సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండమైన విజయం అని. నీటిలో చేపలా ప్రజల మధ్యలో కలియదిరిగే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. అందునా జీవితాలను, ఆయా ప్రాంతాల్లోని భౌతిక పరిస్థితులను స్వీయ రాజకీయ దృష్టికోణంతో కాకుండా, ప్రజా జీవన విధానం నుంచి అధ్యయనం చేయగలిగేవారికి అనేక అంశాలు బోధపడుతాయి.
2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్‌గా వారం రోజుల పాటు అక్కడి గ్రామాల్లో కలియదిరిగిన తర్వాత ఎంతో విలువైన అనుభూతిని జ్ఞాపకాల్లో నమోదు చేసుకునే అవకాశం కలిగింది. మొన్న మాగనూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత గట్టి పప్పు, గడ్డిపూల తొక్కు, అక్కడి ప్రత్యేకతైన చింతకాయ తొక్కు, గుమగుమలాడే వంకాయ కూర, గట్టి ఇంటి పెరుగుతో భోజనం ఏర్పాటుచేసి కొత్తపల్లి అనే పల్లెటూరుకు వెంకట్‌రెడ్డి అనే రైతు ఆహ్వానించాడు. భోజనం మధ్యలో మాటలు కలిపి వడ్డిస్తూ.. ‘నాడు ఏముండే అన్న, పట్టుమని పదివేలు కూడా ఊళ్లె పుట్టకపోయేది, రాయచూరు గంజి (వ్యవసాయ మార్కెట్)ల సావుకార్ల చుట్టూ దినాలకు దినాలు అప్పు కోసం తిరిగేది. పంట పెట్టాలన్న, పెళ్లి చేసి పంపిన ఆడబిడ్డ కుటుంబాన్ని పండుగ నాడు ఇంటికి పిలవాలన్న గుండెలు పగిలినంత పనయ్యేది.
కానీ కరెంటు, రైతుబంధు, మా దగ్గర భీమా పెండింగ్ పనుల పూర్తివల్ల పంటలు పండటమే కాదు, ధైర్యం పెరిగి, జనాలు పది పనులు ఎక్కువ చేసుకొని పైసలు కూడబెట్టుకుంటున్నరు. కేసీఆర్ రైతులకు ఇచ్చింది పెట్టుబడి మాత్రమే కాదు, గుండెల నిండా ధైర్యాన్నీ, ఆ సారే మనకుండాలన్నా..’ అని చెప్తుంటే అందరి కండ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇంటినుంచి బయటకొస్తూ గమనిస్తే, ఒక గదిలో నిండా పేర్చిన పత్తి పంట రాశి, వ్యవసాయ పనిముట్లు మమ్మల్ని మరో గంటసేపు నిలబెట్టి వ్యవసాయం చుట్టూ తిప్పాయి. ఎంత గొప్పగా వివరిస్తున్నారు వాళ్లు? వచ్చిన మార్పును, పదేండ్ల ప్రగతి పంటను గుమిగూడిన గుంపులోనుంచి ఒక్కక్కరూ విడమరిచి చెప్తుంటే నేను, ఆ నియోజకవర్గ అభ్యర్థి చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, మాతో పాటు ఉన్న పాత్రికేయ మిత్రులందరం ఆశ్చర్యంతో వింటూ ఉండిపోయాం.
ప్రజలు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని, ఆమాటకొస్తే ఏ అభిప్రాయాన్నైనా గాలివాటం దృక్పథంతో ఏర్పరుచుకోరు. నిత్యం పంటపొలాల్లో, చేసే ప్రతి పనిలో శారీరక, మానసిక సంఘర్షణతో పాటు ఆలోచనల వాదోపవాదాలు ఏడాది పొడవునా కొనసాగుతుంటాయి. నూరు పూలు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ అనే తత్వం సహజాతి సహజంగా గ్రామాల్లో ఉంటుంది. అయితే ఏ అంతిమ జన నిశ్చితాభిప్రాయానికైనా పునాది పేర్చేది వారి అనుభవమే కానీ, ఎవరో రుద్దితే రగిలేది కానే కాదనే వాస్తవం తెలంగాణ పల్లెల్లో గడిపితే తేలిగ్గా అవగతమైపోతుంది.
కృష్ణా నదికి కూతవేటు దూరంలో, జూరాల ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న ఆత్మకూరు మండలంలోని రేచింతల గ్రామం లో, పొలంలో పనిచేస్తున్న ఇరువై మంది మహిళా రైతులతో ముచ్చట్ల సందర్భంగా.. ‘పొలాలకు నీళ్ల సంగతి కాడికిపోయినవ్ బిడ్డా, తాగేతందుకు నాలుగు బిందెల నీళ్లకు పదేండ్ల కింద ట ఎంతో గోస పడేది. బోరింగుల కాడ గాజులు, బిందెలు పగిలేది. ఎంతోమంది ఊరోళ్లం బోరింగుల వద్ద పంచాయతీ పెట్టుకొని ఏండ్లకేండ్లు మాట్లాడుకోకపోయేటిది. తాగునీటి కోసం ఊరు విడిపోయేది, ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చి కేసీఆర్ ఎంత పుణ్యం కట్టుకున్నడో ఎరుకేనా’ అని వాళ్లు పోటీ పడుతూ గలగలా మాట్లాడుతుంటే గుండెలను మెలిపెట్టినట్టయింది.
దప్పిక తీర్చుకోవడానికి తెలంగాణ తల్లులు నిత్యం ఒకరినొకరు తన్నుకుచచ్చిన నిన్నటి దుస్థితిని, నేటి మిషన్ భగీరథ నల్లా నీటిని గుర్తుచేసుకొని ఆ మహిళలు ఎంత భావోద్వేగానికి గురయ్యారో వర్ణించలేం. పల్లెవాసులదీ కల్లాకపటమెరుగని పసిపిల్లల తీరు, మేలుచేసిన వారిని ఆరాధించడంలో వారందరికీ ఆకాశమే హద్దు. ఇప్పుడు కేసీఆర్ అంటే అభిమానమేకాదు, వారికి ఆరాధ్య దీపం కూడా.
నర్వ మండలం లక్కర్‌దొడ్డి గ్రామానికి చెందిన యువకులతో ఛాయ్ దుకాణం దగ్గర మాటకలిపితే, అందులో ఎంఏ ఇంగ్లీష్ చేసి, బీసీ స్టడీ సర్కిల్‌లో అధ్యాపకుడిగా బోధిస్తున్న రాఘవేందర్.. ‘సీఎం అప్పులు చేసిండని వాగే విపక్షాలు పెరిగిన ఆస్తులు, సౌకర్యాలు, గ్రామాల్లో అమాంతం ఎన్నో రెట్లు పెరిగిన సంపద విలువ, అంతకుమించి అందరిలో పెరిగిన ధీమా, వీటన్నింటి విలువ ఎన్ని లక్షల కోట్లో లెక్కచెప్పగలరా? నూతన జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీల ఏర్పాటుతో అధికార యంత్రాంగం అందరికీ అడుగు దూరంలోకి రావడమే కాదు, కొత్త కలెక్టరేట్లను చూస్తే ఎంత గర్వంగా ఉంటుందన్నా..! అయినా పక్క రాష్ర్టాల పరిస్థితులు, మన రాష్ట్రంలో పరిస్థితులు చూసి, అర్థం చేసుకున్నోడెవడైనా కేసీఆర్‌ను కాదనుకుంటరా?’ అని చెప్పుకుంటూపోతున్నడు. ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయాలపై విలువైన విశ్లేషణలు చేశాడు.
అదేవిధంగా దేశంలోని రాజకీయపార్టీల జెండాలన్నీ ఉండే అమరచింతలో, రమేష్, అతని కుటుంబ సభ్యులను కదిలిస్తే ‘లబ్ధిదారుడు లేని గడప లేదన్నా, అంతెందుకు ఒక్క 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఎన్నిసార్లయినా ఓటేయవచ్చు. నీళ్లు ఇచ్చిండు, ఉచిత విద్యుత్తు సరఫరా చేసే, పెట్టుబడి ఇవ్వబట్టే ఇంతకన్నా జనానికి ఏం కావాలన్నా’ అంటూ ఎదురు ప్రశ్నలతో మమ్మల్నే నిలదీశారు. ఊట్కూర్ మండలంలోని పులి మామిడి, అమీన్‌పూర్, పగిడిమారి గ్రామాల్లో, మక్తల్ మండలం కర్నే, అనుగొండ, జక్లేర్ గ్రామాల్లో ఎంతోమంది ఇదే ముచ్చట్లు భట్టీ పట్టినట్టుగా గుక్కతిప్పుకోకుండా చెప్తున్నారు.
కృష్ణ మండలం కర్ణాటకలోని రాయచూరుకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడి గ్రామస్థులకు పెండ్లి సంబంధాలు, చుట్టరికాలు కర్ణాటక గ్రామవాసులతో పెద్ద ఎత్తున ఉంటాయి. ఆ మండలంలోని ముడుమళ్లు గ్రామానికి చెందిన అశోక్ కర్ణాటకకు మనువిచ్చిన చెల్లెలికి ఫోన్‌చేసి ఓపెన్ స్పీకర్ పెట్టి అక్కడి కాంగ్రెస్ సర్కార్ పనితీరు అడిగినప్పుడు, కోపంతో కన్నడిగుల యాసతో తెలుగులో హస్తం పార్టీకి పెట్టిన శాపనార్థాలు విని కడుపుబ్బా నవ్వుకొన్నాం. ‘రూ.800ల పింఛన్, గృహభాగ్య రూ.3 వేలు మొదటి నెల తప్ప, ఐదు నెలలైనా వేస్తనే లేరు. బడికి పిల్లలను పంపడానికే సరిపోని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం అని చెప్పి, ఇప్పుడు ఊర్లలో ఏ బస్సు ఆపుతనే లేర’ని ఆక్రోశం వెళ్లగక్కింది.
కాంగ్రెసోళ్లకు ఓటేస్తే పాపం తగులుతదని ఫోన్‌లో ఆ అక్క చెప్పింది సత్యమేనని అందరమనుకున్నాం. కృష్ణ గ్రామానికి చెందిన శివ్ పాటిల్, కుసుమూర్తి గ్రామ సర్పంచ్ మోనేష్ అందుకొని ‘పక్కన కర్ణాటక పల్లెల్లో ఏముందప్ప? రోడ్లు సక్కగలేవు, నీళ్లు దొరకవు, కరెంటు రాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్లు చెప్పింది ఒక్కటన్నా చేసిండ్రా? మనకు కేసీఆర్ సార్ సీఎంగా ఉంటే ఏ చింత అవసరమే లేదు, అందరినీ ఆయనే చూసుకుంటాడు’ అని అంటుంటే ఇంతలా అన్ని వర్గాల్లో భరోసా కల్పించిన పాలకుడెవరూ ఉండరేమో అనిపించింది. ప్రజల భావనలతో కలిసిపోయే పనితీరు, వారి ఆకాంక్షల వెలుగులో కార్యాచరణను అమలుచేసే బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలందరి ఉమ్మడి రాజకీయ విశ్వాసంగా మారిపోయింది. అందుకే ‘మిషన్ చాణక్య’ 110 నియోజకవర్గాల్లో 6,500 మంది ఉద్యోగులతో దాదాపు 14 లక్షల మంది నుంచి సేకరించిన అభిప్రాయంలో మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమనే వాస్తవం వెల్లడైంది. ‘మిషన్ చాణక్య’నే కాదు, ఏ సర్వే ఏజెన్సీ ప్రజా నాడికోసం జల్లెడ పట్టినా, గులాబీపార్టీదే ఘన విజయం అనే నిజం వెల్లడవుతున్నది.
మక్తల్ మనస్సులో అయినా, తెలంగాణ గ్రామాలన్నింటి గుండెల్లోనైనా కొలువై ఉన్నది కేసీఆరే అన్నది జగమెరిగిన సత్యం. నాడు దేవుని పాత్రల్లో నటించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కే అఖండ విజయం ఇచ్చి ఆశీర్వదించారు. అలాంటిది రాష్ట్రం కోసం యములోడికీ ఎదురెళ్లి, స్వయం పాలనలో సకలజనుల సంక్షేమం కోసం శ్రామికుడిగా సర్వశక్తులు ఒడ్డుతున్న సీఎం కేసీఆర్‌కు కొండంత అండగా ఉండకుండా రాష్ట్ర ప్రజారాశులు ఉండగలరా?
అందరికీ మేలు జరుగుతుందంటే, ఊపిరే అర్పించడానికీ వెరువని మన సమాజం, తెలంగాణను గర్వపడేలా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఓట్లతో ఆశీర్వదించకుండా ఉండగలదా? నేడు తెలంగాణ మూలమూలనా ‘కేసీఆర్ జిందాబాద్’ అనే నినాదమే నిటారుగా నిలబడ్డది. అప్పుడప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టుగా ప్రజలు తమ జేబులోని రూపాయిని రోడ్డు మీద పారేసుకోరు. కష్టజీవులకు నిర్మాణం విలువ తెలుసు.
భూమి దప్పిక, విత్తనం నొప్పులు తెలిసిన వారికి, పంటకోసం రేయింబవళ్లూ కొవ్వొత్తులుగా మారే రైతు లోకానికి, ఇప్పుడు తమ పంటపై నిండు పున్నమి లాంటి చంద్రుడు కేసీఆర్. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలంటే మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలని కుటుంబాలన్నీ కూడబలుక్కొని ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల రాశి ధారగా కురిసేది గులాబీ పార్టీ ఒడిలోనే. చరిత్ర తొవ్వలో ఎన్నో గండాల నుంచి గట్టెక్కిన మన తెలంగాణ ఎప్పుడూ చెడును కోరి తగిలించుకోదు.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్