ్చాం – సమగ్రసర్వే.. 21 కొత్త జిల్లాల ఏర్పాటు సాహసోపేతం – డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం – లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం – 62 వేల నియామకాలు పూర్తి చేశాం – నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ -నోట్ల రద్దుపై వీధిపోరాటాలు చేయలేము -కేసీఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు -రుణమాఫీపై రైతులకు స్పష్టత ఉంది -ఎన్నారై పాలసీ తెస్తున్నాం -గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి విధాన ప్రకటన చేస్తున్నాం -విశ్వనగర సాధనకు 7-8 ఏండ్ల కాలవ్యవధి -వచ్చే మేలో మెట్రో మొదటి దశ ప్రారంభం -జనవరి నుంచి ప్రగతిభవన్, జనహితలో ప్రజలతో సీఎం భేటీలు -కేంద్రంతో సంబంధాలు మిశ్రమంగానే ఉన్నాయి -కోదండరాం తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు -చిప్పకూడు తిన్నవారితో వేదిక పంచుకోవటం ఏం సబబు? -పార్టీలోకి వస్తున్నవారి ముఖాన తలుపులు వేయలేం

minister-ktr-with-namasthe-telangana

ఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రంగరించి దేశం యావత్తూ మనవైపు ఆసక్తిగా చూసేలా జనరంజక పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల హితం తప్ప మరో ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతూ ముందుకు వెళుతున్నారు. మన పథకాలకు దేశం అబ్బురపడుతున్నదని తెలిపారు. ఏక కాలంలో 21 జిల్లాల ఏర్పాటుపై హర్యానా సీఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. నోట్ల రద్దు అంశంలో సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలాగ వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాల వల్లనే ప్రభుత్వ చెల్లింపులకు పాతనోట్లకు అనుమతి, రైతులకు 24 వేల నగదు, పీఓఎస్ మెషిన్ల దిగుమతిపై ట్యాక్సుల మిహాయింపు వంటి అంశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.

ఈ సంక్షోభాన్ని తప్పక అధిగమిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, లక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎన్నారై పాలసీ సిద్ధం చేశామని, గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి విధానం ప్రకటించబోతున్నామని చెప్పారు. చేనేత తదితర రంగాల్లో కొత్త పాలసీలను త్వరలోనే క్యాబినెట్ ఆమోదించబోతున్నదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేండ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటి వరకూ చేపట్టిన కార్యక్రమాలు, ఎదురైన సవాళ్లు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు.. తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, భవిష్యత్తుపైన ప్రజలు ఆశావహంగా ఉన్నారన్నారు. ఆయన ఇంకేం చెప్పారంటే..

స్థిరత్వం సాధించాం.. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్‌లు ఇప్పటికీ సమస్యల మధ్య ఉనికిని నిలుపుకోవటానికి తంటాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై స్వల్పకాలమే గడిచింది. అయినా రాష్ట్రంలో స్థిరత్వం- బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు సాగుతున్నాం. అతి స్వల్పకాలంలోనే ప్రపంచం అబ్బురపడేలా పనిచేశాం. పెట్టుబడులు, శాంతిభద్రతలు, విద్యుత్ సమస్య విషయాల్లో ఉమ్మడి పాలకులు లేవనెత్తిన అనుమానాలన్నీ స్థానిక యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ అనే కోణంలో పారిశ్రామిక రంగంలో ముందుకు సాగాలి. రోబోశాండ్ తయారీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యాం. పెద్దస్థాయిలో పనులు చేసేందుకు నిబంధనలను సడలిస్తున్నాం.

పటాపంచలు చేశాం. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న సంగతి నిజం. ఇప్పటివరకు 62వేల ఉద్యోగాలను టీఎస్‌పీఎస్‌సీ, జెన్‌కో,ట్రాన్స్‌కో, పోలీసు బోర్డు ద్వారా భర్తీ చేశాం. గతంలో ఏపీపీఎస్‌సీ నియామకాలు అంటే ఏండ్ల పాటు నిరీక్షణ, లంచాల బాగోతాల చరిత్ర. ఘంటా చక్రపాణి సారథ్యంలో వేగంగా నియామకాలు జరుపుతున్నాం. ఇంటికో ఉద్యోగం అని మేమెప్పుడూ చెప్పలేదు. అది టీడీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న మాట. బాబు వస్తాడు.. జాబు వస్తుంది అన్నది వాళ్ల నినాదం. మేము లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. రూ.50వేల కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రైవేటు రంగలో ప్రత్యక్షంగా లక్ష 60వేలు, పరోక్షంగా అంతకు మూడురెట్లు ఉద్యోగాలు వచ్చాయి.

రుణమాఫీపై రైతుల్లో స్పష్టత ఉంది.. రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయే తప్ప రైతులకు స్పష్టత ఉంది. రూ.17వేల కోట్ల భారీ రుణమాఫీని ఏ ప్రభుత్వం కూడా ఏకకాలంలో చేయలేదు. ఇప్పటికే రూ.12,500 కోట్ల మాఫీ పూర్తయింది. మిగిలింది స్వల్పం. అది పూర్తి చేస్తాం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల మాపీ హామీ ఇచ్చినా ప్రజలు కేసీఆర్‌నే నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాం.

వైద్యం మెరుగుపడింది.. గతంతో పోలిస్తే సర్కారు దవాఖానల్లో పరిస్థితి మారింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లలో ఇపుడు లివర్, కిడ్నీ, గుండె ఆపరేషన్లు సైతం జరుగుతున్నాయి. గ్రామీణ దవాఖానల్ల్లో సేవలు మెరుగుపర్చడం, 108 వాహనాల పెంపు, మండలాల్లో 30 పడకలు, నియోజకవర్గాల్లో 100 పడకల దవాఖానలను ప్రారంభించాం.

స్థానిక ఉద్యోగాల కల్పనకు ఇదే ప్రణాళిక స్థానిక యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ అనే కోణంలో ఉన్న పారిశ్రామిక రంగంలో ముందుకు సాగాలి. రోబోశాండ్ తయారీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యాం. పెద్ద స్థాయిలో పనులు చేసేందుకు నిబంధనలను సడలిస్తున్నాం.

టాప్ కంపెనీలను తీసుకొచ్చాం.. పారిశ్రామికంగా మన పురోగతి చెప్పుకోదగింది. అత్యుత్తమ పాలసీతో ప్రపంచంలోని నాలుగు టాప్ కంపెనీలు వచ్చాయి. భారీ స్థాయిలో ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఊబర్‌లు ఇక్కడ కొలువుదీరాయి. ఇంటింటికీ ఇంటర్నెట్‌లో భాగంగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో 2000 కిలోమీటర్లు పూర్తయింది. యాభై వేల కిలోమీటర్ల లక్ష్యం. 12వేల ఎకరాల ఫార్మాసిటీలో 6వేల ఎకరాల భూసేకరణ పూర్తయింది. 2000 ఎకరాలలో నిమ్జ్ రానుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో టాప్ ర్యాంకు సాధించాం. ఐటీఐఆర్ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ పరిశ్రమ అభివృద్ధి కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.

నోట్లరద్దుపై వీధిపోరాటాలు చేయలేం.. నోట్ల రద్దు మనకు నష్టమే. రాష్ట్ర ఆదాయం నెలకు రూ.9వేల కోట్లు ఉండగా రూ.1500-2వేల కోట్లు తగ్గుతున్నది. అయితే ఈ విషయంలో రాజకీయాలు, వీధిపోరాటాలు చేయలేం. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ప్రజలకు ఇబ్బందులు తొలగించడం, రాష్ట్ర ఆర్థిక స్థితిని కాపాడుకోవటం మా ప్రాథామ్యం. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు. ప్రధానితో మాట్లాడారు. ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ చెల్లింపులకు పాతనోట్లతో చెల్లింపులు, రైతులకు రూ.24వేలు వంటి వాటితో కొంతలో కొంత ప్రయోజనం కలిగింది కదా. మారిన పరిస్థితిలో డిజిటల్ లావాదేవీల అంశాన్ని చేపడుతున్నాం. టీఎస్ వాలెట్‌ను ప్రారంభించాం. డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టును మరింత ఉధృతం చేస్తాం. రూపే కార్డులు అందుబాటులోకి తేవడం వంటివి తీసుకువస్తున్నాం. సిద్ధిపేటలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కేసీఆర్ మాట్లాడారు. పన్నులు తగ్గించాలని, పీఓఎస్ మెషిన్ల దిగుమతిపై ట్యాక్సులు వేయవద్దని కోరారు. ఆ ఫలితంగానే కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పులిపై స్వారీలాగ మారింది. చెబితే కొంత కాంట్రావర్సీ అవుతుంది. గత ప్రభుత్వాలు తమ అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి రెండు మూడు స్కీంలు తెచ్చాయి. ఆరోగ్యశ్రీ. ద్వారా ఏం చెప్పారు? మా ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాగా లేదు. మీరు ప్రైవేటు ఆసుపత్రికి వెళితే మేం పైసలిస్తాం అనా? ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఏందీ? విద్య అందించడం ప్రభుత్వం వల్ల కాదనేనా? ఇపుడు ఈ రెండు పథకాలు పులిమీద స్వారీలాగ మారాయి. అంత భారీ మొత్తాలను ప్రైవేటు వాళ్ల చేతుల్లో పోసే బదులు ఈ వ్యవస్థలను బాగు చేసుకుంటే మనం ఎక్కడుండే వారిమో ఆలోచించండి. ఇపుడేం చేయగలం? కనీసం గ్యాప్‌లు సవరించి కొంతైనా బాగుచేద్దామని దాన్ని తాకినా చాలు.. ఒకాయన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను తొక్కేస్తున్నాడంటారు. వివేకం ఉన్న ఏ ప్రభుత్వమన్నా మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లగలుగుతుందా? మొదట్లోనే ఆ లోపాలను సరిచేసి ఉంటే.. ఆ పైసలు ఇటు ఖర్చుపెట్టి ప్రభుత్వ వ్యవస్థలు బాగు చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ డబ్బంతా సామాన్యుడు చెల్లించేదే కదా.

ప్రజలే జవాబిచ్చారు.. ప్రతిపక్షాల తీరు మనకు తెలిసిందే.. రాజకీయంగా ఎవరేం మాట్లాడినా మెదక్ ఉప ఎన్నిక నుంచి వరంగల్ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, నారాయణఖేడ్, పాలేరు, కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికలు ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఏకోన్ముఖంగా ప్రజలు ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారు. గతంలో జీహెచ్‌ఎంసీలో ఒక్క సీటూ లేదు. ఇప్పుడు 100 సీట్లు వచ్చినై. పాలేరు ఉప ఎన్నికలో గతంలో మాకు డిపాజిట్‌కూడా రాలేదు. అలాంటిది మొన్నటి ఉప ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్ల వరకు వచ్చాయి.

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్సే.. వచ్చే ఎన్నికల్లో పోటీయే ఉండదు అంటే అది అహంకారం అవుతుంది. పోటీ ఉంటుంది. 99 శాతం కాంగ్రెస్ తోనే ఉంటుంది. కాకపోతే అడుగు, బొడుగు…గడ్డాలు పెంచుకున్న నాయకులతో పోటీ పడాల్సి వస్తుందేమో.

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం స్పీడు పెంచుతాం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం ఉంది. రూ.11వేల కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి. సమస్య ఏమిటంటే రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్లు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇటు రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఇలా అన్ని విభాగాల్లో రూ.వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. సహజంగానే అవి లాభదాయకంగా ఉండటం, ఇండ్ల నిర్మాణం వాటితో పోలిస్తే అంతస్థాయిలో లాభదాయకం కాకపోవటంతో పెద్ద కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. సీఎం కేసీఆర్ దీన్ని గుర్తించి స్థానికంగా ఉన్నవారిని కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో రాబోయే ఏడాది కాలంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టబోతున్నాం.

శాంతిభద్రతల విషయంలో.. శాంతి, భద్రతల విషయంలో ప్రత్యర్థులు కూడా మా సర్కారును వేలెత్తి చూపే స్థితి లేదు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చాలామంది చాలా చెప్పారు. అవన్నీ నిజం కాదని తేలింది. ఆధునీకరణతో పోలీసుల్లో సైతం ైస్థెర్యం పెంచాం. ప్రజల్లో భరోసా వచ్చింది.

బాధ్యతాయుతంగా ఉన్నాం.. నోట్ల రద్దును ముందు వ్యతిరేకించారు అని కాంగ్రెస్ వారంటున్నారు. తలకాయ ఉండాలి. సహజంగానే మనది కొత్త రాష్ట్రం. శర వేగంగా ఎదుగుతున్న దశలో దెబ్బ పడింది. బాధ్యత కలిగిన ఏ సీఎం అయినా మథనపడుతాడు. అయితే ప్రధాన మంత్రితో చర్చించాక నోట్ల రద్దుపై ఆయన పట్టుదలతో ఉన్నారని, దేశానికి మంచి జరుగుతుందని, పారదర్శకత పెరుగుతుందని అనుకున్నప్పుడు స్పందించాం. మనకు సంబంధించి ఇది వీధి పోరాటాల సమయం కాదు.

ప్రాజెక్టులు, భూసేకరణపై విమర్శలకు మీరేమంటారు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టుగానే కాంగ్రెస్ తీరు ఉంది. ఇక కోదండరాం గారు.. డీపీఆర్ లేకుండా చేస్తరా? అని మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులంటేనే మన దేశంలో రెండు మూడు పుష్కరాలు అయిపోయింది. అధ్యయనం చేస్తే మూడు సాధక బాధకాలు కనిపించాయి. ల్యాండ్.. మనీ టైఅప్.. డిజైన్స్.. మన దేశంలో సంవత్సరాల తరబడి డీపీఆర్‌లు తయారు చేస్తారు. అవి పూర్తయిన తర్వాత టెండర్లు పిలుస్తరు. అప్పుడు భూసేకరణ మొదలుపెడతారు. ఎంత కాలహరణం? అందుకే సీఎంగారు ఈ మూడు పనులు సమాంతరంగా చెయ్యమన్నారు. సమాంతరంగా చేసుకుంటున్నాం.

కోదండరాం స్థాయి తగ్గించుకుంటున్నారు… కోదండరాంగారు కూడా స్థాయిని తగ్గించుకుంటున్నారు.. తెలంగాణ ప్రజలు ఆక్రోశించింది నీళ్లకోసమే కదా. సీఎం నీళ్ళు ఇస్తా అంటుంటే సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? నిన్న ములుగు జిల్లా కేంద్రం కావాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా పెట్టినా మీకు అభ్యంతరమేనా ? జయశంకర్‌సార్ మరణించినప్పుడే జిల్లాకు పేరు పెడ్తామని ప్రకటించాం. ఇప్పుడు అదే చేశాం. దీనికి శభాష్ అనాలి. అది మరిచి రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకుంటారా.. ? జయశంకర్‌తో వేదిక పంచుకున్నరు.. కేసీఆర్‌తో వేదిక పంచుకున్నరు.. ఇప్పుడు చిప్పకూడుతిన్న రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకుంటున్నరు.. ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చారు?

సీఎం అధికారిక నివాసం కడితే తప్పేంటి..? సీఎం క్యాంపు ఆఫీస్ కట్టారు. ఏమన్నా సొంత ఆస్తి కట్టుకున్నారా? ఇదేమన్నా ఆయన కోసుకుని తీసుకుపోతారా. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారు అందులో ఉంటారు.

బైప్రాడక్ట్ లాంటివారు మాట్లాడితే బాధపడం.. చంద్రబాబు మొదట్లో ఇక్కడి నుంచి ఆంధ్ర పాలన నడుపుదామని అనుకుని ఉండవచ్చు. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జ్ఞానోదయం అయ్యింది. ఓటును కూడా అక్కడికి మార్చుకున్నారు. కొన్ని అవశేషాలు మాత్రం మిగిలాయి. చిల్లరమల్లర వ్యక్తులు.. బైప్రాడక్ట్ లాంటివారు. వాళ్లు మాట్లాడితే మనం బాధపడేది ఏం లేదు.

పరిపాలన ప్రజల చెంతకు తీసుకెళ్లాం.. 31 జిల్లాల ఏర్పాటు సామాన్యమైన విషయమేమీ కాదు. నిన్న హర్యానా సీఎస్ వచ్చారు. ఎలా చేశారని ఆశ్యర్యంగా అడిగారు. ఒక్కో నిర్ణయానికి సామాన్యులు ఎంతగా తల్లడిల్లుతారనేది నోట్ల రద్దు విషయంలో మన కండ్లముందు ఉంది. కానీ ముఖ్యమంత్రి సమర్థుడైతే.. సత్తా ఉంటే ఏం చేయవచ్చో రెండుసార్లు సీఎం కేసీఆర్ చూపించారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక తార్కాణం. 24 గంటల్లో కోటి కుటుంబాల సర్వే చేయడం ఆషామాషీ కాదు. రెండవ తార్కాణం.. 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం.. ఇవన్నీ అనితరసాధ్యమైన ఫీట్లు. చేసి చూపించాం.

కేంద్రంతో సంబంధాలు మిశ్రమమే.. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొంత ఇబ్బందిగా ఉండేది.. ఇప్పుడు మిశ్రమంగా ఉన్నాయి. హైకోర్టు విషయంలో పురోగతి లేదు. ఐటీఐఆర్ విషయంలోకూడా పురోగతి లేదు. పోలవరం విషయంలో బాధపెట్టే నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని విషయాల్లో సంతృప్తి కరంగా ఉన్నాయి. నేషనల్ హైవేస్ విషయంలో విజ్ఞప్తి చేయగానే 50 ఏండ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే రెట్టింపు చేసుకోగలిగాం. ఇండస్ట్రీ ప్రమోషన్ విషయంలో కొంత సంతృప్తికరంగానే సహకరిస్తున్నారు.

రెండున్నరేండ్ల పరిపాలనపై మీకు మీరు వేసుకునే స్కోర్ ఎంత.. మాకు మేము వేసుకోవడం సరైంది కాదు. ప్రజలు ఇవ్వాలి. ఒక్కటి మాత్రం పక్కా.. వాస్తవం చెబుతున్నా.. సిన్సియర్‌గా చెబుతున్నా.. కాంగ్రెస్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామన్నా లక్ష మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ను నమ్మారు. దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు మేము స్కోర్‌లు వేసుకుని.. 30 ఏండ్లు 300 ఏండ్లు మేమే ఉంటామని చెప్తే అతి అవుతుంది. మేం 5 ఏండ్ల కోసం ఎన్నికయ్యాం. ఈ ఐదేండ్లు సిన్సియర్‌గా శాయశక్తులా శ్రమిస్తాం. ప్రజలు మేము బాగా పని చేశామని భావిస్తే.. మరోసారి అవకాశం ఇస్తారు. లేదా ఇంట్లో కూర్చుంటాం. వీ ఆర్ రెడీ..

పార్టీలో చేరికలు.. మాపై విశ్వాసానికి ప్రతీక ఇతర పార్టీల వారు మా పార్టీలో చేరడం మాపై పెరిగిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నాం. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు కనుక ఆయన సారథ్యంలో పని చేద్దామని వస్తుంటారు. అలా వస్తున్నవారి మొహంపై తలుపులు మూసేయలేం. వద్దని చెప్పలేం. ఎవరి ఒత్తిడి లేకుండా వాళ్ళంతట వాళ్ళు వస్తే తప్పేంటి? చూడండి… పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేసినవాళ్లుకూడా వస్తున్నారు. కాదంటామా? ఇక న్యాయాన్యాయాలు అంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. స్పీకర్‌గారు తన పని తాను చేసుకుపోతారు.

ఇవి చేస్తాం.. -ఎన్నారై పాలసీని రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఆమోదించబోతున్నాం. -గల్ఫ్ బాధితుల సమస్యలకు సంపూర్ణ పరిష్కారాలు వెతికాం. క్యాబినెట్‌లో చర్చించి ప్రకటన చేస్తాం -మైనింగ్, టెక్స్‌టైల్, జౌళి, రిటైల్ పాలసీలు వేర్వేరుగా క్యాబినెట్ ముందు పెట్టనున్నాం -హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక చేపడుతున్నాం. అమలుకు కనీసం 7-8 సంవత్సరాల వ్యవధి అవసరం. -హైదరాబాద్‌లో మెట్రోరైల్ తొలిదశను 2017మేలో ప్రారంభిస్తాం. 2018 కల్లా పూర్తిస్థాయిలో మెట్రో అందుబాటులోకి వస్తుంది -రాబోయే జనవరినుంచి ప్రగతి పథం.. జనహితలో ప్రజలను కలుసుకునే కార్యక్రమం ఉంటుంది. నేతన్నలు, స్వర్ణకారులు, రైతులు, మహిళలు, పారిశ్రామిక వేత్తలు, హైదరాబాద్‌వాసులు, బస్తీ వాసులు.. ఇలా అన్ని వర్గాలతో సీఎం కూర్చుంటారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, ఆచరణలో లోటుపాట్లుంటే సవరించుకోవడం, అభివృద్ధి విషయంలో వేగంగా ముందుకు వెళ్ళడం లక్ష్యం. -2018 నాటికి తండాలను పంచాయతీలుగా చేస్తాం. 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2018లో ఎన్నికలుంటాయి. అప్పటికల్లా ప్రక్రియనంతా పూర్తిచేస్తాం. -ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో ఆషామాషీగా శాసనసభ తీర్మానం చేసి చేతులు దులుపుకోం. శాస్త్రీయమైన, హేతుబద్దమైన సర్వేను చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీతో చేయిస్తున్నాం. మతపరమైన రిజర్వేషన్లకు అవకాశముండదు కాబట్టి ముస్లింలకు సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా ఆలోచన.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.